Cannabis Mafia
-
గంజాయి దందాకు ఉమ్మడి బ్రేక్
సాక్షి, అమరావతి: సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాలతో నిఘాను పటిష్టం చేస్తోంది. మొదటిదశగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో రెండురాష్ట్రాల పోలీసులు సంయుక్త కార్యాచరణ చేపట్టారు. దేశంలో ఇలా గంజాయి దందాకు అడ్డుకట్ట వేసేందుకు ఇతర రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టిన తొలిరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తరువాత దశల్లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలతో కూడా ఉమ్మడి కార్యాచరణను విస్తరించాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఆపరేషన్ పరివర్తన్ ద్వారా రాష్ట్రంలో గంజాయి సాగును దాదాపుగా ధ్వంసం చేసినప్పటికీ సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమంగా సాగుచేస్తున్న గంజాయిని రవాణా చేసేందుకు మన రాష్ట్ర భూభాగాన్ని గేట్వేగా ఉపయోగిస్తున్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన గంజాయి ముఠాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కొనుగోలు చేసిన గంజాయిని అల్లూరి సీతారామరాజు జిల్లా ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ గంజాయి దందాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ పోలీసు శాఖ ఒడిశా పోలీసులతో కలిసి కొన్ని నెలల కిందటే సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ/ఓఎస్డీ, డీఎస్పీలు, ఒడిశాలోని కోరాపుట్, మల్కనగిరి, జైపూర్ జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఒడిశాలో గంజాయి సాగును శాసిస్తున్న ముఠాల వివరాలను కూడా ఏపీ పోలీసులు ఆ రాష్ట్ర పోలీసులకు అందించారు. ఏపీ పోలీసులు ఇచ్చిన 38 మంది గంజాయి స్మగ్లర్ల వివరాల మేరకు ఆయా గ్రామాల్లో ఒడిశా ప్రత్యేక పోలీసు బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. మరోవైపు రెండు రాష్ట్రాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులను భాగస్వాములుగా చేసుకుని నిఘాను పటిష్టం చేశారు. ప్రధానంగా ఒడిశాలోని చిత్రకొండ, జోలాపుట్, మల్కనగిరి ప్రాంతాల నుంచి మన రాష్ట్రానికి అనుసంధానించే ప్రధాన రహదారులతోపాటు ఇతర మార్గాల్లో గస్తీని ముమ్మరం చేశారు. ఆ మార్గాల్లో ఇప్పటికే అటు ఒడిశా, ఇటు ఏపీ వైపు కొత్తగా ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒడిశా వైపు చిత్రకొండ, సుకుమా, జోలాపుట్, పడువ, సిమిలిగూడల్లో ఒడిశాకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలోని సీలేరు, డొంకరాయి, మారేడుమిల్లి, రంపచోడవరం, గోకవరం, మోతుగూడేల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) బృందాలు తనిఖీలు విస్తృతం చేశాయి. త్వరలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణలతో కలిసి.. ఇదే తరహాలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసులతో కూడా కలిసి త్వరలో కార్యాచరణ చేపట్టాలని ఏపీ పోలీసు శాఖ భావిస్తోంది. అందుకోసం ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖతో ఇప్పటికే ప్రాథమికంగా చర్చించింది. త్వరలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో కూడా ఏపీ పోలీసు ఉన్నతాధికారులు చర్చించనున్నారు. పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి ఎప్పటికప్పుడు నివేదిస్తున్నారు. మన రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన్‌ను విజయవంతంగా నిర్వహించిన తీరును ఎన్సీబీ నిశితంగా పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల వ్యూహాన్ని అనుసరించమని ఇతర రాష్ట్రాలకు సూచించింది కూడా. గంజాయి ప్రభావిత రాష్ట్రాల డీజీపీలతో త్వరలో ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఎన్సీబీ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. -
రాష్ట్రంలో గంజాయికి అడ్డుకట్ట
దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో గంజాయి, ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా త్వరలోనే పొరుగు రాష్ట్రాల అధికారులతో తిరుపతిలో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి కట్టడిపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని చెప్పారు. ఈ ఏడాది 1.32 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 1,599 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులు 12 రాష్ట్రాలకు చెందిన వారని, వారందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. సైబర్ కేసులను ఛేదించడానికి అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఏడాదిలోగా 6,500 మంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 47 వేల కేసులు పరిష్కారం రాష్ట్ర వ్యాప్తంగా లోక్ అదాలత్ ద్వారా 47 వేల కేసులు పరిష్కారమయ్యాయని, వీటిలో పెండింగ్‌తో పాటు విచారణలో ఉన్న 36 వేలు ఐపీసీ కేసులు ఉన్నాయన్నారు. లక్ష వరకు పెట్టీ కేసులను కూడా పరిష్కరించినట్లు చెప్పారు. న్యాయ వ్యవస్థతో సమన్వయం చేస్తూ ఒకే లోక్ అదాలత్‌లో ఇంత పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్రంలోని పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. దోషులకు సత్వరమే శిక్ష పడేలా సమగ్ర విచారణ దోషులకు సత్వరమే శిక్ష పడేలా నేర నిరూపణలో వేగవంతమైన, సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం స్వయంగా ఎస్పీలే నాలుగైదు పెండింగ్ కేసులు పర్యవేక్షించేలా ఆదేశించామని, దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ పర్యవేక్షణలో దిశ స్టేషన్లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్లు శిక్ష పడేలా చేశారని తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రంలో మరో రెండు నెలల్లో 120 కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని డీజీపీ అభినందించారు. విశాఖలో నేరాలు అదుపులో ఉన్నాయని చెప్పారు. హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని వివరించారు. ఈ సమావేశంలో, విశాఖ డీఐజీ హరికృష్ణ, విశాఖ నగర సీపీ సీహెచ్ శ్రీకాంత్, డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుమిత్ సునీల్ గరుడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘గంజాయి’ నిరోధంలో 'ఏపీ టాప్'
సాక్షి, అమరావతి: ‘గంజాయిలో టాప్’ అనటానికి... ‘గంజాయిని నిరోధించటంలో టాప్’ అనటానికి తేడా లేదా? ఈ తేడా ‘ఈనాడు’ పత్రికకో, దాని అధిపతి రామోజీరావుకో తెలియదా? తెలియకేమీ కాదు. ఆంధ్రప్రదేశ్‌ను ఏలుతున్నది తమ బాబు కాదు కాబట్టి... ఎంత వీలైతే అంత బురద జల్లాలి. నిజాలు చెప్పి బురద జల్లలేరు కాబట్టి... వీలైనంత తప్పుదోవ పట్టించాలి. గురువారం ‘ఈనాడు’ ప్రచురించిన వార్త ఇలాంటిదే. దేశవ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకుంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, ఇక్కడే ఈ ఏడాది ఎక్కువ గంజాయిని పట్టుకున్నారని, ఎక్కువ కేసులు పెట్టారని, ఎక్కువ విస్తీర్ణంలో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారని జాతీయ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదిక ఇచ్చింది. షరామామూలుగా ‘ఈనాడు’ తన పైత్యాన్ని జోడించి ‘గంజాయిలో ఏపీ టాప్’ అని శీర్షిక పెట్టేసింది. లోపల నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదికలోని అంశాలనే పేర్కొంది. నిజానికి గంజాయి సమస్య కొన్ని దశాబ్దాలుగా ఉన్నా... వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకే దీనిపై సమగ్ర కార్యాచరణ మొదలెట్టింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ప్రత్యేకంగా ఏర్పాటు చేయటంతో పాటు... గంజాయి సాగుకు అలవాటుపడ్డ గిరిజనుల్ని మార్చి, ఇతర పంటలు వేయిస్తూ ఆపరేషన్ ‘పరివర్తన్’ కూడా అమలు చేస్తోంది. ఎన్సీబీ నివేదికలోని వాస్తవాలివీ... గంజాయి దందాపై ఉక్కుపాదం మోపడంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని ఎన్సీబీ వెల్లడించింది. గంజాయి సాగు ధ్వంసం, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది. దేశంలో 12 రాష్ట్రాల్లో గంజాయి సాగవుతోంది. దీని సాగును అడ్డుకోడానికి ఏపీ ఒక్క రాష్ట్రమే ప్రత్యేక కార్యాచరణను చేపట్టిందని వెల్లడించింది. అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణాను కూడా ఏపీ సమర్థంగా నిరోధిస్తోందని తెలిపింది. ఎన్సీబీ నివేదికలోని అంశాలు సంక్షిప్తంగా.. 40 శాతం పంట ధ్వంసం ఏపీలోనే.. గంజాయి పంటను ధ్వంసం చేయడంలో 2021లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఏపీతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ–కశ్మీర్, త్రిపుర రాష్ట్రాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. ఈ రాష్ట్రాల్లో మొత్తం 27,510 ఎకరాల్లో గంజాయిని ధ్వంసం చేశారు. అందులో ఒక్క ఏపీలోనే అత్యధికంగా 11,550 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు. అంటే 40% గంజాయి పంటను ఏపీ పోలీసు శాఖే ధ్వంసం చేసింది. తరువాతి స్థానంలో ఒడిశా 3,500 ఎకరాలు, జమ్మూ–కశ్మీర్ 3 వేల ఎకరాలు, తెలంగాణ 2 వేల ఎకరాలు, మహారాష్ట్ర 1,500 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశాయి. మిగిలిన అన్ని రాష్ట్రాలుకలిపి 5,960 ఎకరాల్లో ఈ పంటను నాశనం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో ‘ఆపరేషన్ పరివర్తన్’ ద్వారా భారీ స్థాయిలో గంజాయి పంటను పెకలించడంతోనే ఇది సాధ్యపడింది. గంజాయి సాగుకు వ్యతిరేకంగా అంత భారీ ఆపరేషన్ చేపట్టడం దేశంలో ఇదే తొలిసారి. అక్రమ రవాణాకు సమర్థంగా అడ్డుకట్ట గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూడా ఆంధ్రప్రదేశ్ సమర్థవంతమైన పాత్ర నిర్వర్తించింది. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తోంది. 2021లో దేశం మొత్తం మీద అక్రమంగా రవాణా అవుతున్న 7.49 లక్షల కిలోల గంజాయిని కేంద్ర, రాష్ట్ర పోలీసు విభాగాలు జప్తు చేశాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సమర్థంగా వ్యవహరించి అత్యధికంగా 2.04 లక్షల కేజీల గంజాయిని జప్తు చేసింది. ఆపరేషన్ పరివర్తన్ కింద సాగు చేçస్తున్న గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు వివిధ మార్గాల్లో సాగుతున్న అంతర్రాష్ట్ర గంజాయి రవాణాను అడ్డుకుంది. స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తాన్ని అనకాపల్లి సమీపంలో ఒకేసారి కాల్చివేసింది. ఇంత భారీస్థాయిలో గంజాయిని పట్టుకోవడం, కాల్చివేయడం దేశంలో ఇదే తొలిసారి. ఏపీ తరువాత స్థానంలో ఒడిశా 1.70 లక్షల కిలోల గంజాయిని జప్తు చేసింది. ద్రవ రూపంలో మార్చిన లిక్విడ్ గంజాయి (హషీష్ ఆయిల్) అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూడా ఏపీ ఇతర రాష్ట్రాలకంటే ముందుంది. 2021లో ఏపీ పోలీసు శాఖ దేశంలోనే అత్యధికంగా 18.14 లీటర్ల హషీష్ ఆయిల్‌ను జప్తు చేసింది. -
గంజాయి స్మగ్లర్లను తప్పించేందుకు.. పేట్రేగిన ‘పచ్చ’ మూకలు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో గత రెండ్రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు టీడీపీ నేతల ఆగడాలు వారి నాటకాలను బట్టబయలు చేసింది. గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకునే క్రమంలో వారు నిందితుడ్ని తప్పించడం.. మాజీ మేయర్ హేమలతను పోలీసు జీపు పొరపాటున ఢీకొట్టడం.. దీనికి ప్రతిగా పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడి వాహనాలు ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేకున్నా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం ఈ మొత్తం వివాదాన్ని సీఎంకు ఆపాదిస్తూ ట్వీట్లు చేయడం హాస్యాస్పదంగా మారింది. ఏం జరిగిందంటే..? ఈ వివాదానికి సంబంధించి పోలీసులు చెబుతున్న సమాచారం మేరకు.. చిత్తూరు నగరంలోని సంతపేట సాయినగర్‌కు చెందిన పూర్ణ గంజాయి తెప్పించి విక్రయిస్తున్నట్లు టూటౌన్ సీఐ యతీంద్రకు గురువారం రాత్రి సమాచారం అందింది. తన సిబ్బందితో వెళ్లిన యతీంద్ర.. పూర్ణ నివాసంలో తనిఖీలుచేస్తే రెండు కిలోల గంజాయి లభించింది. స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తే ఓబనపల్లె వద్ద ఉన్న తన సమీప బంధువు ప్రసన్న అనే వ్యక్తి గంజాయి విక్రయించాలని తనకు ఇస్తే, తాను విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. ప్రసన్న ఇంట్లో 18 కిలోల గంజాయి లభించింది. దీంతో.. ప్రసన్న ప్రధాన నిందితుడిగా, పూర్ణ రెండో నిందితుడిగా పోలీసులు కేసు నమోదుచేశారు. పోలీసులు పూర్ణ, గంజాయిని తీసుకెళ్తుండగా మాజీ మేయర్, టీడీపీ నాయకురాలు హేమలత, కంద, గోపి, కిషోర్ తదితరులు ఓబనపల్లె బైపాస్ రోడ్డు వద్దకు చేరుకున్నారు. మాజీ మేయర్ అనురాధ, మోహన్ జంట హత్యల కేసులో పూర్ణ కోర్టులో సాక్ష్యం చెప్పకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. పూర్ణను పోలీసులు తీసుకెళ్లకుండా హేమలత జీపు వెనుక బైఠాయించారు. దాదాపు 40 మంది వరకు ఘటనలో గుమికూడటంతో పూర్ణను తీసుకెళ్తున్న పోలీసు జీపు రివర్స్ చేస్తుండగా పొరపాటున హేమలతను ఢీకొట్టింది. ఇదే సమయంలో టీడీపీ శ్రేణులు పూర్ణను తప్పించేశారు. మరోవైపు.. టీడీపీ శ్రేణులు డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టి, జీపు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు 10మందికి పైగా హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ పూర్ణను పోలీసు జీపు నుంచి తప్పిస్తున్న టీడీపీ శ్రేణులు హాస్యాస్పదంగా చంద్రబాబు ట్వీట్లు వాస్తవానికి.. కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ 2015లో హత్యకు గురయ్యారు. ఈ జంట హత్యల కేసు ట్రయల్ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. సాక్షులను కొందరు బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఇందులో వైఎస్సార్సీపీ వాళ్లకు ఎలాంటి సంబంధంలేదని కటారి కుటుంబం రెండ్రోజుల ముందు మీడియాకు చెప్పింది. కానీ, హేమలతపైకి కారు ఎక్కించడం, పూర్ణ ఇంట్లో గంజాయి దొరకడం అన్నీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతోనే అంటూ చంద్రబాబునాయుడు ట్వీట్లు చేయడం హాస్యాస్పదంగా మారింది. ఈ ఘటనను పూర్తిగా రాజకీయం చేయడానికి మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి, టీడీపీ నేతలు నాని, దొరబాబు తదితరులు రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరినీ ఉపేక్షించేది లేదు హేమలతపై కావాలనే కారు ఎక్కించారని టీడీపీ వారు ఫిర్యాదు చేశారు. వాళ్లిచ్చిన వీడియోలు చూస్తే డ్రైవర్ చూసుకోకుండా వెనక్కి రివర్స్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఇక పోలీసు కస్టడీలో ఉన్న గంజాయి స్మగ్లర్ పూర్ణను తప్పించడం, గంజాయిని పారపోయడం.. పోలీసు జీపు ధ్వంసం చేయడం సరైన పద్ధతికాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరినీ ఉపేక్షించం. కఠినంగా వ్యవహరిస్తాం. పోలీసులపై భౌతిక దాడికి పాల్పడి ఔట్ఆఫ్లాగా వ్యవహరిస్తే సహించే ప్రసక్తేలేదు. జంట హత్యల కేసులో సాక్షులుగా ఉన్న వారికి పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తాం. కోర్టులో నిర్భయంగా సాక్ష్యం చెప్పేందుకు చర్యలు తీసుకుంటాం. – రిశాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
2 లక్షల కిలోల గంజాయి ధ్వంసం
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి : గంజాయి నియంత్రణ, నిర్మూలనలో దేశంలోనే ఇదో సరికొత్త రికార్డు.. ఒకటి కాదు.. రెండు కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 2 లక్షల కిలోల గంజాయిని శనివారం పోలీసులు ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు రూ.300 కోట్లు ఉంటుందని అంచనా. ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా గత కొద్ది నెలలుగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు, తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయిది. అనకాపల్లి నియోజకవర్గం కోడూరులో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గంజాయి సంచులకు స్వయంగా నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. దశాబ్దాల కాలంగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి సాగు చేస్తున్నారు. దళారులు, మావోయిస్టులు గిరిజనులను భయపెట్టి గంజాయిని సాగు చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఆపరేషన్ పరివర్తన్‌లో భాగంగా ప్రభుత్వం గంజాయి రవాణా, సాగుపై దృష్టిపెట్టింది. నార్కొటిక్స్, ఇంటెలిజెన్స్, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇంత భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 577 కేసుల్లో 1500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 7,552 ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం అలాగే ఏజెన్సీ ప్రాంతం 11 మండలాల్లోని 313 శివారు గ్రామాల్లో 406 ప్రత్యేక బృందాలతో మొత్తం 7,552 ఎకరాల్లోని గంజాయి సాగును పోలీసులు ధ్వంసం చేశారు. ఈ గంజాయి విలువ రూ.9,251.32 కోట్ల దాకా ఉంటుంది. ఎస్ఈబీ, శాంతి భద్రతల పోలీసులు 7,152 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తే.. 400 ఎకరాల వరకూ ఆయా గ్రామాల గిరిజన ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ధ్వంసం చేయడం విశేషం. గంజాయి సాగును గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలు, డ్రోన్లు, శాటిలైట్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆథారిత శాటిలైట్ ఇమేజ్ ప్రాసెసింగ్‌తో ‘ఆడ్రిన్ ఇమేజరీ’ని వినియోగించారు. ఓ పక్క సరిహద్దు గిరిజన గ్రామాల్లో గంజాయి సాగును పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూనే.. అదే సమయంలో అన్ని రవాణా మార్గాల్లో విస్తృత తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహించారు. 120 అంతర్రాష్ట్ర మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో గిరిజనులు, స్థానికులు గంజాయి సాగు వైపు మళ్లకుండా వారిలో చైతన్యం కలిగేలా 1,963 అవగాహన కార్యక్రమాలు, 93 ర్యాలీలు నిర్వహించారు. అలాగే గంజాయి సాగుపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా కాఫీ, జింజర్, రాగులు, స్ట్రాబెర్రీ, మిరియాలు తదితర పంటలు సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టూరిస్టులుగా వచ్చి.. స్మగ్లింగ్ గంజాయి స్మగ్లర్లు ఉత్తరాది రాష్ట్రాల నుంచి టూరిస్ట్‌లుగా వస్తున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు రైలు, బస్సు, ఇతర మార్గాలను ఉపయోగించుకుంటున్నారు. దేశంలోనే విశాఖ ఏజెన్సీలోని గంజాయికి ప్రత్యేకమైన ఆదరణ ఉండటంతో ఈ ప్రాంతం కీలకంగా మారింది. అరెస్ట్ అయిన 1500 మందిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన స్మగర్లు 154 మంది ఉండటం గమనార్హం. గంజాయి ధ్వంసం కార్యక్రమంలో అడిషనల్ డీజీ(ఎల్ అండ్ బీ) రవిశంకర్ అయ్యన్నార్, అడిషనల్ డీజీ(గ్రే హౌండ్స్) ఆర్కే మీనా, ఎస్ఈబీ డైరెక్టర్ వినీత్ బ్రిజ్‌లాల్, ఐజీ రంగారావు తదితరులు పాల్గొన్నారు. గంజాయిని గుట్టలుగా పేర్చి తగలబెడుతున్న దృశ్యం శారదా పీఠంలో డీజీపీ.. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ శనివారం సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పీఠంలోని రాజశ్యామల అమ్మవారికి డీజీపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సచివాలయ వ్యవస్థతో గిరిజనుల్లో పెనుమార్పు ఆపరేషన్ పరివర్తన్‌తో గిరిజన గ్రామాల ప్రజలు, యువతలో మార్పు మొదలైంది. వారంతా అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ గిరిజన యువతలో మార్పునకు కీలకంగా మారింది. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లుగా గిరిజన యువత చేరడం, తద్వారా గంజాయి సాగుతో నష్టాలు తెలుసుకోవడం, ప్రజలకు తెలియజేయడం వంటివి కీలక పరిణామాలు. – గౌతమ్ సవాంగ్, డీజీపీ -
ఆర్టీపీపీలో గంజాయి కలకలం
ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో బొగ్గును సరఫరా చేసే రైలు వ్యాగన్లో మంగళవారం గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆర్టీపీపీకి ఒడిశా, సింగరేణి నుంచి బొగ్గు వ్యాగన్లు వస్తాయి. మంగళవారం వచ్చిన వ్యాగన్ నుంచి లోడు దించుతుండగా సుమారు 10 కిలోలు ఉన్న గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వీటిని ఆర్టీపీపీ అధికారులు కలమల్ల పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ విషయంపై కలమల్ల ఎస్ఐ చంద్రమోహన్‌తో మాట్లాడగా గంజాయి ప్యాకెట్లను ఆర్టీపీపీ కోల్ ప్లాంట్ అధికారులు స్టేషన్‌కు తెచ్చారన్నారు. ఇది మాకు సంబంధం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీఆర్పీ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిపారు. ఎర్రగుంట్ల జీఆర్పీ వారిని వివరణ కోరగా ఆర్టీపీపీకి ప్రైవేటు రైల్వే లైన్ అయినందున తమకు సంబంధం లేదని వారు చెప్పారు. ఎస్ఈబీ సీఐ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ గంజాయి ప్యాకెట్ల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. గంజాయి ప్యాకెట్లు వ్యవహారంపై ఏ శాఖ అధికారులు సంబంధం లేదంటూ దాటేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది. -
గంజాయి దందాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గంజాయి మాఫియాను కూకూటి వేళ్లతో పెకలించి వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మన రాష్ట్రంలో గంజాయి దందాను శాసిస్తున్న స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సిద్ధమైంది. ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీలో) 8 వేల ఎకరాలకుపైగా గంజాయి సాగును సెబ్ ధ్వంసం చేసింది. ఇప్పుడు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అందుకోసం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల జాబితాను రూపొందించింది. ఆ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణకు ఉపక్రమించింది. అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్ కోసం జాయింట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. 648 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఏవోబీలో గంజాయి దందాను శాసిస్తున్న 648 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను సెబ్ గుర్తించింది. వారు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో దశాబ్దాలుగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని గంజాయి అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేశారు. ఎంపిక చేసిన గిరిజనుల ద్వారా గంజాయి సాగు చేయించి, పంట వచ్చిన తరువాత ఎండబెట్టించి, వారే కొనుగోలు చేసి ఏడాది పొడుగునా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అడపాదడపా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాయి గానీ, ఇతర రాష్ట్రాల్లో తిష్టవేసిన స్మగ్లర్లపై గురి పెట్టలేదు. మొదటిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి ఆట కట్టిస్తోంది. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్న రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో సెబ్ ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించి ఉమ్మడి కార్యాచరణను రూపొందించారు. పరస్పర సహకారంతో ఇప్పటికే 50 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లని సెబ్ అరెస్టు చేసింది. రాష్ట్ర అధికారులు ఆ రాష్ట్రాలకు వెళ్లి 30 మందిని అరెస్టు చేసి తీసుకువచ్చారు. తెలంగాణ పోలీసులు 15 మందిని మన రాష్ట్రానికి అప్పగించారు. కేరళ ఇద్దరిని, కర్ణాటక ఇద్దరిని, తమిళనాడు ఒకరిని అప్పగించాయి. మిగిలిన స్మగ్లర్లను కూడా అరెస్టు చేసేందుకు సెబ్ రెండంచెల్లో ‘జాయింట్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేస్తోంది. డీజీపీ చైర్మన్‌గా ఉండే నోడల్ ఏజెన్సీలో సెబ్ కమిషనర్, డీఐజీలు సభ్యులుగా ఉంటారు. సెబ్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని కార్యనిర్వాహక టాస్క్ ఫోర్స్‌లో ఎంపిక చేసిన జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు సభ్యులుగా ఉంటారు. ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్షలు విధించేలా పర్యవేక్షిస్తుంది. రాష్ట్రం నుంచి అప్పగించింది 20 మందిని కాగా మన రాష్ట్రానికి చెందిన కొందరు స్మగ్లర్లు ఇతర రాష్ట్రాల్లో అక్రమ మద్యం, ఇతర దందాలకు పాల్పడుతున్నారు. ఆ రాష్ట్రాలు ఇచ్చిన జాబితా మేరకు సెబ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ఆ రాష్ట్రాల పోలీసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 20 మందిని వివిధ రాష్ట్రాలకు అప్పగించారు. -
402 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
పాడేరు/ కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా పోలీసుశాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బృందాలు గంజాయి దాడులను కొనసాగిస్తున్నాయి. అలాగే చింతపల్లి మండలం తురబాలగెడ్డ వద్ద లిక్విడ్ గంజాయి తరలిస్తున్న తల్లీకొడుకులను సోమవారం అరెస్టు చేశారు. కాగా విశాఖ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, జి.కె.వీధి, చింతపల్లి, పెదబయలు మండలాల పరిధిలోని 402 ఎకరాల్లో గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ శంకరరెడ్డి, ఎస్ఈబీ అధికారులు సుధాకర్, శ్రీను, ప్రశాంత్, సంతోస్, తదితరులు పాల్గొన్నారు. లిక్విడ్ గంజాయి పట్టివేత.. విశాఖ జిల్లా చింతపల్లి మండలం తాజంగి నుంచి రూ.లక్ష విలువ చేసే కిలో ద్రవ గంజాయిని ద్విచక్ర వాహనంపై తీసుకొస్తున్నారన్న సమాచారం గొలుగొండ ఎస్ఈబీ అధికారులకు అందింది. దీంతో డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన తల్లీ, కొడుకులు జరీనా, ఎస్కె.జహరుద్దీన్ లిక్విడ్ గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. వీరు కాకినాడలోని వైద్య విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వారినుంచి మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. -
288 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు : ఆపరేషన్ పరివర్తనలో భాగంగా విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలు రోజువారీ గంజాయి తోటలపై దాడులు చేపడుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లోని 288 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసినట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ శంకర్‌రెడ్డి చెప్పారు. జి.మాడుగుల మండలంలోని బీరం పంచాయతీ బీరం, గడ్డిబందలు, అనర్భ, వెంకటపాలెం, చెలమరంగి గ్రామాల సమీపంలోని 211 ఎకరాలు, డుంబ్రిగుడ మండలం కొర్రాయి పంచాయతీ గంజిగుడ, కండ్రూం గ్రామాల సమీపంలోని 15 ఎకరాలు, చింతపల్లి మండలం అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కోటగున్నల కాలనీ, చోడిరాయి, రామారావుపాలెం గ్రామాల్లోని 62 ఎకరాల్లోని గంజాయి తోటలన్నింటినీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసుశాఖ బృందాలు ధ్వంసం చేశాయి. చింతపల్లి మండలం బెన్నవరం, లోతుగెడ్డ, అన్నవరం గ్రామాల్లో కళాజాత బృందాలు గంజాయి వలన జరిగే అనర్థాలపై గిరిజనులకు పాటలు, నృత్య రూపకాల ద్వారా అవగాహన కల్పించారు. -
గంజాయి కట్టడికి.. రైల్వే పోలీసులు సైతం..
సాక్షి, అమరావతి: గంజాయి దందాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’లో రైల్వే పోలీసులూ కీలకపాత్ర పోషిస్తున్నారు. రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జనరల్ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ప్రత్యేక డ్రైవ్ చేపట్టాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్–ఎస్ఈబీ), పోలీసు అధికారులు విస్తృతంగా చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ గంజాయి మాఫియాను హడలెత్తిస్తోంది. వందల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు.. ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో తనిఖీలుచేస్తూ గంజాయి నిల్వలను పెద్దఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో.. ఉన్న గంజాయి నిల్వలను హడావుడిగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు గంజాయి ముఠాలు ప్రయత్నిస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రోడ్డు మార్గంలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. దీంతోపాటు రైళ్లలోనూ విస్తృతంగా తనిఖీలు చేయాలని జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. 25 ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు ఆపరేషన్ పరివర్తన్ కోసం జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలతో 25 ప్రత్యేక బృందాలను నియమించారు. వాటిలో విజయవాడ రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 20 బృందాలు, గుంతకల్ రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 5 బృందాలను ఏర్పాటుచేశారు. విజయవాడ రైల్వే పోలీస్ జిల్లా పరిధిలోని 15 ప్రధాన రైల్వేస్టేషన్లు, 15 అవుట్ పోస్టులు, గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలోని 19 ప్రధాన రైల్వేస్టేషన్లు, 15 అవుట్ పోస్టులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పార్శిళ్లలో ఉన్న గంజాయిని గుర్తించేందుకు పోలీసు జాగిలాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ‘ఆపరేషన్’ సంపూర్ణంగా విజయవంతమయ్యే వరకు రైళ్లలో తనిఖీలను కొనసాగిస్తామని అదనపు డీజీ (రైల్వే) హరీష్‌కుమార్ గుప్తా చెప్పారు. ఆపరేషన్‌లో ‘సెబ్’ కమిషనర్ మరోవైపు.. ‘ఆపరేషన్ పరివర్తన్’లో ‘సెబ్’ కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ గురువారం స్వయంగా పాల్గొన్నారు. ముందస్తు సమచారం ఇవ్వకుండా ఆయన గురువారం విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం పంగళలంలోని సెబ్ బేస్ క్యాంప్‌నకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏడు బృందాలతో కలిసి ఆయన పాడేరు, చింతపల్లి మండలాల్లోని మారుమూల తండాల్లో గంజాయి సాగు తీరును పరిశీలించి విస్తుపోయారు. దాదాపు 200 ఎకరాల్లో ఈ పంటలను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో సెబ్ జేడీ సతీష్, సెబ్ స్పెషల్ యూనిట్ జేడీ నరేంద్రనాథ్ రెడ్డి, పాడేరు అదనపు ఎస్పీ జగదీశ్, సెబ్ సూపరింటెండెంట్ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి తోటల నిర్మూలనే లక్ష్యం
పాడేరు/చింతపల్లి: విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల నిర్మూలన లక్ష్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) బృందాలు పనిచేస్తున్నాయని ఆ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్ తెలిపారు. ఏజెన్సీలో గురువారం మొత్తం 190 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. ఏజెన్సీలోని పెదబయలు మండలం మారుమూల మావోయిస్టు ప్రభావిత పూటూరు, పంగలం గ్రామాల పరిధిలోని గంజాయి తోటల ధ్వంసాన్ని ఆయన గురువారం పర్యవేక్షించారు. ఈ మారుమూల గ్రామాలకు కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్‌తో పాటు ఎస్ఈబీ విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఏడు ఎస్ఈబీ బృందాల సభ్యులు వెళ్లారు. ఇక్కడ సాగవుతున్న గంజాయి తోటలను కమిషనర్ పరిశీలించారు. ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 115 ఎకరాల విస్తీర్ణంలో గంజాయి తోటలను ధ్వంసం చేశాయి. సుమారు 5.75 లక్షల గంజాయి మొక్కలను నరికేసి నిప్పంటించారు. చింతపల్లి మండలం అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలోని కొండపల్లి, వర్తనపల్లి గ్రామాల పరిధిలో సుమారు 75 ఎకరాల్లో సాగవుతున్న గంజాయిని గురువారం గిరిజనులతో కలిసి ఏఎస్పీ తుషార్ డూడి ధ్వంసం చేశారు. అన్నవరం ఎస్ఐ ప్రశాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 120 కిలోల గంజాయి పట్టివేత ముంచంగిపుట్టు: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు గురువారం రూ.2.4 లక్షల విలువైన 120 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేశారు. మండలంలోని జోలాపుట్టు నుంచి ముంచంగిపుట్టు మార్గంలో గుమ్మసీర్గంపుట్టు వద్ద వనుగుమ్మ నుంచి వస్తున్న ఎపి35టి9551 నంబరు జీపులో తనిఖీ చేసి 6 బస్తాల గంజాయిని పట్టుకున్నట్లు స్థానిక ఎస్ఐ ఆర్.సంతోష్ చెప్పారు. జీపులో ఉన్న నలుగురిని, జీపు వెనక బైకుపై పైలెటింగ్ చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయిని, జీపును, బైకును సీజ్‌చేశామన్నారు. నిందితుల వద్ద ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని ఎస్ఐ తెలిపారు. -
AP: 239 ఎకరాల్లో గంజాయి తోటల ధ్వంసం
పాడేరు: విశాఖ ఏజెన్సీలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో గంజాయి దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం 239 ఎకరాల్లో గంజాయి తోటల్ని ధ్వంసం చేశారు. పెదబయలు మండలంలోని మారుమూల జగ్గంపేట, సీమకొండ, రంజెలమంది గ్రామాల సమీపంలో సుమారు 216 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను ఎస్ఈబీకి చెందిన ఏడు బృందాలు ధ్వంసం చేశాయి. 10.8 లక్షల గంజాయి మొక్కలను నరికేసి వాటికి నిప్పంటించారు. చింతపల్లి మండలం మేడూరు గ్రామ సమీపంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న చింతపల్లి ఏఎస్పీ తుషార్ డూడి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తుల సహకారంతో 15 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలకు నిప్పంటించారు. పాడేరు మండలంలోని ఇరడాపల్లి సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న కనక ఆధ్వర్యంలో గిరిజనులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు, వలంటీర్ల సహకారంతో 8 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు. -
గంజాయిపై ఉక్కుపాదం
పాడేరు/డుంబ్రిగుడ/జీకే వీధి/చింతపల్లి/కాకినాడ సిటీ/అనంతగిరి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగు, రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో యథేచ్ఛగా సాగుతున్న గంజాయి దందాను నామరూపాల్లేకుండా తుదముట్టించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు త్రిముఖ వ్యూహంతో ముందుకు కదులుతూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ఓ వైపు గంజాయి సాగు వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గిరిజనులకు అవగాహన కల్పిస్తూ గంజాయి తోటలను ధ్వంసం చేసే పనిలో కొన్ని బృందాలు నిమగ్నం కాగా.. మరికొన్ని బృందాలు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ, పోలీస్ అధికారులు కార్యాచరణ కొనసాగిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో వందలాది ఎకరాల్లో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేయగా.. పలుచోట్ల తనిఖీలు దాడులు నిర్వహిస్తూ వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతున్న గంజాయిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోమవారం విశాఖ జిల్లా మారుమూల గిరిజన గ్రామాల్లో 217 ఎకరాల్లో సాగు చేస్తున్న 9.80 లక్షలకు పైగా గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. మరోవైపు ఒడిశా నుంచి స్మగ్లింగ్ అవుతున్న రూ.కోటిన్నరకు పైగా విలువైన 1,720 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒకే పంచాయతీ పరిధిలో 217 ఎకరాల్లో పంట ధ్వంసం విశాఖ ఏజెన్సీ పరిధిలోని ఐదు మండలాల్లో సోమవారం 217 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది ఏడు బృందాలుగా ఏర్పడి జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి, డిప్పలగొంది, వడ్రంగుల గ్రామాల్లో 164 ఎకరాల్లో సాగవుతున్న సుమారు 7.40 లక్షల మొక్కలను నరికి నిప్పంటించారు. డుంబ్రిగుడ మండలంలోని కండ్రుం పంచాయతీ దండగుడ, బెడ్డగుడ, కండ్రుం గ్రామాల్లో 12 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను సోమవారం ఆ పంచాయతీ గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. ఇకపై గంజాయి సాగుచేయబోమని తీర్మానం చేశారు. గూడెం కొత్తవీధి మండలంలో మావోయిస్టు ప్రాంతమైన కుంకుంపూడికి సమీపంలోని 5 ఎకరాల్లో గంజాయి తోటలను గిరిజనులు స్వచ్ఛందంగా ధ్వంసం చేసి, మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ గాదిగొయ్యి గ్రామంలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. పాడేరు మండలం గొండెలి, కించూరు పంచాయతీల్లో 16 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, గిరిజన పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. పశువుల దాణా ముసుగులో తరలిస్తున్న టన్ను గంజాయి పట్టివేత తూర్పు గోదావరి జిల్లా చింతూరు సబ్ డివిజన్ పరిధిలో రూ.కోటి విలువైన వెయ్యి కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు కాకినాడలో సోమవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన వ్యక్తులు పశువుల దాణా ముసుగులో ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు లారీలో గంజాయి తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ లారీని చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని గోడ్లగూడెం జంక్షన్ వద్ద అటకాయించారు. పోలీసుల్ని చూసి ఒక వ్యక్తి పారిపోగా మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా తికూరి గ్రామానికి చెందిన మన్మోహన్ పటేల్, అదే జిల్లా మౌరహా గ్రామానికి చెందిన మహమ్మద్ హారన్, ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా ఎంపీవీ–79 గ్రామానికి చెందిన రాబిన్ మండల్, ఎంపీవీ–75 గ్రామానికి చెందిన అమృతా బిశ్వాస్, నలగుంటి గ్రామంలోని ఎంపీవీ–36కు చెందిన బసుదేవ్ మండల్‌ను అరెస్ట్ చేశారు. ఒడిశాలో పండించిన గంజాయిని వారంతా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారని ఎస్పీ చెప్పారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి రాజును ఒడిశా పోలీసుల సహకారంతో అరెస్ట్ చేస్తామన్నారు. చిలకలగెడ్డ వద్ద 720 కేజీల స్వాధీనం విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్‌పోస్టు వద్ద ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు వ్యాన్‌లో తరలిస్తున్న 720 కేజీల గంజాయిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, స్టేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం సంయుక్తంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ గణపతిబాబు, టాస్క్‌ఫోర్స్ హెచ్‌సీ శ్రీధర్ నేతృత్వంలోని పోలీసులు చిలకలగెడ్డ వద్ద కాపుగాసి పట్టుకున్నారు. గంజాయితో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబట్ట గంజాయి విలువ రూ.50 లక్షలకు పైగా విలువ చేస్తుందని అంచనా. ఈ దాడిలో ఎస్ఈబీ ఎస్ఐ దాస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కృష్ణప్రసాద్, నర్సింగరావు పాల్గొన్నారు. -
ఏవోబీలో ‘ఆపరేషన్ పరివర్తన్’
సాక్షి, అమరావతి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా కొనసాగుతున్న గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కేరళ, మహరాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన ముఠాల ఆధ్వర్యంలో ఏవోబీలో యథేచ్ఛగా నడుస్తున్న గంజాయి సాగును నామరూపాల్లేకుండా తుదముట్టించేందుకు ప్రత్యేక బృందాలను యాక్షన్‌లోకి దించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ గంజాయి దందాను కట్టడి చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ‘ఆపరేషన్ పరివర్తన్’ను చేపట్టింది. ఈ తరహా ఆపరేషన్‌ను దేశంలో తొలిసారిగా ఏపీలో అమలు చేస్తున్నారు. గంజాయి దుష్పరిణామాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తూ..టెక్నాలజీ సాయం, భారీ స్థాయిలో బలగాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ద్విముఖ వ్యూహంతో విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. రంగంలోకి దిగిన బృందాలు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను ఆనుకుని ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ›5 రోజులుగా భారీగా గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నాయి. అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల సమన్వయంతో ఎస్ఈబీ గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతోంది. మ్యాపింగ్‌తో నిర్దిష్ట ప్రాంతాల గుర్తింపు ‘ఆపరేషన్ పరివర్తన్’ను విజయవంతం చేసేందుకు ఎస్ఈబీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. మన్యంలో గంజాయి సాగుచేసే ప్రాంతాలను ముందుగా మ్యాపింగ్ చేశారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ మండలాలతోపాటు రాష్ట్ర సరిహద్దుకు అవతల ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తృతంగా గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను నిర్దిష్టంగా గుర్తించారు. ఆ ప్రాంతాలన్నింటినీ డ్రోన్ కెమెరాలతో వీడియో తీయించారు. ఐదు రోజుల్లో 550 ఎకరాల్లో.. ఏపీ పరిధిలోని గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు భారీ సంఖ్యలో బలగాలు, సిబ్బందిని ఎస్ఈబీ వినియోగిస్తోంది. పోలీస్, ఎస్ఈబీ సిబ్బందితో ఏర్పాటు చేసిన 66 ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఆ బృందాలకు వివిధ మండలాల బాధ్యతలను అప్పగించారు. గంజాయి సాగును ధ్వంసం చేసేందుకు అవసరమైన యంత్రాలను సమకూర్చారు. అనంతరం ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట గంజాయి తోటల్ని ధ్వంసం చేసి, పంటకు నిప్పు పెట్టే పని ఓ యజ్ఞంగా సాగుతోంది. గడచిన 5 రోజుల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి ఏకంగా 550 ఎకరాల్లో గంజాయి సాగును అధికారులు ధ్వంసం చేశారు. ఇప్పటివరకు 21 లక్షల గంజాయి మొక్కలు ధ్వంసం చేసి నిప్పు పెట్టినట్టు ఎస్ఈబీ వర్గాలు వెల్లడించాయి. వీటి విలువ రూ.104.25 కోట్లు ఉంటుందని ఎస్ఈబీ ఉన్నతాధికారులు అంచనా. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ.. రాష్ట్ర సరిహద్దును ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటను ధ్వంసం చేసేలా ఆ రాష్ట్ర పోలీసు అధికారులతో ఏపీ పోలీసులు ఇప్పటికే చర్చలు జరిపారు. ఏపీ వైపు చేపట్టిన ‘ఆపరేషన్ పరివర్తన్’ను ఆ రాష్ట్రాల్లోనూ చేపట్టనున్నారు. అందుకు అవసరమైన సాంకేతిక, ఇతరత్రా సహకారాన్ని ఏపీ ఎస్ఈబీ అధికారులు అందిస్తారు. విశాఖ ఏజెన్సీలో భారీగా గంజాయి తోటల ధ్వంసం గూడెంకొత్తవీధి/కొయ్యూరు/చింతపల్లి/జి.మాడుగుల/అనకాపల్లిటౌన్: విశాఖ ఏజెన్సీలోని 3 మండలాల్లో శనివారం పెద్దఎత్తున గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని దామనపల్లి, రింతాడ పంచాయతీల్లోని డేగలపాలెం, ఇంద్రానగర్, కొత్తూరులో 56 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. జీకేవీధి పోలీసులు ఈ గ్రామాలకు చేరుకుని, గంజాయి తోటలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టి కాల్చివేశారు. కొయ్యూరు మండలంలోని మారుమూల అంతాడ పంచాయతీ పారికలలో రీముల చంద్రరావు ఆధ్వర్యంలో శనివారం గ్రామస్తులు 5 ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు. చింతపల్లి మండలంలోని గంజిగెడ్డ, బౌర్తి, కొత్తూరు గ్రామాల సమీపంలో 16 ఎకరాల గంజాయి తోటలను చింతపల్లి పోలీసులు ధ్వంసం చేశారు. జి.మాడుగుల మండలంలో ఎగమండిభ, పరిసర ప్రాంతాల్లో 158 ఎకరాల్లో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీ మాదకద్రవ్యాల పని పట్టేందుకు విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్లో డీఎస్పీ సునీల్ ఆధ్వర్యంలో శనివారం డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. 1, 2, 3 ప్లాట్‌ఫారాలపై, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో తనిఖీలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కూడా డాగ్‌స్క్వాడ్ తనిఖీలు జరిగాయి. 18 కిలోల లిక్విడ్ గంజాయి పట్టివేత చింతపల్లి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పరిధిలోని కొత్తూరు బయలులో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల ద్రవరూప (లిక్విడ్) గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ ఎస్ఐ గణేష్ తెలిపారు. శనివారం రాత్రి కొత్తూరు బయలులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి లిక్విడ్ గంజాయితో వెళ్తున్నాడని, దానిని పరిశీలిస్తుండగా అతడు పరారయ్యాడని ఎస్ఐ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
పైన బంగాళాదుంపలు.. అడుగున గంజాయి ప్యాకెట్లు
అగనంపూడి (గాజువాక)/యలమంచిలి రూరల్/పాయకరావుపేట: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పాడేరు నుంచి తరలిస్తున్న 790 కేజీల గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని ముగ్గుర్ని అరెస్టు చేశారు. దువ్వాడ సీఐ టి.లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. బంగాళాదుంపల లోడు వ్యాన్‌లో అడుగున గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు దువ్వాడ పోలీసులకు సమాచారం అందడంతో గురువారం వేకువజామున దువ్వాడ పోలీసులు దాడి చేశారు. అగనంపూడి టోల్‌గేటు వద్ద కాపుకాసి గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పాడేరు నుంచి వీఎస్‌ఈజెడ్‌కు సమీపంలోని డాక్‌యార్డ్ కాలనీలోని స్టాక్ యార్డ్‌కు వీటిని తరలించి తరువాత, అక్కడి నుంచి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో తమిళనాడుకు చేరవేయడానికి నిందితులు ప్లాన్ వేశారు. గురువారంఇదే రీతిలో సరుకు తరలిస్తున్న సమయంలో పోలీసులు మాటువేసి సరుకుతోపాటు తమిళనాడుకు చెందిన భాస్కర్ చంద్రశేఖర్, జాన్సన్ శంకర్‌తోపాటు డాక్‌యార్డ్ కాలనీకి చెందిన దుక్కా నరేష్‌లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు సీఐ చెప్పారు. ఈ దాడిలో ఎస్ఐ రామదాస్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఆటోలో గంజాయి తరలిస్తుండగా విశాఖ జిల్లా యలమంచిలి మండలం రేగుపాలెం వద్ద అడ్డుకున్నట్టు యలమంచిలి ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని పాంగి మహేష్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. ఇదిలావుండగా.. కారులో తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పాయకరావుపేట సమీపంలో పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపారు. గంజాయి సాగు నిర్మూలనపై అవగాహన సాక్షి, విశాఖపట్నం/పాడేరు: పాడేరు ఏఎస్పీ జగదీష్.. చింతపల్లి ఏఎస్పీ తుషార్‌డుడి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించాలని సుమారు 600 మంది విద్యార్థులతో అవగాహన కల్పించారు. పాడేరులో తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులను సమావేశపర్చి గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల గిరిజనులకు జరుగుతున్న నష్టంపై ఏఎస్పీ అవగాహన కల్పించి .. తల్లిదండ్రులను చైతన్యపర్చాలని సూచించారు. అనంతరం ‘గంజాయి సాగు వద్దు–వ్యవసాయమే ముద్దు’ అంటూ ప్రదర్శన చేశారు. ప్లకార్డులతో గిరిజన విద్యార్థులు, పాడేరు ఏఎస్పీ జగదీష్, ఇతర అధికారులు -
గత ప్రభుత్వ హయాంలో గంజాయి మాఫియా: పవన్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర–ఒడిశా బోర్డర్లో గంజాయి మాఫియా రాజ్యమేలిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. దీనిపై అప్పట్లో తనకు స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం పలు ట్వీట్లు చేశారు. ‘2018లో ఏవోబీలోని గిరిజన ప్రాంతాల్లో నేను పర్యటించాను. అక్కడ మాఫియా రూపంలో సాగుతున్న గంజాయి వ్యాపారం గురించి స్థానికులు భయపడుతూనే ఫిర్యాదులు చేశారు. దీన్ని అరికట్టడానికి కేంద్రం అంతర్రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి’ అని పవన్ కోరారు. ‘విశాఖ మన్యం నుంచి తుని వరకు ఉపాధి లేని యువకులు ఇందులో చిక్కుకుంటున్నారు. దీని వెనుక ఉండే కీలక వ్యక్తులు మాత్రం రిస్క్ లేకుండా సంపాదిస్తున్నారు. గతంలో గంజాయి పంటను పోలీసులు, అబ్కారీ అధికారులు ధ్వంసం చేసేవారు. ఆ పని వదిలి.. బయటకు వెళ్లే గంజాయిని పట్టుకుంటున్నారు.’ అని పవన్ ట్వీట్ చేశారు. -
టీడీపీ హయాంలోనే గంజాయి మూలాలు.. టీడీపీ మాజీ మంత్రి వీడియో వైరల్
-
టీడీపీ హయాంలోనే గంజాయి మూలాలు.. టీడీపీ మాజీ మంత్రి వీడియో వైరల్
సాక్షి, అమరావతి: అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ విషం చిమ్ముతోంది. గంజాయి సాగు, రవాణాకు తమ నిర్వాకమే కారణమని బయటకు చెప్పుకోలేక రాష్ట్ర ప్రతిష్టను పణంగా పెట్టి రాజకీయ దిగజారడుతనానికి పాల్పడుతోంది. రాష్ట్రం డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ ఆ మూలాలన్నీ టీడీపీ హయాంలోనే ఉన్నాయనే విషయం మరిచిపోయి.. దుష్ప్రచారం చేస్తోంది. (చదవండి: ఇజ్రాయెల్ ‘ఎగ’సాయం: బాబు ‘షో’కు.. నష్టాల సాగు) గత టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో గంజాయిపై గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విశాఖ నుంచే దేశమంతా గంజాయి సరఫరా అవుతుందని స్వయంగా ఆయనే చెప్పారు. ఇప్పుడేమో తమకు ఏపాపం తెలియదంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై టీడీపీ బురద చల్లి నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. ఏవోబీలో భౌగోళిక స్థితిగతుల దృష్ట్యా దశాబ్దాల తరబడి గంజాయి సాగవుతోందన్నది బహిరంగ రహస్యం. కానీ గంజాయిపై వాస్తవాలకు ముసుగేసి గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారు పచ్చనేతలు. -
రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావా?
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో గంజాయి సాగును నిర్మూలించేందుకు, స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని జాతీయ పత్రికలు, ప్రసార మాధ్యమాలు ప్రశంసిస్తుంటే.. డ్రగ్స్ అంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారిపోయిందని ఆరోపిస్తావా? సీఎం వైఎస్ జగన్‌పై కోపంతో రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావా? మీ మాటలు విని ఇతర రాష్ట్రాల ప్రజలు రాష్ట్ర ప్రజల గురించి ఏమనుకుంటారు?’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. శనివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సకల దరిద్రాలకు మూలాలు టీడీపీలోనే ఉన్నాయని, గంజాయి స్మగ్లింగ్‌లోనూ ఆ పార్టీ నేతలే కన్పిస్తారని చెప్పారు. మంత్రి కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. ఎవరికి భ్రమలు కల్పించాలని ఈ దొంగ దీక్ష? ► రాష్ట్రంలో అలజడి సృష్టించి.. శాంతిభద్రతలు అదుపులో లేవని విష ప్రచారం చేయడం కోసం చంద్రబాబు కుట్రకు తెరతీశారు. ఆ కుట్రలో భాగంగా తానే కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తూ ఒక స్కిట్ నడిపించారు. బజారు భాష మాట్లాడే అధికార ప్రతినిధిని పెట్టి.. సీఎం వైఎస్ జగన్‌ను, ఆయన తల్లిని కించపరిచే విధంగా బూతులు తిట్టించారు. ► సీఎం వైఎస్ జగన్‌ను అభిమానించే ప్రజలు టీడీపీ కార్యాలయం మీదకు వెళ్తే.. దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడానికే.. ముసలి కొంగ నాలుగు చేపల కోసం జపం చేసినట్లుగా చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం 36 గంటలపాటు దొంగ దీక్ష చేశారు. చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నాడో.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి తెలియక.. మరో నాయకుడిని అడగడం ప్రజలందరూ చూశారు. ► తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ లేదు.. బొక్కా లేదని.. అచ్చెన్నాయుడు స్వయంగా చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ బతికే ఉందని కార్యకర్తల్లో భ్రమ కల్పించడానికే చంద్రబాబు ఈ డ్రామా ఆడారు. ఢిల్లీ వెళ్లి ఏమని చెబుతావ్.. ► ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలకు ఏమని చెబుతారు? సీఎం వైఎస్ జగన్‌ను బోషడీకే అని తిట్టేస్తే.. ఈ దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయని చెబుతావా? టీడీపీ నేతలు చెబుతున్నట్లు బోషడీకే అనే పదానికి బాగున్నారా.. అనే అర్థం ఉంటే.. రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షాలను కలిసినప్పుడు బాగున్నారా అని అడగడానికి బోషడీకే అని సంభోదిస్తారా? ఆ పదంతో సంభోదిస్తే ఢిల్లీలో ఎవరైనా చెప్పు తీసుకుని కొడతారు చంద్రబాబూ. ► అమిత్ షాను ఏ మొహం పెట్టుకుని కలుస్తావ్? కుటుంబ సభ్యులతో తిరుపతికి వచ్చినప్పుడు టీడీపీ గూండాలతో తన కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేయించింది అమిత్ షాకు తెలియదా? అప్పట్లో నువ్వు మాట్లాడిన మాటలు ఆయనకు గుర్తుకురావా? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సీబీఐని అడుగు పెట్టనివ్వనన్నావు.. ఇప్పుడు నీకు అదే సీబీఐ కావాల్సి వచ్చిందా? దేవుడిపై చెప్పులేసి.. దేవాలయంలో బూతులా? ► టీడీపీ కార్యాలయాన్ని దేవాలయం అంటున్నారు. దేవాలయంపై దాడి చేస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు. మరి ఆపార్టీని స్థాపించిన దేవుడు ఎన్టీఆర్‌పై చెప్పులతో దాడి చేసింది చంద్రబాబుకు గుర్తు లేదా? పట్టాభి బూతు వ్యాఖ్యకు క్షమాపణ చెప్పకుండా.. ఆ పార్టీ నేతలతో అలాంటి బూతులనే తిట్టించారు. దేవాలయంలో మంత్రాలు చదువుతారు గానీ.. బూతులు మాట్లాడరు కదా? పైగా ఆ బూతులను ఇప్పటికీ సమర్థించుకుంటోన్న 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబుకు సిగ్గులేదా? ► దొంగ దీక్షలో లోకేష్ ప్రసంగాలు చూస్తే.. సినిమాల్లో బ్రహ్మానందంలా మంచి టైమింగ్‌తో కామెడీని పండించారు. దుగ్గిరాలలో ఎంపీటీసీలు గెలిచామని, వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో గెలిచి నాన్న చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇస్తామని లోకేష్ చెప్పాడు. ఏ కొడుకైనా పార్టీని గెలిపించి, అధికారాన్ని గిఫ్ట్‌గా ఇస్తామని తండ్రికి చెబుతారు. ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించామని చంద్రబాబే ప్రకటించారు. మరి దుగ్గిరాలలో టీడీపీ అభ్యర్థులకు బీ–ఫారమ్ ఎవరిచ్చారు? ఈ మాటలు విని చంద్రబాబు కుమిలిపోయి ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు. పేదల అభ్యున్నతికి అడ్డు పడతారా? ► చంద్రబాబూ.. ప్రభుత్వంపై ఉగ్రవాదుల్లా విరుచుకుపడుతున్నది నువ్వు, నీ పార్టీ నేతలు కదా? పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలను దక్కనివ్వకుండా కోర్టులకు వెళ్లిందెవరు? అన్ని మంచి పనులకు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు. ► ఇటీవల వైఎస్సార్ ఆసరా పథకం కింద మహిళలకు రూ.6,400 కోట్లు విడుదల చేయడంపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఇప్పుడు ఈ డ్రామా ఆడారు. చంద్రబాబులా ఏ ప్రభుత్వ రంగ సంస్థనూ సీఎం వైఎస్ జగన్ మూసి వేయరు. యాంత్రీకరణ ద్వారా ఆగ్రోస్‌ను మరింత బలోపేతం చేస్తారు. చంద్రబాబా.. చందాల బాబా.. ► టీడీపీ జాతీయ పార్టీ అయితే.. రెండు రాష్ట్రాల్లోని బద్వేలు, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? దీక్ష సమయంలో టీడీపీ నేతలు నోట్ల కట్టలిస్తూ, పాద నమస్కారాలు చేస్తుంటే.. చంద్రబాబా? లేక చందా బాబా అనే అనుమానం ఎవరికైనా కలుగుతోంది. మిమ్మల్ని ఏమని పిలవాలి? చందాల బాబా అనా? చంద్రబాబా అనా? మీ యావ ఎప్పుడూ డబ్బులపైనే? ► అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లో వైఎస్సార్సీపీ కార్యాకర్తలను వెతికి వెతికి చంపి.. కక్షను వడ్డీతో సహా తీర్చుకుంటామంటారా? ఎవరైనా ప్రజా సేవ కోసం అధికారం ఇవ్వండని ప్రజలను అడుగుతారు. మీరు కక్ష తీర్చుకోవడానికి అధికారాన్ని అప్పగించండని అడుగుతారా? సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉంది. ముందు కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి చూద్దాం. -
గంజాయి రవాణాపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గంజాయి సాగు, రవాణా, అమ్మకాలపై ఉక్కుపాదం మోపేలా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. చత్తీస్‌గఢ్, ఏఓబీలోని దండకారణ్యం నుంచి గంజాయి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీదుగా పలు రాష్ట్రాలకు సరఫరా అవుతున్నట్లు తేలింది. దీంతో సరిహద్దులో నిఘా కట్టుదిట్టం చేసి, నిత్యం తనిఖీలతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి జిల్లా పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 78 హాట్స్పాట్లను గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాల్లో డేగ కన్నుతో నిఘా వేయనున్నారు. ఇక్కడ గంజాయి రవాణాకు బ్రేక్ వేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మత్తు దందాకు చెక్ పెట్టనున్నారు. ఇక తనిఖీలు ముమ్మరం ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పట్టుబడిన గంజాయి అక్రమ రవాణా కేసుల్లో మహారాష్ట్ర, ఎంపీ, కర్ణాటకలకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం గంజాయి దందా రూ.కోట్లకు చేరింది. బుధవారం గంజాయిపై జరిగిన సమీక్షలో సీఎం ఆదేశాల మేరకు భద్రాచలం, చర్ల, చింతూరు, బూర్గంపాడు దారిలో, పాల్వంచ, కొత్తగూడెం, అశ్వారావుపేట, ఇల్లందు, మణుగూరు, మధిర, సత్తుపల్లి, బోనకల్, కామేపల్లి మండలాల్లో ఇకపై నిత్యం తనిఖీలు చేపట్టనున్నారు. దండకారణ్యం గంజాయి వనం ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దులోని చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని సుక్మా, దంతెవాడ, ఖాంఖేడ్, బీజాపూర్, మల్కాన్‌గిరి జిల్లాల్లో భారీగా గంజాయి సాగవుతోంది. అత్యధికంగా మల్కాన్‌గిరి జిల్లాలోనే గంజాయి సాగు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇక్కడి ఆదివాసీలతో దళారులు కొన్నేళ్లుగా గంజాయి సాగు చేయిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇది మరింత పెరిగింది. ఇక్కడ సాగు చేసిన గంజాయి ఎండబెట్టిన తర్వాత ప్యాకింగ్ చేసి మల్కాన్‌గిరి నుంచి సీలేరు, మోతుగూడెం, చింతూరు మీదుగా భద్రాచలం చేరుస్తారు. అలాగే దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల నుంచి కుంట మీదుగా భద్రాచలానికి సరఫరా అవుతుంది. 24 గంటలు తనిఖీలు.. గంజాయి రవాణా, అమ్మకాలు, సాగుపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టులకు తోడు పలు ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరికొన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. హాట్స్పాట్లలో నిరంతర నిఘా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో 24 గంటలు తనిఖీలు ఉంటాయి. –విష్ణు ఎస్.వారియర్, పోలీస్ కమిషనర్, ఖమ్మం -
గొడ్డళ్లతో గంజాయి స్మగ్లర్ల దాడి
చింతపల్లి/నర్సీపట్నం/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. లంబసింగి సమీపంలో గంజాయి స్మగ్లర్లను తరలిస్తున్న తెలంగాణ పోలీసులపై అక్రమ రవాణా ముఠా దాడికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం వారు గాలిలోకి కాల్పులు జరిపినట్లు విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు. నల్లగొండ పోలీసుస్టేషన్లో నమోదైన గంజాయి కేసులో నిందితుల కోసం తెలంగాణ పోలీస్ ప్రత్యేక బృందం విశాఖకు వచ్చిందన్నారు. 15–20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేస్తుండగా రోడ్డుకు అడ్డంగా టిప్పర్‌ను నిలిపి కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడికి దిగి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో ఓ గంజాయి స్మగ్లర్కి గాయాలయ్యాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. చింతపల్లి మండలం తురబాలగెడ్డ సమీపంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో ఈ ఘటన జరిగింది. గాలిపాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు గత వారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ నల్లగొండ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ఈ నెల 15వ తేదీన కిల్లో బాలకృష్ణ (30), కిల్లో భీమరాజు (26), నారా లోవ (30) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పైనాపిల్ పండ్ల కింద గంజాయి బస్తాలు
మంగళగిరి: పైనాపిల్ పండ్ల మాటున లారీలో భారీగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం రాత్రి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కాజ టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ వి.భూషణం సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో పైనాపిల్ పండ్ల కింద గంజాయి బస్తాలను దాచి తరలిస్తున్న లారీ పట్టుబడిందన్నారు. మొత్తం 23 బస్తాల్లోని 1,020 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, లారీ డ్రైవర్ వంగలపూడి శ్రీనివాసరావును, ఎత్తుల నూకరాజు అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. విచారణలో వీరిద్దరూ తమకు గంజాయి విక్రయించేవారితో కానీ, కొనుగోలు చేసే వారితో కానీ సంబంధం లేదని వెల్లడించారని, పూర్తిస్థాయిలో విచారణ చేసి సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు శ్రీనివాస్‌రెడ్డి, ఏడుకొండలు, విజయ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి స్మగ్లర్ బాబు ఖాలే అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ముంబైకి చెందిన గంజాయి స్మగ్లర్ బాబు ఖాలేను హైదరాబాద్‌లో పట్టుకున్నారు. నగర శివారులో బాబు ఖాలేను అనూహ్య రీతిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా నుంచి మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న ఖాలే కోసం.. గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులు గాలిస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్‌లో బాబు ఖాలే కీలక సూత్రధారి. రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దొరికిన గంజాయి స్మగ్లింగ్ వెనకాల బాబు ఖాలే హస్తం ఉంది. ఎన్సీబీ అధికారులు.. ఖాలేతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. చదవండి: ఈఎస్ఐ స్కాం: నాయిని అల్లుడి ఇంట్లో ఈడీ సోదాలు డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
గంజాయి.. ఇక సాగదోయి!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేసింది. ఇకపై మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు.. అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ ఏజెన్సీలో స్మగ్లర్లు అక్కడి గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తూ.. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. పాడేరు కేంద్రంగా ‘స్పెషల్ ఆపరేషన్’ ► నవంబర్ నుంచి గంజాయి సాగు సీజన్ ఆరంభం కానుంది. ఈ ఏడాది సాగును అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రాష్ట్ర నోడల్ అధికారిగా ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ కేఎల్ భాస్కర్‌ను ప్రభుత్వం నియమించింది. ► 2020–21లో సాగును పూర్తిగా నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో గురువారం సమావేశం నిర్వహించనుంది. ► స్పేస్ టెక్నాలజీ సమాచారంతో నవంబర్‌లో మొదలయ్యే గంజాయి సాగును నిర్మూలించేందుకు విశాఖ జిల్లా పాడేరు కేంద్రంగా ‘స్పెషల్ ఆపరేషన్’ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. గత ఏడాది 31,360 కేజీల గంజాయి సీజ్ 2019 సెప్టెంబర్ 1 నుంచి 2020 ఆగస్టు 31 వరకు గడచిన ఏడాది కాలంలో 31,360 కేజీల గంజాయిని సీజ్ చేసి.. 512 ఎకరాల్లో గంజాయి తోటలను ఎక్సైజ్ శాఖ ధ్వంసం చేసింది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 17 గ్రామాల్లో గంజాయి నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి 25.62 లక్షల గంజాయి మొక్కల్ని తొలగించింది. అదే గ్రామాల్లో 358 కేజీల ఎండు గంజాయిని తగులబెట్టారు. పోలీసుల సహకారం తీసుకుంటాం విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలతోపాటు నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని జిల్లాల్లోనూ గంజాయి సాగును గుర్తించాం. సాగును నిర్మూలించేందుకు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించాం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా చర్యలు చేపడతాం. ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకుంటాం. – కేఎల్ భాస్కర్, నోడల్ అధికారి, ఎక్సైజ్ అదనపు కమిషనర్ -
జల్సాలకు అలవాటుపడి..
సాక్షి, గుంటూరు: మత్తు పదార్థాలతో బంగారు భవిష్యత్తు నాశనమవుతోంది. విద్యార్థులు, యువకులు గంజాయికి బానిసలై చేజేతులా జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. ఇందులో మైనర్లు అధికంగా ఉండటం కలవరపెడుతోంది. జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు కేంద్రాలుగా గంజాయి మాఫియా రెచ్చిపోతుంది. ఆయా ప్రాంతాల్లో గంజాయి విక్రయమే జీవనాధారంగా చేసుకుని పలువురు కార్యకలపాలు సాగిస్తున్నారు. ఇందులో అమాయక విద్యార్థులను పావులుగా వాడుకుంటున్నారు. తొలుత వారికి గంజాయి రుచి రూపించి, దానికి బానిసలుగా మార్చి ఆ తర్వాత గంజాయి రవాణా, విక్రయాలకు వినియోగిస్తున్నారు. జల్సాలకు అలవాటుపడి.. కావాల్సినంత డబ్బు అందుబాటులో ఉండి జల్సాలకు అలవాటుపడిన కొందరు వైద్యులు, లెక్చరర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల పిల్లలు సైతం గంజాయికి బానిసలైన ఉదంతాలు జిల్లాలో అనేకం వెలుగు చూశాయి. గుంటూరు నగరం, శివారు ప్రాంతాలు, మంగళగిరి, తాడేపల్లి సహా పలు ప్రాంతాల్లో కాలేజీలు, హాస్టళ్ల సమీపంలో ఉన్న పాడుపడిన కట్టడాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో డెన్లను ఏర్పాటు చేసుకుని కొందరు యువత గంజాయి పీలుస్తున్నారు. గతంలో నిఘావర్గాలు వీటిని గుర్తించి పలువురిని అరెస్టు చేసిన ఘటనలున్నాయి. గుంటూరు నగరంలో అయితే మైనర్ల తల్లిదండ్రులు పోలీస్ అధికారులను ఆశ్రయించి తమ పిల్లలు గంజాయికి బానిసలు అయ్యారని ఫిర్యాదు చేయడం గత ఏడాది కలకలం రేపింది. ఏజెన్సీ వయా విజయవాడ, ఇబ్రహీంపట్నం.. ►విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా విజయవాడ, ఇబ్రహీంపట్నాలకు గంజాయి సరఫరా అవుతున్నట్లు సమాచారం. ►అక్కడి నుంచి జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు నగరం సహా పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ►చిన్న చిన్న పొట్లాలుగా గంజాయిని ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. వీటికి పావులుగా కాలేజీ విద్యార్థులనే ఉపయోగిస్తున్నారు. ►గతంలో రూ.300కు విక్రయించే గంజాయి ప్యాకెట్ ప్రస్తుతం రూ.500 విక్రయిస్తున్నట్టు సమాచారం. ►ఫోన్ చేసి అడ్రెస్ చెబితే బైక్‌లపై గంజాయిని డెలివరీ చేసే విధానం ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో నడుస్తోంది. ►ఈ తరహాలో గంజాయి రవాణా చేస్తూ తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు ప్రాంతాల్లో విద్యార్థులు అనేక సార్లు పట్టుబడ్డారు. ►మరోవైపు అమాయక మహిళల అవసరాలను ఆసరాగా తీసుకుని గంజాయి రవాణా, విక్రయాల్లోకి దించుతున్నారు. ►అయితే గంజాయి రవాణా, సరఫరా, విక్రయాల్లో కీలక పాత్ర పోషించే వ్యక్తుల మూలలను ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శలొస్తున్నారు. మూలాలను ఛేదిస్తాం.. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. మూలలను ఛేదించేందుకు కృషి చేస్తున్నాం. కాల్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి, జైలు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం. ప్రజల వద్ద సమాచారం ఉంటే ధైర్యంగా పోలీసులకు చెప్పాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, అర్బన్ ఎస్పీ