గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు బృందాలు
పాడేరు: విశాఖ ఏజెన్సీలో నిర్వహిస్తున్న ఆపరేషన్ పరివర్తనలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, పోలీసు బృందాలు గురువారం మొత్తం 80.8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ అన్నవరం, గొర్లమెట్ట గ్రామాల్లో 70 ఎకరాలు, జి.కె.వీధి మండలం రింతాడ పంచాయతీ మర్రిపాలెం సమీపంలో 10.8 ఎకరాల గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు.
ముందుగా ఆయా గ్రామాల్లో గిరిజనులకు గంజాయి నిర్మూలన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పోలీసుల ప్రచారాలకు ప్రభావితమైన గిరిజనులు స్వచ్ఛందంగానే గంజాయి తోటల ధ్వంసానికి ముందుకొస్తున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో జేడీ సతీష్‌కుమార్ పర్యవేక్షణలో గంజాయి తోటలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప ఎస్‌ఐ జె.లోకేష్‌కుమార్, జి.కె.వీధి ఎస్‌ఐ షేక్ షమీర్ తదితరులు పాల్గొన్నారు.
34 కిలోల గంజాయి పట్టివేత
ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం లబ్బూరు జంక్షన్ వద్ద గురువారం పోలీసులు రూ.68 వేల విలువైన 34 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఒకరు పరారయ్యారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన బొలెరో వాహనం, బైకు, స్కూటీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని మాకవరం పంచాయతీ అరబీరు గ్రామానికి చెందిన సీసా నాగేశ్వరరావు, ఒడిశా రాష్ట్రం కలహండి గ్రామానికి చెందిన పబిత్రా కటలుగా గుర్తించినట్లు ఎస్‌ఐ ఆర్.సంతోష్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment