హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్బంగా తెలంగాణలోని పలు చోట్ల అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నగురం గ్రామంలో గణేష్ నిమజ్జనానికి వెళ్లిన ముగ్గురు వాగులో పడి మరణించారు. అయితే వాగులో నీరు ఉధృతంగా ప్రవహించడంలో ఆ ముగ్గురి మృతదేహలు వాగులో కొట్టుకుపోయాయి. మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అలాగే వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలం పంతినిలో వినాయకుడ్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో విగ్రహం కిందపడి పొన్నం కొమరయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే కోమరయ్య తుది శ్వాస విడిచాడు.
మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం అవంచలో గణేష్ నిమజ్జనానికి వెళ్లిన పర్వతాలు అనే వ్యక్తి మృతి చెందాడు. దాంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.