గంజాయి కుప్పం | - | Sakshi
Sakshi News home page

గంజాయి కుప్పం

Published Wed, Oct 30 2024 1:29 AM | Last Updated on Wed, Oct 30 2024 1:41 PM

గంజాయ

గంజాయి కుప్పం

స్థానికంగా విస్తరిస్తున్న సాగు 

రామకుప్పం, శాంతిపురంలో వెలుగులోకి..

పెడదారి పడుతున్న యువత

సాగుతో పాటు దిగుమతి 

కర్ణాటక, కేరళల్లోనూ కుప్పం ప్రాంతవాసులపై కేసులు

కుప్పాన్ని దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్ది, అగ్రపథాన నిలుపుతాం.. ఇవీ పాలకులు గొప్పలు.. అయితే గంజాయి సాగు..దిగుమతి.. విచ్చలవిడిగా విక్రయం..అక్రమ రవాణా.. యువత పెడదోవ.. ఇవీ వాస్తవ పరిస్థితులు. వెరసి దిగజారుతున్న కుప్పం ప్రతిష్ట.. పొరుగున ఉన్న కర్ణాటకతోపాటు సుదూరంలోని కేరళలోనూ కుప్పం ప్రాంతవాసులపై గంజాయి రవాణా కేసులు నమోదే ఇందుకు నిదర్శనం.. ఇదీ నేడు కుప్పం దుస్థితి.

శాంతిపురం: కుప్పం నియోజకవర్గంలో గంజాయి సాగు వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు గంజాయి వ్యాపారం, వినియోగం చేస్తున్నారని అధ్యాపకులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నెల రోజుల్లోనే పురోగతిని సాధించారు. రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో రెండు ప్రాంతాల్లో సాగులోని గంజాయి పంటను గుర్తించి నాలుగు కేసులు నమోదు చేశారు. 84 కిలోల పచ్చి గంజాయి, మరో 1.20 కిలోల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవి ఇవే అయినా అటవీ ప్రాంతాలు, జన సంచారం లేని ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఎంత మేర గంజాయి సాగు ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. 

గంజాయి ఆకులతో పాటు ద్రవ, సిగరెట్లు, చాక్లెట్ల రూపంలోనూ రవాణా, వినియోగం సాగుతోంది. ప్రశాంతతకు మారుపేరైన కుప్పంలో విస్తరిస్తున్న గంజాయి సంస్కృతిపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరో వైపు పొరుగు రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయనే ప్రచారం సాగుతోంది. కొందరు పెద్దల పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడినా గుట్టుగా రిహాబిటేషన్‌ సెంటర్లలో చేర్చి, చికిత్స అందించారని అంటున్నారు. ప్రధానంగా యువకుల తల్లిదండ్రులు ప్రస్తుత పరిస్థితుల్లో దురలవాట్ల నుంచి తమ పిల్లలను ఎలా రక్షించుకోవాలనన్న ఆవేదనలో ఉన్నా రు. స్వలాభం కోసం కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారాలు ఈ తరం యువతపై తీవ్ర దుష్పరిణామాలు చూపుతున్నాయని అంటున్నారు.

విచ్చల విడి వినియోగం
యువత, అసంఘటిత రంగాల కార్మికులు లక్ష్యంగా కుప్పం ప్రాంతంలో గంజాయి వ్యా పారం సాగుతోంది. గుడుపల్లి మండలంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో కొందరు విద్యార్థుల ప్రవర్తనలో తేడా గుర్తించిన అధ్యాపకులు పో లీసులకు సమాచారం ఇవ్వడంతో గంజాయి వ్యాపారం గుట్టు బయటకు వచ్చింది. కొందరు విద్యార్థులు వ్యాపారం చేస్తే మరి కొందరు వినియోగదారులుగా మారారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి సరఫరా చేస్తున్న వారిపై కేసులు పెట్టారు. కానీ గత ఆదివారం రాత్రి కుప్పం పట్టణ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు గంజాయి మత్తులో రాత్రి పూట జాతీయ రహదారిపై వీరంగం సృష్టించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా విచ్చల విడిగా గంజాయి సేవించి, రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. తమ ఆశయాలను, విజ్ఞతను, తల్లిదండ్రుల ఆశలను బుగ్గిలో పోసి మత్తులో తేలారు.

దిగుమతుల మాటేమిటి ?
స్థానికంగా గంజాయి సాగుపై పోలీసులు నిఘా, నియంత్రణ పెంచినా ఇతర ప్రాంతాల నుంచి దిగు మతి అవుతున్న సరుకు సంగతి ఏమిటన్నది ప్రశ్నగా మిగిలింది. కర్ణాటక నుంచి పలమనేరు ప్రాంతం మీదుగా కుప్పానికి గంజాయిని తరలి ముఠాను రెండు నెలల క్రితమే కన్నడ పోలీసులు పట్టుకున్నారు. మరో వైపు గంజాయి రవాణా చేస్తూ కడపల్లి పంచాయతీకి చెందిన వ్యక్తి కేరళ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి జోరుగానే సాగుతున్న విషయం స్పష్టం అవుతోంది. దీనిపైనా అధికార యంత్రాంగం దృష్టి సారించి, రాజకీయ ఒత్తిళ్లను అధిగమించి గంజాయి సాగు, రవాణా చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపా ల్సి ఉంది. ఇందుకోసం పటిష్టమైన ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
గంజాయి కుప్పం1
1/1

గంజాయి కుప్పం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement