రైలు బోగీలో వచ్చిన గంజాయి ప్యాకెట్లు
ఎర్రగుంట్ల: వైఎస్సార్ జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ)లో బొగ్గును సరఫరా చేసే రైలు వ్యాగన్‌లో మంగళవారం గంజాయి ప్యాకెట్లు దొరికాయి. ఆర్టీపీపీకి ఒడిశా, సింగరేణి నుంచి బొగ్గు వ్యాగన్లు వస్తాయి. మంగళవారం వచ్చిన వ్యాగన్ నుంచి లోడు దించుతుండగా సుమారు 10 కిలోలు ఉన్న గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వీటిని ఆర్టీపీపీ అధికారులు కలమల్ల పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
ఈ విషయంపై కలమల్ల ఎస్‌ఐ చంద్రమోహన్‌తో మాట్లాడగా గంజాయి ప్యాకెట్లను ఆర్టీపీపీ కోల్ ప్లాంట్ అధికారులు స్టేషన్‌కు తెచ్చారన్నారు. ఇది మాకు సంబంధం లేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జీఆర్‌పీ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు తెలిపారు. ఎర్రగుంట్ల జీఆర్‌పీ వారిని వివరణ కోరగా ఆర్టీపీపీకి ప్రైవేటు రైల్వే లైన్ అయినందున తమకు సంబంధం లేదని వారు చెప్పారు. ఎస్‌ఈబీ సీఐ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ గంజాయి ప్యాకెట్ల విషయం తమ దృష్టికి రాలేదన్నారు. గంజాయి ప్యాకెట్లు వ్యవహారంపై ఏ శాఖ అధికారులు సంబంధం లేదంటూ దాటేస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment