Cannabis plantations
-
80.8 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో నిర్వహిస్తున్న ఆపరేషన్ పరివర్తనలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసు బృందాలు గురువారం మొత్తం 80.8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ అన్నవరం, గొర్లమెట్ట గ్రామాల్లో 70 ఎకరాలు, జి.కె.వీధి మండలం రింతాడ పంచాయతీ మర్రిపాలెం సమీపంలో 10.8 ఎకరాల గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. ముందుగా ఆయా గ్రామాల్లో గిరిజనులకు గంజాయి నిర్మూలన కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. పోలీసుల ప్రచారాలకు ప్రభావితమైన గిరిజనులు స్వచ్ఛందంగానే గంజాయి తోటల ధ్వంసానికి ముందుకొస్తున్నారు. జిల్లా రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ సతీష్‌కుమార్ పర్యవేక్షణలో గంజాయి తోటలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప ఎస్ఐ జె.లోకేష్‌కుమార్, జి.కె.వీధి ఎస్ఐ షేక్ షమీర్ తదితరులు పాల్గొన్నారు. 34 కిలోల గంజాయి పట్టివేత ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం లబ్బూరు జంక్షన్ వద్ద గురువారం పోలీసులు రూ.68 వేల విలువైన 34 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఒకరు పరారయ్యారు. గంజాయి అక్రమ రవాణాకు ఉపయోగించిన బొలెరో వాహనం, బైకు, స్కూటీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని మాకవరం పంచాయతీ అరబీరు గ్రామానికి చెందిన సీసా నాగేశ్వరరావు, ఒడిశా రాష్ట్రం కలహండి గ్రామానికి చెందిన పబిత్రా కటలుగా గుర్తించినట్లు ఎస్ఐ ఆర్.సంతోష్ చెప్పారు. -
గంజాయి పంట ధ్వంసం
కొయ్యూరు/డుంబ్రిగుడ: విశాఖ ఏజెన్సీ కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ నిమ్మలగొంది, బోయవుట, డుంబ్రిగుడ మండలంలోని కురిడి పంచాయతీ గోరాపూర్ గ్రామాల్లో గిరిజనులు బుధవారం 40 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. కొయ్యూరు సీఐ స్వామినాయుడు, మంప, కొయ్యూరు, డుంబ్రిగూడ ఎస్ఐలు లోకేష్‌కుమార్, దాసరినాగేంద్ర, సంతోష్‌కుమార్ బుధవారం ఆయా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు ఏకమై 40 ఎకరాల్లో గంజాయి మొక్కలను పీకి పారేశారు. ఇక మీదట గంజాయి తోటలు పెంచబోమని వారు పోలీసులకు తెలిపారు. సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ గిరిజనుల్లో చైతన్యం వచ్చిందని, స్వచ్ఛందంగా వారే గంజాయిని ధ్వంసం చేస్తున్నారని తెలిపారు. -
మరో 287 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసు శాఖ, ఎస్ఈబీ బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. జిల్లా ఎస్పీ కృష్ణారావు, ఎస్ఈబీ జేడీ ఎస్.సతీష్‌కుమార్‌ల ఆదేశాల మేరకు మంగళవారం జరిపిన దాడుల్లో ఏజెన్సీలోని జి.మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలో మొత్తం 287 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ గచ్చుపల్లి పరిసర ప్రాంతాల్లో 77 ఎకరాలు, జి.కె.వీధి మండలంలోని గొందిపల్లి, పి.కొత్తూరు, సిల్లిగూడ గ్రామ సమీపంలోని 18 ఎకరాలు, జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ పరిధిలోని కె.పెదబయలు గ్రామ పరిసరాల్లో 40 ఎకరాల్లో గంజాయి పంటను పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే పెదబయలు మండలంలోని గుల్లెలు, గోమంగి పంచాయతీల్లోని చావిడిమామిడి, గుల్లెలు, దల్లెలు గ్రామాల్లో 152 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలన్నింటినీ నరికి నిప్పటించారు. కళాజాత ద్వారా ప్రచారం హుకుంపేట మండలంలోని కొట్నాపల్లి, చీడిపుట్టు, దాలిగుమ్మడి గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా గంజాయి వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టారు. గంజాయి సాగు, రవాణా ద్వారా గిరిజన ప్రాంతాలకు జరుగుతున్న అనర్ధాలు, జైలు జీవితంతో దుర్భర బతుకులు, తదితర అంశాలపై పాటలు, నృత్య రూపకాల ద్వారా అవగాహన కల్పించారు. -
288 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు : ఆపరేషన్ పరివర్తనలో భాగంగా విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలు రోజువారీ గంజాయి తోటలపై దాడులు చేపడుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లోని 288 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శంకర్‌రెడ్డి చెప్పారు. జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ బీరం, గడ్డిబందలు, అనర్భ, వెంకటపాలెం, చెలమరంగి గ్రామాల సమీపంలోని 211 ఎకరాలు, డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ గంజిగుడ, కండ్రూం గ్రామాల సమీపంలోని 15 ఎకరాలు, చింతపల్లి మండలం అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోటగున్నల కాలనీ, చోడిరాయి, రామారావుపాలెం గ్రామాల్లోని 62 ఎకరాల్లోని గంజాయి తోటలన్నింటినీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసుశాఖ బృందాలు ధ్వంసం చేశాయి. చింతపల్లి మండలం బెన్నవరం, లోతుగెడ్డ, అన్నవరం గ్రామాల్లో కళాజాత బృందాలు గంజాయి వలన జరిగే అనర్థాలపై గిరిజనులకు పాటలు, నృత్య రూపకాల ద్వారా అవగాహన కల్పించారు. -
ఏజెన్సీలో 102 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
పాడేరు/గూడెంకొత్తవీధి: విశాఖ ఏజెన్సీలో శనివారం 102 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, సూపరింటెండెంట్ గోపాల్ పర్యవేక్షణలో జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ వి.కోడాపల్లి ప్రాంతంలో 54 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. రెండు లక్షల 70 వేల మొక్కలను నరికివేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, ఎస్ఈబీ బృందం, సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు జి.కె.వీధి మండలంలో సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐ షమీర్ ఆధ్వర్యంలో రింతాడ పంచాయతీ కోరాపల్లి గ్రామంలో గంజాయి నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం గంజాయి సాగు జోలికి పోమని వారితో తీర్మానం చేయించారు. 8 ఎకరాల్లో తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని కుడుమసారి పంచాయతీ కోటగున్నెల, లోతుగెడ్డ పంచాయతీ మేడూరు గ్రామాల్లో 40 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం చేశారు. 760 కిలోల గంజాయి స్వాధీనం కశింకోట: విశాఖ జిల్లా మండలంలోని బయ్యవరం వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దర్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఏజెన్సీలోని జి.మాడుగుల మండలం నుంచి గంజాయి కొనుగోలు చేసి చెన్నైకు బొలెరో వాహనంలో తరలిస్తుండగా బయ్యవరం వద్ద పట్టుకున్నామన్నారు. ఈ సందర్భంగా చీడికాడకు చెందిన గ్రామానికి చెందిన డ్రైవర్ కొల్లివలస శ్రీను, బుచ్చియ్యపేట మండలం అప్పన్నపాలెం గ్రామానికి చెందిన జి.బత్తుల సంతోష్‌లను అరెస్టు చేశామన్నారు. 760 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దీని ఖరీదు రూ.15 లక్షలు ఉంటుందన్నారు. -
గంజాయి తోటల నిర్మూలనే లక్ష్యం
పాడేరు/చింతపల్లి: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) బృందాలు పనిచేస్తున్నాయని ఆ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఏజెన్సీలో గురువారం మొత్తం 190 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. ఏజెన్సీలోని పెదబయలు మండలం మారుమూల మావోయిస్టు ప్రభావిత పూటూరు, పంగలం గ్రామాల పరిధిలోని గంజాయి తోటల ధ్వంసాన్ని ఆయన గురువారం పర్యవేక్షించారు. ఈ మారుమూల గ్రామాలకు కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్‌తో పాటు ఎస్ఈబీ విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఏడు ఎస్ఈబీ బృందాల సభ్యులు వెళ్లారు. ఇక్కడ సాగవుతున్న గంజాయి తోటలను కమిషనర్ పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 115 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. సుమారు 5.75 లక్షల గంజాయి మొక్కలను నరికేసి నిప్పంటించారు. చింతపల్లి మండలం అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలోని కొండపల్లి, వర్తనపల్లి గ్రామాల పరిధిలో సుమారు 75 ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని గురువారం గిరిజనులతో కలిసి ఏఎస్పీ తుషార్ డూడి ధ్వంసం చేశారు. అన్నవరం ఎస్ఐ ప్రశాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 120 కిలోల గంజాయి పట్టివేత ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు గురువారం రూ.2.4 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. మండలంలోని జోలాపుట్టు నుంచి ముంచంగిపుట్టు మార్గంలో గుమ్మసీర్గంపుట్టు వద్ద వనుగుమ్మ నుంచి వస్తున్న ఎపి35టి9551 నంబరు జీపులో తనిఖీ చేసి 6 బస్తాల గంజాయిని పట్టుకున్నట్లు స్థానిక ఎస్ఐ ఆర్.సంతోష్ చెప్పారు. జీపులో ఉన్న నలుగురిని, జీపు వెనక బైకుపై పైలెటింగ్ చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయిని, జీపును, బైకును సీజ్‌చేశామన్నారు. నిందితుల వద్ద ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్ఐ తెలిపారు. -
AP: 239 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో గంజాయి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం 239 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల జగ్గంపేట, సీమకొండ, రంజెలమంది గ్రామాల సమీపంలో సుమారు 216 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను ఎస్ఈబీకి చెందిన ఏడు బృందాలు ధ్వంసం చేశాయి. 10.8 లక్షల గంజాయి మొక్కలను నరికేసి వాటికి నిప్పంటించారు. చింతపల్లి మండలం మేడూరు గ్రామ సమీపంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తుల సహకారంతో 15 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలకు నిప్పంటించారు. పాడేరు మండలంలోని ఇరడాపల్లి సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న కనక ఆధ్వర్యంలో గిరిజనులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, వలంటీర్ల సహకారంతో 8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. -
37 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం
గూడెంకొత్తవీధి/డుంబ్రిగుడ/కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో మంగళవారం 37 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల, జి.కె.వీధి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జర్రెల పంచాయతీలోని పలు గ్రామాల్లో సర్పంచ్ వీరోజి నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 5 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జి.కె.వీధి పంచాయతీలోని బి.కొత్తూరు, డి.కొత్తూరు గ్రామాల పరిధిలో జి.కె.వీధి సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐ షమీర్ ఆధ్వర్యంలో 20 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసి మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని అన్నవరం స్టేషన్ పరిధిలో గచ్చిపల్లి సమీపంలోని సుమారు 6 ఎకరాల్లోని గంజాయి తోటలను ఎస్ఐ ప్రశాంత్‌కుమార్ సమక్షంలో ధ్వంసం చేశారు. డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ కొంతుగుడ గ్రామంలో ఎస్ఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో 6 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. 46 కిలోల గంజాయి పట్టివేత గొలుగొండ ఎస్ఈబీ సీఐ రాజారావు ఆధ్వర్యంలో మంగళవారం డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద 46 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి ప్రాంతం నుంచి టాటా నానో కారులో గంజాయి ప్యాకెట్లను తీసుకెళ్తుండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.లక్ష వరకు ఉంటుంది. కారు, ద్విచక్ర వాహనం, నాలుగు ఫోన్లు, రూ.1,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. డుంబ్రిగుడకు చెందిన బి.రాజారావును, పాములవాకకు చెందిన సీహెచ్ నానిబాబు, హుకుంపేటకు చెందిన జి.రంగారావు, వి.రాజులను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. -
కొనసాగుతున్న గంజాయి తోటల ధ్వంసం
సీలేరు/డుంబ్రిగుడ: ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు స్వచ్ఛందంగా విశాఖ ఏజెన్సీలోని గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. సీలేరు ఎస్ఐ రంజిత్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో విశాఖపట్నం జిల్లా ధారకొండ పంచాయతీ చిన్నగంగవరం గ్రామ పరిధిలోని గంజాయి తోటలను స్థానికులు సోమవారం నరికేశారు. అలాగే డుంబ్రిగుడ మండలంలోని సాగర పంచాయతీ కొసోంగుడ, బల్లిగెడ్డ గ్రామాల్లో కూడా సర్పంచ్ తౌడమ్మ, ఎంపీటీసీ దేవదాసుల ఆధ్వర్యంలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అరకు సీఐ జి.డి.బాబు మాట్లాడుతూ.. గంజాయి పండించి జైలు పాలు కావద్దని.. కుటుంబాలను రోడ్డున పడవేయద్దని హితవు పలికారు. -
ఖైదీని పట్టుకోబోతే గంజాయి దొరికింది
సిర్పూర్(యూ): జైలు తప్పించుకున్న ఖైదీని వెదుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ఖైదీతోపాటు గంజాయి దొరికింది. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ ఖైదీ మూడు రోజుల క్రితం పోలీసుల నుంచి తప్పించుకుని కుమ్రుంభీం జిల్లా లింగాపూర్ మండల పరిధిలోని రాఘవాపూర్ ప్రాంతంలోని ఓ పొలం వద్ద తలదాచుకున్నాడు. ఖైదీ వద్ద ఉన్న ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడిని వెదుక్కుంటూ వెళ్లిన ప్రత్యేక పోలీసుల బృందానికి శనివారం ఓ పొలం వద్ద 20 గంజాయి మొక్కలతో పట్టుబడ్డాడు. గంజాయి మొక్కల గురించి ఖైదీని ఆరా తీయగా... ఇక్కడే తాను ఓ పొలం నుంచి వీటిని సేకరించినట్లు వెల్లడించాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఆదివారం తెలపనున్నట్లు తెలుస్తోంది. ఖైదీనుంచి గంజాయి మొక్కల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా... సిర్పూర్(యు) మండలంలోని మత్తూరతండా ప్రాంతంలో కూడా గంజాయి సాగవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా..అక్కడ కూడా తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. -
గంజాయి ‘సాగు’తోంది
జిల్లాలో మళ్లీ గంజాయి వాసన గుప్పుమంటోంది. పంట చేలలో అంతరపంటగా సాగవుతోంది. ఒకప్పుడు పెద్ద ఎత్తున గంజాయి సాగైన గాంధారి మండలంలోనే మరోసారి ఆనవాళ్లు లభించాయి. రవాణాకూ ఇదే ప్రాంతం అడ్డాగా మారడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్ద కాలం క్రితం వరకు భారీ ఎత్తున గంజాయి పంట సాగైంది. గంజాయి సాగుతో పాటు దందా కూడా పెద్ద ఎత్తున చేశారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా జరిగేది. అయితే ప్రభుత్వం గంజాయిపై కఠినంగా వ్యవహరించడంతో అప్పట్లో గంజాయి సాగు ఆగిపోయింది. అయినా ఎక్కడో ఒకచోట గంజాయి మొక్కలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇటీవల గాంధారి మండలంలోని సీతాయిపల్లి శివారులో గల మక్క చేనులో ఆనవాళ్లు లభించాయి. మక్క చేనులో అంతరపంటగా సాగవుతున్న గంజాయి మొక్కలను పీకేయించి సాగుదారులపై కేసులు నమోదు చేశారు. అంతరపంటగా.. మక్క చేను, కూరగాయల మొక్కల మధ్య గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గుడుంబా తయారీని అరికట్టామని, గంజాయి వాసన లేకుండా చేశామని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. కానీ వాటి ఆనవాళ్లు ఇంకా ఉండడం గమనార్హం. జిల్లాలోని అటవీ ప్రాంతంలో, పలు గ్రామాల్లో పంట చేలల్లో గంజాయి సాగవుతున్నట్టు తెలుస్తోంది. వైజాగ్ టు మహారాష్ట్ర వయా గాంధారి... గంజాయి అక్రమ రవాణాకు గాంధారి అడ్డాగా మారింది. రెండు నెలల కాలంలో గంజాయిని తరలిస్తుండగా గాంధారి ప్రాంతంలో రెండుసార్లు పట్టుకున్నారు. గత డిసెంబర్లో 58 కిలోల గంజాయిని, జనవరిలో 3 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో గంజాయి దందాలో రాటుదేలిన వాళ్లు ఇప్పటికీ ఆ దందాను మరిచిపోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ ప్రాంతం నుంచి గంజాయిని మహారాష్ట్రకు పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. ఈ రవాణా గాంధారి మీదుగా సాగుతోందని తెలుస్తోంది. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ సంఘటనలు కూడా గాంధారిలోనే జరగడం, తాజాగా గంజాయి సాగు వ్యవహారం కూడా అదే మండలంలో వెలుగు చూడడంతో గంజాయి మూలాలు ఇంకా పోలేదని భావిస్తున్నారు. గంజాయిపై మరింత నిఘా వేయాల్సిన అవసరం ఉంది. గంజాయి సాగు చేస్తే కేసులు తప్పవు గంజాయి సాగు, రవాణా చేయడం నేరాలు. గంజాయి అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కేసుల్లో ఇరుక్కున్నవారు ఇబ్బందులు పడతారు. గంజాయి సాగుపై నిఘా ఉంచాం. పంట చేనులో గంజాయి సాగు చేస్తే సాగుదారుతోపాటు భూమి యజమానిపై కూడా కేసులు పెడ్తాం. – శ్రీనివాస్,ఎక్సైజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి జిల్లా -
గంజాయి తోటలపై ఎక్సైజ్ దాడులు
మనూరు, న్యూస్‌లైన్ : గంజాయి క్షేత్రాలపై జిల్లా ఎక్సై జ్ సూపరింటెండెంట్ హరికిషన్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి సుమారు రూ. 15 కోట్లు విలువ చేసే మొక్కలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మనూరు మండ లం ఇరక్‌పల్లి పంచాయతీ శామనాయక్ తండాల్లో 15 ఎకరాల గంజాయిని సాగు చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో గురువారం సిబ్బంది దాడులు నిర్వహించినట్లు వివరించారు. పంట మొత్తాన్ని, కూలీలు, ట్రాక్టర్ పెట్టి దున్ని వేయించినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా సాగుదారులను గుర్తించి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్, నారాయణఖేడ్ ఇన్చార్జ్ సీఐ సూర్యప్రకాష్, ఎస్ఐలు కుర్మయ్య, మురళీధర్, లక్ష్మీనారాయణ, పట్టాభి సిబ్బంది పాల్గొన్నారు.