మూడున్నర నెలల్లో.. ఏసీబీకి చిక్కిన నలుగురు పోలీసులు
అక్రమ ఇసుక దందాలోనే..
ఖాకీ వనంలో గంజాయి మొక్కలుగా పోలీసులు అవినీతి సొమ్ముకు అలవాటుపడి ఒక్కొక్కరుగా ఏసీబీ అధికారులు విసిరిన ‘వల’లో చిక్కుతున్నారు. కేవలం మూడున్నర మాసాల వ్యవధిలో నలుగురు ఖాకీలు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడి పోలీస్‌శాఖకు మచ్చతెచ్చారు.
మెదక్‌జోన్: జిల్లాలోని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల సమీపంలో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్‌లో గత మార్చి 19న అవుసులపల్లి వార్డుకు చెందిన ఓవ్యక్తి ఇసుకను గ్రామశివారులోని వాగు నుంచి అక్రమంగా తరలిస్తుండగా రూరల్ పోలీసులు ట్రాక్టర్‌ను సీజ్‌చేశారు. దీంతో ఆ యజమాని మైనింగ్ అధికారులకు జరిమానా చెల్లించి ట్రాక్టర్‌ను విడుదల చేయాల్సిందిగా కోరాడు. అందుకు రూ.25వేలు లంచం ఇస్తేనే ట్రాక్టర్‌ను వదిలిపెడతామని ఓ కానిస్టేబుల్ ట్రాక్టర్ యజమానిని డిమాండ్ చేశాడు. దీంతో విసుగు చెందిన ఆ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
దీంతో లంచం తీసుకుంటుండగా పోలీస్ రైటర్ బాసిత్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే స్టేషన్ బయట ఉన్న ఎస్‌ఐ అమర్ ఫోన్ స్విచ్చ్‌ఆఫ్ చేసుకుని పారిపోయారు. పది రోజులపాటు ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా పరారైయ్యారు. 15రోజుల అనంతరం ఎస్‌ఐ డ్యూటీలో చేరిన విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు మళ్లీ విచారణ జరిపారు. లంచం తీసుకున్న కేసులో ఎస్‌ఐతోపాటు మరో కానిస్టేబుల్ సురేందర్ హస్తం ఉందని నిర్ధారించి ఆ ఇద్దరు కానిస్టేబుల్స్‌తోపాటు ఎస్‌ఐ అమర్‌ను సస్పెండ్‌చేసి రిమాండ్‌కు తరలించారు.
ఏసీబీ ట్రాప్‌లో నలుగురు
తాజాగా హవేళిఘణాపూర్ ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్‌తో సహా కేవలం మూడున్నర నెలల వ్యవధిలోనే ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు కానిస్టేబుల్స్ కలిసి మొత్తం నలుగురు ఏసీబీకి పట్టుబడడంతో పోలీసుల అవినీతి బాగోతంపై జిల్లాలో చర్చసాగుతోంది.
ఏసీబీ వలలో హవేళి ఎస్‌ఐ
హవేళిఘణాపూర్: ఇసుకను అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఓ టిప్పర్‌ను వదిలిపెట్టేందుకు మధ్యవర్తి ద్వారా రూ.20వేలు లంచం తీసుకుంటుండగా స్థానిక ఎస్‌ఐ ఆనంద్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు ట్రాప్‌చేసి సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌కు చెందిన పూల గంగాధర్ టిప్పర్ ఈ నెల 29న ఇసుకను తరలిస్తూ పట్టుబడింది. ఈ టిప్పర్‌ను విడిచిపెట్టడానికి ఎస్‌ఐ ఆనంద్ గౌడ్ రూ.50వేలు డిమాండ్ చేయగా రూ.20వేలకు ఒప్పందం కుదిరింది. ఈ కేసులో గంగాధర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం మధ్యవర్తి మస్తాన్ అనే వ్యక్తి హవేళిఘణాపూర్ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి డబ్బులు తీసుకొనివెళ్లి ఎస్‌ఐకు ఇవ్వగా పట్టుకొని విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీబీ సిబ్బంది రమేశ్, వేణు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment