పట్టుబడ్డ గంజాయి బస్తాలు, నిందితులతో పోలీసులు
మంగళగిరి: పైనాపిల్ పండ్ల మాటున లారీలో భారీగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం రాత్రి మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కాజ టోల్‌గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ వి.భూషణం సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామన్నారు.
ఈ తనిఖీల్లో పైనాపిల్ పండ్ల కింద గంజాయి బస్తాలను దాచి తరలిస్తున్న లారీ పట్టుబడిందన్నారు. మొత్తం 23 బస్తాల్లోని 1,020 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, లారీ డ్రైవర్ వంగలపూడి శ్రీనివాసరావును, ఎత్తుల నూకరాజు అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. విచారణలో వీరిద్దరూ తమకు గంజాయి విక్రయించేవారితో కానీ, కొనుగోలు చేసే వారితో కానీ సంబంధం లేదని వెల్లడించారని, పూర్తిస్థాయిలో విచారణ చేసి సూత్రధారులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు శ్రీనివాస్‌రెడ్డి, ఏడుకొండలు, విజయ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment