సాక్షి, హైదరాబాద్: అడవి మధ్యలో ఉన్న చదునైన ప్రాంతాల్లో చెల్లాచెదురుగానో, కొండ వాలుల్లోనే గంజాయిని సాగుచేయడం ఇప్పటివరకు వింటూనే ఉన్నాం. పోలీసులు, ప్రత్యేక బలగాలు ఈ తోటల్ని గుర్తించినప్పుడు వీటిని ధ్వంసం చేస్తుంటారు. అయితే హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు ‘డ్రగ్ డిస్ట్రిబ్యూటర్’ ఎన్.ప్రవీణ్‌కుమార్‌ను విచారించినప్పుడు విశాఖపట్నం ఏజెన్సీ కేంద్రంగా జరుగుతున్న గంజాయి సాగులో కొత్త కోణం వెలుగుచూసింది.
ఆధారాల కోసం అన్వేషిస్తుంటే...
హైదరాబాద్ నుంచి విశాఖ ఏజెన్సీకి పెట్రోలియం ఈథర్... అక్కడ నుంచి సిటీకి హష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తున్న కుత్బుల్లాపూర్ వాసి ప్రవీణ్ కుమార్‌ను హెచ్–న్యూ
మంగళవారం అరెస్ట్ చేసింది. ప్రవీణ్ దందాలకు సంబం«ధించిన ఆధారాల కోసం అన్వేషిస్తూ అతడి ఫోన్‌ను తనిఖీ చేసింది. అందులో కొన్ని తోటలకు సంబంధించిన వీడియోలను గుర్తించింది.
కొండలకు సమీపంలో చదునైన ప్రాంతంలో ఉన్న అక్కడి మొక్కలకు కుదుళ్లు కట్టి ఉండటం, నీటి సరఫరా కోసం డ్రిప్ ఇరిగేషన్ పైపులు ఏర్పాటు చేయడం చూసింది. అక్రమార్జన ద్వారా అతడు కూడబెట్టిన సొమ్ముతో దాన్ని ఖరీదు చేసినట్లు భావించింది. దీనిపై ప్రవీణ్‌ను ప్రశ్నించగా... అది ఏజెన్సీలోని గూడెం మాడుగుల మండలంలోని అలగం గ్రామంలో అడవి మధ్యలో గిరిజనులు సాగుచేస్తున్న గంజాయి పంట అని అతడు చెప్పగా, అవాక్కవడం అధికారుల
వంతయింది.
అరెస్టు అయితే బెయిల్ ఇప్పిస్తాడు
సాధారణంగా డ్రగ్స్‌వంటి అక్రమ దందాలు చేసే వాళ్లు ‘క్యాష్ అండ్ క్యారీ’ లేదా అడ్వాన్స్ చెల్లిస్తేనే సరుకు సరఫరా వంటి విధానాలను అవలంబిస్తుంటారు. వీరికి రెగ్యులర్ కస్టమర్లు తక్కువ కావడంతో ఈ పంథా అనుసరిస్తారు. అయితే ప్రవీణ్ మాత్రం తన హష్ ఆయిల్ దందాను క్రెడిట్ విధానంలోనూ చేస్తున్నాడు. నగరంలో ఉన్న 15 మంది పెడ్లర్స్ (అక్రమరవాణా చేసేవారు)కు వాళ్లు ఇచ్చిన ఆర్డర్ ఆధారంగా 20 నుంచి 30 డబ్బాల (ఒక్కోటి 5 ఎంఎల్) హష్ ఆయిల్ ముందే సరఫరా చేస్తాడు.
దాన్ని వాళ్లు అమ్ముకున్న తర్వాత ప్రవీణ్‌కు డబ్బు చెల్లిస్తుంటారు. ఇతడి వద్ద పెడ్లర్స్‌గా పనిచేస్తున్న వారిలో ఎవరైనా అరెస్టు అయితే...వారికి బెయిల్ కూడా ఇప్పిస్తుంటాడు. అతడి వాట్సాప్‌లోని ఓ సందేశం ఆధారంగా పోలీసులు ఈ విషయం గుర్తించారు. ఇతడి వద్ద పనిచేసే విక్రమ్ అనే సరఫరాదారుడిని బెంగళూరు పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.
అతడికి బెయిల్ ఇవ్వడానికి అదే నగరానికి చెందిన ఓ లాయర్‌తో ప్రవీణ్ సంప్రదింపులు జరిపాడు. అందుకు అవసరమైన ఖర్చులను కూడా పంపించాడు. ఇతడి వ్యవహారాలు, నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో గుర్తించడానికి మరోసారి విచారించాలని పోలీసులు నిర్ణయించారు. దీనికోసం అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment