వీడని భయం! | - | Sakshi
Sakshi News home page

వీడని భయం!

Published Mon, Jan 13 2025 1:38 AM | Last Updated on Mon, Jan 13 2025 12:16 PM

-

వైకుంఠ ద్వార దర్శనంపై భక్తుల నిరాసక్తత

15 గంటలపాటు సాగిన 46వేల టోకెన్ల పంపిణీ

జనం లేక బోసిపోయిన క్యూలు

తిరుమల శ్రీవారి కనులారా వీక్షించేందుకు భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కోసం ఏడాది నుంచి ప్రయత్నిస్తుంటారు. అయితే తిరుపతిలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన భక్తులను ఇప్పటికీ కలవరపెడుతోంది. టీటీడీ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోపాటు టీటీడీ బోర్డు, అధికారుల అవగాహన, బాధ్యత రాహిత్యం కారణంగా ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ శ్రీవారి భక్తులను ఇదో పీడకలలా వెంటాడుతోంది. తొక్కిసలాట దృశ్యాలను టీవీలు, సామాజిక మాధ్యమాల్లో చూసిన భక్తులు నేటికీ భయాందోళనలోనే ఉన్నారు. భక్తజనం..

తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ : అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. 13వ తేదీ సోమవారానికి సంబంధించి రెండు రోజుల ముందు శనివారం రాత్రి 9 గంటలకు టోకెన్లను కేటాయించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అదే రోజుకు సంబంధించి 46 వేల టోకెన్లను అందుబాటులో ఉంచింది. శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో మాత్రమే టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేసింది. టోకెన్లు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తుల రద్దీ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. శనివారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన టోకెన్ల జారీ ఆదివారం మధ్యాహ్నం సుమారు 15 గంటల పాటు కొనసాగింది. ఇదే సమయంలో క్యూలు జనం లేక బోసిపోయాయి.

టోకెన్‌ ఉంటేనే దర్శనం
వైకుంఠ ద్వార దర్శన టోకెన్‌ ఉంటేనే తిరుమల శ్రీవారి దర్శానానికి అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేయడంతో నడక మార్గం భక్తులుపూర్తిగా తగ్గిపోయారు. అలిపిరి మెట్ల మార్గంలో రెండు చోట్ల టోకెన్‌ పరిశీలించి భక్తులను అనుమతిస్తున్నారు. తొక్కిసలాటతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. అయినా అధికారులు మాత్రం తొక్కిసలాట ముందు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో నడక మార్గం భక్తులకు కూడా తగ్గుముఖం పట్టారు. రద్దీ లేకున్నా తప్పనిసరి టోకెన్‌ అని తేల్చి చెబుతుండడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టోకెన్‌ లేని భక్తులను కూడా ఎప్పటిలాగే అనుమతించి క్యూ కాంప్లెక్స్‌ నుంచి దర్శనానికి పంపించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

పోలీసుల దురుసు ప్రవర్తన
శ్రీనివాసం వద్ద శనివారం రాత్రి 13వ తేదీకి సంబంధించిన టోకెన్లను తీసుకునేందుకు భక్తులు వచ్చారు. రద్దీ లేకపోయినప్పటికీ పోలీసులు, టీటీడీ సిబ్బంది దూకుడుగా వ్యవహరించారు. భక్తులతో వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. దుర్భాషలాడడంతో భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనార్థం వస్తే ఇంత అమర్యాదగా వ్యవహరిస్తారా అంటూ ఆవేదన చెందారు. మహిళలు, చిన్నపిల్లలతో సైతం పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది అమానుషంగా ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనను వీడియో తీస్తున్న భక్తులపై కూడా పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

గోవిందా.. ఇంత చిన్నచూపా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి తొక్కిసలాట ఘటనలో మరణించిన బాధిత కుటుంబాల పట్ల ఇటు ప్రభుత్వం, అటు టీటీడీ వ్యవహరిస్తున్న తీరుపై భక్తులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే టీటీడీనే చెక్కులు పంపిణీ చేయనున్నట్లు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు శనివారం రాత్రి వెల్లడించారు. బోర్డు సభ్యులతో కమిటీని నియమించి మృతుల కుటుంబాలను పరామర్శించి చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. దీనిపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలను సీఎం, టీటీడీ చైర్మన్‌ నేరుగా వెళ్లి పరామర్శించి చెక్కులు ఇచ్చేందుకు మనస్సు రాలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

14వ తేదీ టోకెన్ల విడుదల

వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఒకరోజు ముందు జారీ చేసేలా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం 13వ తేదీకి సంబంధించిన టికెట్లను 11వ తేదీ రాత్రి 9 గంటల నుంచి పంపిణీ మొదలుపెట్టారు. 14వ తేదీకి సంబంధించి 12వ తేదీ రాత్రి నుంచి ఇవ్వాల్సి ఉండగా రద్దీ లేకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే టికెట్లు జారీ చేశారు.

తలచుకుంటేనే భయమేస్తుంది
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సమయంలో జరిగిన ఘటన తలచుకుంటేనే భయం వేస్తోంది. ఆ రోజు తిరుపతికి టోకెన్ల కోసం వచ్చాం. విషయం తెలిసి భయంతో ఊరికి వెళ్లిపోయాం. రష్‌ తగ్గింది అని సమాచారం అందగానే ఆదివారం మళ్లీ తిరుపతికి వచ్చి టోకెన్లు తీసుకున్నాం. క్యూలో ఇంకా భద్రత పెంచాల్సి అవసరముంది.
– త్యాగరాజన్‌, భక్తుడు, తిరుత్తణి

జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రస్తుతం క్యూలు చాలా ఫ్రీగా ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం భక్తులు ఇప్పుడు టోకెన్ల కోసం పెద్దగా రావడంలేదు, అందరూ భయపడిపోయారు. టీటీడీ అధికారులు, పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవాప్తంగా తొక్కిసలాటపై చర్చించుకుంటున్నారు. శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలి. – మహాలక్ష్మి, భక్తురాలు, కోలార్‌

రోదన వర్ణనాతీతం
క్యూలో సరైన సదుపాయాలు లేకుండా భద్రతపై దృష్టి సారించకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగింది. ఎంత డబ్బులు ఇచ్చినా పోయిన మనిషిని తెచ్చివ్వలేరు. ఆ బాధను ఆ కుటుంబం జీవితాంతం అనుభవించాల్సిందే. తల్లికి దూరమైన బిడ్డ, భార్యకు దూరమైన భర్త రోదన వర్ణనాతీతం. వారికి కలిగిన నష్టం ఏవరూ తీర్చలేనిది. నాటి ఘటనను చూసినవారు చెబుతుంటేనే ఒళ్లు జలదరిస్తోంది.
–ప్రమీలమ్మ, భక్తురాలు, గుంటూరు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement