ఒకేరోజు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మృతి
బతుకుదెరువుకు వెళ్తూ ఐదుగురు కూలీల మృతి
పుట్టినరోజు నాడే ఓ యువకుడు దుర్మరణం
భార్య కళ్లెదుటే విగత జీవిగా మారిన భర్త
కుటుంబాల్లో విషాదం నింపిన ప్రయాణాలు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మరణించారు. పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం బయలుదేరిన కూలీలు గమ్యం చేరకముందే అనంతలోకాలకు చేరుకున్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని సోదరుడితో తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు మరణించగా.. స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొనటంతో భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.
ఐదుగురు వలస కూలీలు దుర్మరణం
రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 32 మంది వలస కూలీలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుప్త ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు గురువారం సాయంత్రం 4 గంటలకు బయలు దేరారు.
ఐలాపురం గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఇసుక లారీ టైరు పంక్చర్ కావడంతో పక్కకు నిలిపారు. ఆ లారీని ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గరడ సునీల్ (40), ఒడిశాకు చెందిన కూలీలు రూపు హరిజన్ (51), సుల హరిజన్ (46), సునమని హరిజన్ (61) అక్కడికక్కడే మృతిచెందగా, ప్రత్యూష్ ప్రభాత్ హరిజన్ (17) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. బస్సు ఢీకొట్టిన వేగానికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి.
జన్మదినం రోజే మృత్యు ఒడిలోకి..
పెద్దపల్లి మండలం రంగాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన అనవేన అభిలాష్ (19), కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన చుంచు రాజ్‌కుమార్ (20) మరణించారు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్ల కొడుకులు. చుంచు రాజ్‌కుమార్ జన్మదినం కావడంతో అప్పన్నపేటలోని అభిలాష్‌తో కలిసి బైక్‌పై గుండారంలోని స్నేహితుల వద్దకు వెళ్లారు. అక్కడ వేడుక చేసుకొని తిరిగి వస్తుండగా రంగాపూర్ శివారులో ట్రాన్స్‌కోకు చెందిన బొలేరో వాహనాన్ని బైక్‌తో బలంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అభిలాష్ అక్కడికక్కడే మరణించగా, రాజ్‌కుమార్‌ను కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. జగిత్యాల – ధర్మపురి జాతీయ రహదారిపై తక్కళ్లపల్లి శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన బూతగడ్డ అరవింద్ (21), బత్తుల సాయి (22), మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దయ్యాల వంశీ (22) దుర్మరణం చెందారు. వంశీ 15 రోజుల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు.
మనుమడి బారసాలకు వెళ్లి వస్తూ..
మనుమడి బారసాల వేడుకలు జరుపుకొని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ – సూర్యాపేట రహదారిపై కొడకండ్ల మండలం మైదంచెరువు తండ వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. నాగారం మండలం ఈటూరుకు చెందిన పేరాల వెంకన్నలక్ష్మి దంపతుల కుమారుడైన యుగంధర్‌కు కుమారుడు జన్మించగా గురువారం దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో బారసాల వేడుక జరిగింది.
ఈ వేడుకకు వెంకన్న కుటుంబసభ్యులు, బంధువులంతా తుఫాన్ వాహనంలో వెళ్లారు. వేడుకల అనంతరం అదే వాహనంలో రాత్రి ఈటూరుకు తిరిగి వస్తుండగా మైదంచెరువు తండా శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉన్న డీసీఎం వాహనాన్ని తుపాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పేరాల వెంకన్న (45) అతని తమ్ముడి భార్య పేరాల జ్యోతి (35) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ పేరాల ఊషయ్య, పేరాల లక్ష్మి, వంగూరి నర్సమ్మ, పేరాల లావణ్య, ఉప్పలమ్మ, ముత్యాలును జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పేరాల లక్ష్మి, పేరాల ఊషయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
స్నేహితులను కబలించిన లారీ
మెదక్ జిల్లా నర్సాపూర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మరణించారు. శివ్వంపేట మండలం అల్లీపూర్‌కు చెందిన పిట్ల నాగరాజు (25), కమ్మరి దుర్గాప్రసాద్(25) స్నేహితులు. నాగరాజు తాను పనిచేసే కొంపల్లిలోని ఓ పౌల్ట్రీ కార్యాలయానికి దుర్గాప్రసాద్‌తో కలసి బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా నర్సాపూర్ ఎస్‌బీఐ సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు తుదిశ్వాస విడిచాడు. ఈ రెండు కుటుంబాలకు వీరు ఒక్కొక్కరే సంతానం కావటం గమనార్హం
భార్య కళ్లెదుటే భర్త మృతి
స్కూటీని లారీ ఢీకొట్టడంతో భార్య కళ్లెదుటే భర్త మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ఎర్రవెళ్లి బాలకిష్టయ్య (59)కు బెజ్జంకి మండలం గుగ్గిళ్లకు చెందిన ఓ వ్యక్తితో వ్యవసాయ బావి విషయంలో భూ వివాదం ఉంది. వివాదం పరిష్కారం కోసం 20 రోజులుగా కలెక్టరేట్ చుట్టూ దంపతులిద్దరూ తిరుగుతున్నారు. శుక్రవారం అదే పని మీద వీరు స్కూటీపై కలెక్టరేట్‌కు వెళ్తుండగా, కలెక్టరేట్ ఎదుట వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి.. స్కూటీని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలై బాలకిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రేణుకకు స్వల్ప గాయాలయ్యాయి. రేణుక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment