ఘటన జరిగిన ప్రాంతం (ఫైల్)
తాడేపల్లి రూరల్/గుంటూరు ఈస్ట్: ప్రేమికుడి కాళ్లు, చేతుల్ని కట్టేసి.. కదిలితే పీక కోస్తామని బెదిరించి.. అతడి కళ్లెదుటే నర్సింగ్ విద్యార్థినిపై అకృత్యానికి తెగబడిన మృగాళ్లు ఎవరనేది పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులు షేర్ కృష్ణ, వెంకటేష్‌లను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు అన్వేషిస్తున్నాయి. ఈ నెల 19న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కర ఘాట్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున ప్రేమ జంటపై ఇద్దరు దుండగులు దాడి చేసి యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన విషయం విదితమే. విజయవాడ గాంధీనగర్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న యువకుడు, ఓ నర్సింగ్ విద్యార్థిని కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. వారి ప్రేమను అంగీకరించిన పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివాహం వాయిదా పడగా.. ఆ జంట ఏకాంతంగా మాట్లాడుకునేందుకు కృష్ణా నది ఒడ్డున రైల్వే బ్రిడ్జి వద్ద గల పుష్కర ఘాట్‌కు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కీలక ఆధారాల సేకరణ
కేసు దర్యాప్తులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితులిద్దరూ పాత నేరస్తులేనని గుర్తించారు. వారిలో ఒక యువకుడు ప్రకాశం జిల్లా చినగంజాం నుంచి వచ్చి తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో కొంతకాలంగా నివాసం ఉంటున్నట్టు సమాచారం. మరో యువకుడి స్వస్థలం తాడేపల్లి. బోసు బొమ్మ సెంటర్ సమీపంలోనే అతడు నివాసం ఉంటున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ను అడ్డాగా చేసుకుని వారిద్దరూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది. రైల్వే ట్రాక్‌ల వెంబడి తిరుగుతూ సీతానగరం బ్రిడ్జి వద్ద రైలు ఆగి.. తిరిగి బయలుదేరే సమయంలో ఆ యువకులిద్దరూ రైలు బోగీల్లోని తలుపులు, కిటీకీల వద్ద కూర్చునే ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్లు, మెడలోని గొలుసుల్ని లాఘవంగా తస్కరించి ఉడాయిస్తుంటారు. వాటిని తాకట్టు పెట్టగా.. లేదా విక్రయించగా వచ్చే డబ్బుతో మద్యం, గంజాయి తాగుతుంటారని సమాచారం. వారిద్దరూ రైల్వే ట్రాక్ వెంబడి ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళతారని, ఏదైనా పెద్ద నేరం చేసినప్పుడు రెండు మూడు నెలల వరకు కనిపించరని స్థానికులు చెబుతున్నారు.
కేసులో అనుమానితులు షేర్ కృష్ణ, వెంకటేశ్
విక్రయించిన సెల్‌ఫోన్ ఆధారంగా...
అత్యాచారానికి పాల్పడిన తరువాత నిందితులిద్దరూ పడవలో కృష్ణా నది మీదుగా విజయవాడ వైపు చేరి అక్కడి నుండి రైల్వే ట్రాక్ మీదుగా తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్‌కు చేరుకున్నట్టు గుర్తించారు. అక్కడ కోర్టు వేలంలో ఉన్న ఓ భవనంలో తలదాచుకున్నట్టు సమాచారం. అనంతరం బకింగ్‌హామ్ కెనాల్‌పై గల రైల్వే బ్రిడ్జిపై మీదుగా చెన్నై రూట్‌లోని ట్రాక్ మీదుగా నడుచుకుంటూ వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. రైల్వే పోలీసులు వీరువురినీ వెంబడించడంతో పరారాయ్యరు. తాడేపల్లిలోని బోసుబొమ్మ సెంటర్‌లో టైలరింగ్ చేసే ఓ మహిళ వద్ద వారు ఓ ఫోన్ తాకట్టు పెట్టినట్టు సమాచారం అందడంతో పోలీసులు ఆమెను విచారించారు. ఆమె ఆ ఫోన్‌ను పోలీసులకు అప్పగించింది. కానీ ఆ ఫోన్ అత్యాచారానికి గురైన యువతిది కాదని తేలింది. కాగా.. అదే ప్రాంతంలో నివసిస్తున్న తాపీమేస్త్రి కుటుంబానికి నిందితులు రెండు ఫోన్లు విక్రయించినట్టు తెలుసుకున్న పోలీసులు ఆ కుటుంబం నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అవి తమ ఫోన్లేనని అత్యాచారానికి గురైన యువతి, ఆమె ప్రియుడు గుర్తించారు. దాంతో ఆ ఇద్దరు యువకులే ఈ దురాగతానికి పాల్పడినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చారు. వారిలో ఓ యువకుడు ఈ నెల 17న రోడ్డుపై మద్యం సేవిస్తూ గొడవ చేయగా.. తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో బుద్ధిచెప్పి విడిచిపెట్టినట్టు కూడా తెలిసింది.
పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు
నిందితులిద్దరి కోసం పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఓ నిందితుడి స్వస్థలం చినగంజాం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టిసారించారు. నిందితులు హైదరాబాద్‌కు పరారయ్యాయనే సమాచారంతో ఓ బృందాన్ని అక్కడికి పంపారు. కృష్ణా, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, రైల్వే గోడౌన్‌లు, రైల్వే ట్రాక్ వెంబడి నిర్జన ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
నిందితులకు కఠిన శిక్షలు తప్పవు : హోం మంత్రి
నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని హోం మంత్రి మంగళవారం మరోసారి పరామర్శించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిందితుల్ని ఇప్పటివరకు పట్టుకోలేదంటూ ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎవరిని పడితే వారిని కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని.. అసలైన నిందితుల్ని గుర్తించి కఠినంగా శిక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మహిళల భద్రత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిరోధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందుకోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. హోం మంత్రి వెంట కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment