జిల్లాలో మళ్లీ గంజాయి వాసన గుప్పుమంటోంది. పంట చేలలో అంతరపంటగా సాగవుతోంది. ఒకప్పుడు పెద్ద ఎత్తున గంజాయి సాగైన గాంధారి మండలంలోనే మరోసారి ఆనవాళ్లు లభించాయి. రవాణాకూ ఇదే ప్రాంతం అడ్డాగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దశాబ్ద కాలం క్రితం వరకు భారీ ఎత్తున గంజాయి పంట సాగైంది. గంజాయి సాగుతో పాటు దందా కూడా పెద్ద ఎత్తున చేశారు. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి రవాణా జరిగేది. అయితే ప్రభుత్వం గంజాయిపై కఠినంగా వ్యవహరించడంతో అప్పట్లో గంజాయి సాగు ఆగిపోయింది. అయినా ఎక్కడో ఒకచోట గంజాయి మొక్కలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇటీవల గాంధారి మండలంలోని సీతాయిపల్లి శివారులో గల మక్క చేనులో ఆనవాళ్లు లభించాయి. మక్క చేనులో అంతరపంటగా సాగవుతున్న గంజాయి మొక్కలను పీకేయించి సాగుదారులపై కేసులు నమోదు చేశారు.
అంతరపంటగా..
మక్క చేను, కూరగాయల మొక్కల మధ్య గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గుడుంబా తయారీని అరికట్టామని, గంజాయి వాసన లేకుండా చేశామని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. కానీ వాటి ఆనవాళ్లు ఇంకా ఉండడం గమనార్హం. జిల్లాలోని అటవీ ప్రాంతంలో, పలు గ్రామాల్లో పంట చేలల్లో గంజాయి సాగవుతున్నట్టు తెలుస్తోంది.
వైజాగ్ టు మహారాష్ట్ర వయా గాంధారి...
గంజాయి అక్రమ రవాణాకు గాంధారి అడ్డాగా మారింది. రెండు నెలల కాలంలో గంజాయిని తరలిస్తుండగా గాంధారి ప్రాంతంలో రెండుసార్లు పట్టుకున్నారు. గత డిసెంబర్‌లో 58 కిలోల గంజాయిని, జనవరిలో 3 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో గంజాయి దందాలో రాటుదేలిన వాళ్లు ఇప్పటికీ ఆ దందాను మరిచిపోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ ప్రాంతం నుంచి గంజాయిని మహారాష్ట్రకు పెద్ద ఎత్తున తరలిస్తుంటారు. ఈ రవాణా గాంధారి మీదుగా సాగుతోందని తెలుస్తోంది. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ సంఘటనలు కూడా గాంధారిలోనే జరగడం, తాజాగా గంజాయి సాగు వ్యవహారం కూడా అదే మండలంలో వెలుగు చూడడంతో గంజాయి మూలాలు ఇంకా పోలేదని భావిస్తున్నారు. గంజాయిపై మరింత నిఘా వేయాల్సిన అవసరం ఉంది.
గంజాయి సాగు చేస్తే కేసులు తప్పవు
గంజాయి సాగు, రవాణా చేయడం నేరాలు. గంజాయి అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కేసుల్లో ఇరుక్కున్నవారు ఇబ్బందులు పడతారు. గంజాయి సాగుపై నిఘా ఉంచాం. పంట చేనులో గంజాయి సాగు చేస్తే సాగుదారుతోపాటు భూమి యజమానిపై కూడా కేసులు పెడ్తాం.
– శ్రీనివాస్,ఎక్సైజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment