
విశాఖ జిల్లా సాగర పంచాయతీలో గంజాయి తోటలను ధ్వంసం చేసిన గిరిజనులు
సీలేరు/డుంబ్రిగుడ: ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలతో గిరిజనులు స్వచ్ఛందంగా విశాఖ ఏజెన్సీలోని గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు. సీలేరు ఎస్‌ఐ రంజిత్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలతో విశాఖపట్నం జిల్లా ధారకొండ పంచాయతీ చిన్నగంగవరం గ్రామ పరిధిలోని గంజాయి తోటలను స్థానికులు సోమవారం నరికేశారు. అలాగే డుంబ్రిగుడ మండలంలోని సాగర పంచాయతీ కొసోంగుడ, బల్లిగెడ్డ గ్రామాల్లో కూడా సర్పంచ్ తౌడమ్మ, ఎంపీటీసీ దేవదాసుల ఆధ్వర్యంలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అరకు సీఐ జి.డి.బాబు మాట్లాడుతూ.. గంజాయి పండించి జైలు పాలు కావద్దని.. కుటుంబాలను రోడ్డున పడవేయద్దని హితవు పలికారు.