అన్యాయంగా మా నాన్న, అన్నను అరెస్టు చేశారు
కుప్పం నుంచే తిరుగుబాటు మొదలవుతుంది
ఎన్ని కేసులు పెట్టినా మా నడక జగనన్న వెంటే
కుప్పం ఎంపీపీ అశ్విని
కుప్పంరూరల్: ‘మా తండ్రి, అన్నయ్యను అక్రమంగా అరెస్టు చేశారు’ అని కుప్పం ఎంపీపీ కుమారి అశ్విని ఆరోపించారు. కేవలం పదవీ కాంక్షతో అధికార పార్టీ నాయకులు, పోలీసులు ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తాము వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా ఉన్నామని, మరో వైపు తనను ఎంపీపీ పదవి నుంచి తొలగించాలని అధికార పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని వాపోయారు. 8 నెలల క్రితమే ట్రాక్టర్ దొంగతనం చేసినట్లు తన తండ్రి, సోదరుడిపై అభియోగాలు మోపారని, మరి పోలీసులు ఇంతకాలం ఏమి చేశారని ప్రశ్నించారు. ట్రాక్టర్లు, స్కూటర్లు దొంగతనం చేయాల్సిన దుస్థితిని ఆ దేవుడు తమకు కల్పించలేదన్నారు.
పైగా అట్రాసిటీ కేసును కూడా 8 నెలల క్రితమే నమోదు చేస్తే అప్పుడే పోలీసులు విచారణ చేపట్టి తప్పుడు కేసుగా కొట్టేశారని తెలిపారు. ప్రస్తుతం తన తండ్రి, మండల కన్వీనర్ హెచ్‌ఎం మురుగేష్, తన అన్న, వన్నెకుల క్షత్రియ రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వనిత భర్త శీనుపై అట్రాసిటీ కేసులు పెట్టడం వెనుక టీడీపీ నేతల ఉద్దేశం ఏమిటో స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా భయపడమని, కోర్టులపై తమకు నమ్మకం ఉందని, అక్కడే తేల్చుకుంటామన్నారు.
ఓ మహిళ, పెళ్లి కాని యువతి ఎంపీపీగా ప్రజలకు సేవ చేస్తుంటే అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక, తప్పుడు కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన పార్టీ మహిళలకు ఇచ్చే మర్యాద ఇదేనా ? అని ప్రశ్నించారు. కుప్పం నుంచే తిరుగుబాటు మొదలవుతుందన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ‘‘దేవుడు ఉన్నాడు.. ధర్మం గెలుస్తుంది.. ప్రాణం ఉన్నంత వరకు మా నాయకుడు జగనన్న చూపిన బాటలోనే నడుస్తా.. ప్రజాసేవలోనే ఉంటా’’ అని అశ్విని గద్గద స్వరంతో మాట్లాడారు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment