
మామిడ్గి, గంగ్వార్, మల్గి గ్రామాల్లో విషాదఛాయలు
న్యాల్‌కల్(జహీరాబాద్): మహా కుంభమేళా యాత్ర రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో మామిడ్గి, గంగ్వార్, మల్గి గ్రామాలు శోకసంద్రమయ్యాయి. రెండు రోజుల్లో తిరిగి వస్తామంటూ చిన్నారులను చెప్పి వెళ్లిన వారు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మామిడ్గికి చెందిన వెంకట్రాంరెడ్డి, భార్య విలాసిని, వదిన విశాల, ఇటికెపల్లి చెందిన జ్ఞానేశ్వర్‌రెడ్డి, మల్గికి చెందిన మల్లారెడ్డి, సంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయుడు మోతిలాల్ కలిసి 22న కారులో మహా కుంభమేళాకు వెళ్లారు.
పుణ్య స్నానాలు చేసి కాశీకి బయలు దేరగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రక్కును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకట్‌రాంరెడ్డి, విలాసిని, డ్రైవర్ మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు కాగా విశాల వారణాసి ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. వెంకట్రాంరెడ్డి సంగారెడ్డిలో ఉంటూ జహీరాబాద్ ఇరిగేషన్ డీఈఈగా, కోహీర్ ఇన్‌చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు.
అలాగే.. మల్లారెడ్డి కొంత కాలంగా జహీరాబాద్‌లో ఉంటున్నాడు. కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు ప్రియాంశీ 5వ తరగతి, కుమారుడు సాయి స్లోక్ రెడ్డి 7వ తరగతి చదువుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయం ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది. గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందించడంతోపాటు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది.
వెంకట్రాంరెడ్డి సౌమ్యుడు
జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన నీటిపారుదల శాఖ డీఈఈ వెంకట్రాంరెడ్డి విధి నిర్వహణలో అందరికీ ఆదర్శంగా ఉండేవారు. తాను ఉన్నత ఉద్యోగిని అనేవిషయాన్ని పక్కన పెట్టి తానే స్వయంగా పనులు చూసేవారు. విధి నిర్వహణలో ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా అన్నీ తానై చూసేవారు. పనుల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడేవాడు కారని, పని సంతృప్తి కరంగా ఉన్నట్లయితేనే బిల్లులు మంజురు సేచేవారనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. జహీరాబాద్‌లోని శ్రీసరస్వతీ శిశుమందిరంలో 1998లో 10వ తరగతి పూర్తి చేసుకున్నారు.
అనంతరం ఉన్నత చదువులు హైదరాబాద్‌లో పూర్తి చేసుకుని 2007 జహీరాబాద్‌లో ఉద్యోగం పొందాడు. నీటిపారుదల శాఖలో ఏఈగా విధుల్లో చేరారు. అనంతరం పటాన్‌చెరు, నారాయణఖేడ్‌లో ఏఈగా పని చేశారు. డీఈఈగా పదోన్నతిపై తిరిగి జహీరాబాద్ వచ్చారు. తోటి ఉద్యోగులు, సిబ్బంది, స్నేహితులు, బంధువులతో మర్యాదగా మసలుకుంటూ సౌమ్యుడిగా పేరుతెచ్చుకున్నారు. రోడ్డుప్రమాదంలో మరణించిన డీఈఈ వెంకట్రాంరెడ్డికి దైవభక్తి అధికం. ప్రతి ఏటా కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లివచ్చే వారు.
సడెన్‌గా యాత్రకు వెళ్లాలని నిర్ణయం
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లిరావాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నట్లుగా బంధువుల ద్వారా తెలుస్తోంది. యాత్రకు వెళుతున్న విషయం సన్నిహితులకు కూడా సమాచారం లేదు. కుంభమేళ ముగుస్తుండడంతో ఎలాగైనా వెళ్లిరావాలని బంధువులంతా నిర్ణయించి ప్రయాణమయినట్లు బంధువర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment