
ధ్వంసం చేసిన గంజాయి మొక్కలతో ఎస్‌ఈబీ అని రాసిన పోలీసులు
పాడేరు: విశాఖ ఏజెన్సీలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో గంజాయి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం 239 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల జగ్గంపేట, సీమకొండ, రంజెలమంది గ్రామాల సమీపంలో సుమారు 216 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను ఎస్‌ఈబీకి చెందిన ఏడు బృందాలు ధ్వంసం చేశాయి. 10.8 లక్షల గంజాయి మొక్కలను నరికేసి వాటికి నిప్పంటించారు.
చింతపల్లి మండలం మేడూరు గ్రామ సమీపంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తుల సహకారంతో 15 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలకు నిప్పంటించారు. పాడేరు మండలంలోని ఇరడాపల్లి సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న కనక ఆధ్వర్యంలో గిరిజనులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, వలంటీర్ల సహకారంతో 8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు.