‘సాగర్’లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దు
అధికారులకు మరోసారి తేల్చిచెప్పిన హైకోర్టు
నిమజ్జనాల వేళ ధిక్కరణ పిటిషన్‌పై ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలు చేయొద్దంటూ సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. మట్టి, ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే నిమజ్జనం చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్‌పారిస్ (పీవోపీ) విగ్రహాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసే కృత్రిమ నీటికుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది.
న్యాయవాది వేణుమాధవ్ వేసిన ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ వినోద్‌కుమార్, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ పీవోపీ విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్లు నిలుపుతున్నారని న్యాయవాది వేణుమాధవ్ అభ్యంతరం తెలిపారు.
భారీ క్రేన్ల వల్ల ట్యాంక్‌బండ్‌కు ముప్పు ఉందన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదిస్తూ ‘కోర్టు ధిక్కరణ చట్ట ప్రకారం ఒక వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయడానికి గడువు ఒక సంవత్సరం. కానీ పిటిషనర్ 2021 నాటి సు ప్రీం మార్గదర్శకాలను ప్రస్తావిస్తున్నారు క నుక పిటిషన్ అక్కడే వేయాలి. ఇక్కడ వేసిన పిటిషన్‌ను అనుమతించొద్దు’అని కోరారు.
ఇన్నాళ్లూ ఏం చేశారు?
న్యాయవాది వేణుమాధవ్ వాదనలపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘2021లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇస్తే రెండేళ్లుగా ధిక్కరణ పిటిషన్ ఎందుకు వేయలేదు? అధికారులు ఒకవేళ రెండేళ్లు మార్గదర్శకాలు పాటించి ఉంటే ఇప్పుడు పాటించరని ముందే ఎలా చెబుతారు? అయినా ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడో ముందే తెలిసినా ఇన్ని నెలలు పిటిషన్ వేయకుండా నిమజ్జనాల వేళ పిటిషన్ వేయడంలో మీ ఉద్దేశం ఏమిటి?
పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేస్తే ఫొటోలతో నివేదిక అందజేయాలని 2023లో హైకోర్టు ఆదేశించినా ఆ పని చేయలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చే నాటికి హైడ్రా మనుగడలో లేదు. అలాంటప్పుడు హైడ్రాను ప్రతివాదిగా ఎలా చేరుస్తారు? ప్రస్తుతానికి కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదు. పిటిషన్‌ను అనుమతించడంపైనే విచారణ చేస్తున్నాం. ఆలస్యంపట్ల మీరు విచారం వ్యక్తం చేసినా అనుమతించలేం.
చివరి నిమిషంలో ప్రభుత్వం ఎస్‌ఎల్‌పీ దాఖలు చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా 2021లో తప్పుబట్టింది కదా. అదే ఉత్తర్వు లు అందరికీ వర్తిసాయి. పీవోపీ విగ్రహాల నిమజ్జనం, కాలుష్య ఆరోపణలను రుజువు చేసేందుకు ఆధారాలు, గణాంకాలను వెల్లడించలేదు. అయితే జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విధిగా పాటించాల్సిందే’అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ధిక్కరణ పిటిషన్‌లో విచారణ ముగించింది.
కాగా, పీవోపీ విగ్రహాల తయారీపై నిషేధం విధిస్తూ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌లో పీసీబీ తీరుపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే అవి చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టాలిగానీ రహదారినే తీసేస్తామన్నట్లు అధికారుల చర్యలు ఉన్నాయని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment