పోలీసుల కాల్పుల్లో గాయపడిన కామరాజు
చింతపల్లి/నర్సీపట్నం/సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. లంబసింగి సమీపంలో గంజాయి స్మగ్లర్లను తరలిస్తున్న తెలంగాణ పోలీసులపై అక్రమ రవాణా ముఠా దాడికి ప్రయత్నించడంతో ఆత్మరక్షణ కోసం వారు గాలిలోకి కాల్పులు జరిపినట్లు విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు.
నల్లగొండ పోలీసుస్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో నిందితుల కోసం తెలంగాణ పోలీస్ ప్రత్యేక బృందం విశాఖకు వచ్చిందన్నారు. 15–20 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేస్తుండగా రోడ్డుకు అడ్డంగా టిప్పర్‌ను నిలిపి కత్తులు, గొడ్డళ్లు, రాళ్లతో దాడికి దిగి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో గాల్లోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనలో ఓ గంజాయి స్మగ్లర్‌కి గాయాలయ్యాయని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. చింతపల్లి మండలం తురబాలగెడ్డ సమీపంలో లంబసింగి ఘాట్‌రోడ్డులో ఈ ఘటన జరిగింది. గాలిపాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు గత వారం అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ నల్లగొండ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ఈ నెల 15వ తేదీన కిల్లో బాలకృష్ణ (30), కిల్లో భీమరాజు (26), నారా లోవ (30) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment