నీటి గుంతలో పడి మహిళా కానిస్టేబుల్, కూతురు మృతి
ఆవులు మేపడానికి వెళ్లి కానరాని లోకాలకు..
నీటి కోసం గుంతలోకి ఈడ్చుకెళ్లిన ఆవు
తాడు పట్టుకోవడంతో ముందుగా గుంతలో పడిన బిడ్డ
కుమార్తెను కాపాడబోయి నీట మునిగిన తల్లి
కాటిపేరిలో విషాదం
మొదలే సెలవు దినం కావడంతో ఓ తల్లి, తనబిడ్డలను పొలం వద్దకు తీసుకెళ్లింది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడే గడిపారు. ఉన్న రెండు ఆవులను పిల్లలతో కలిసి మేపుకుని, పొద్దుగూకడంతో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ఆవులకు దాహం వేయడంతో పక్కనే ఉన్న ఫాంపండ్ గుంతలోకి పరుగులు తీశాయి. వాటి పగ్గాలు పట్టుకున్న చిన్నారిని ఈడ్చుకెళ్లడంతో గుంతలో పడిపోయింది. కుమార్తెను కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా గుంతలోకి దిగి నీటమునిగి ప్రాణాలు వదిలింది. ఈ ఘటన చౌడేపల్లెలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
చౌడేపల్లె: ఫాంపండ్ గుంతలో పడి తల్లీ బిడ్డ మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. వివరాలు.. పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, కాటిపేరి పంచాయతీ, కాటిపేరి గ్రామానికి చెందిన కుమార్‌రెడ్డికి రామసముద్రం మండలం, కొండూరుకు చెందిన కె.మౌనిక (32)తో వివాహమైంది. ఈమె మదనపల్లె సెబ్ లిక్కర్ డిపోలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే పుంగనూరు పట్టణంలోని షాపులు, బోయకొండ వద్ద ఉన్న మద్యం షాపులకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో ఇద్దరు పిల్లలు అనీషారెడ్డి(07), తనీష్‌రెడ్డి(05)తో కలిసి పొలం వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న పాడి ఆవులను ఉదయం నుంచి సాయత్రం వరకు సమీపంలోని గిరిజాపురానికి వెళ్లే మార్గంలో మేపుకుంటూ సాయంత్రం ఇంటికి బయలు దేరారు. ఓ రైతు పొలంలో ఉన్న నీటిని చూసిన ఆవులు గంతేస్తూ నీటి వద్దకు పరుగులు తీశాయి. అనీషారెడ్డి పట్టుకున్న ఆవు తాడుతోసహా ఈడ్చుకుంటూ ఫారంపండ్ గుంతలో పడేసింది.
దీన్ని గమనించిన తల్లి మౌనిక ఆ గుంతలోకి దిగి బిడ్డను కాపాడే ప్రయత్నం చేసి నీటమునిగిపోయింది. మరో బిడ్డ తనీష్‌రెడ్డి వారి చూస్తూ గట్టుపైనే వెక్కిళ్లు పెడుతుండడంతో అటుగా వచ్చిన స్థానికులు గమనించి గుంతలో దిగి తల్లీబిడ్డను బయటకు తీశారు. కానీ అప్పటికే వారిద్దరూ మృతిచెందడంతో ఒక్కసారిగా విషాదం అలముకుంది. బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment