రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. 3 నెలల సమయం కోరిన అడ్వొకేట్ జనరల్
సాక్షి, హైదరాబాద్: వికాస్ కిషన్‌రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్లను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనానికి రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలి.. సామాజిక, రాజకీయ అంశాలు, వెనుకబాటుతనం లాంటి అంశాలను పరిశీలించి జనాభా నిష్పత్తికి అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు నిర్ధారించాలి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లన్నీ 50 శాతానికి మించకూడదు’ అని వికాస్ కిషన్‌రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొన్న ఈ మూడు సూత్రాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.
దీన్ని అమలు చేసేందుకు మూడు నెలల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి కోరారు. దీంతో తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేస్తూ, అప్పటిలోగా నివేదిక అందజేయాలని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో బీసీల జనాభా వివరాలను సేకరించడానికి, సర్వేల నిర్వహణకు తెలంగాణ బీసీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను అధీకృత సంస్థగా ప్రభుత్వం గుర్తించడం రాజ్యాంగ వ్యతిరేకమని.. రాజ్యాంగ బద్ధమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి రిజర్వేషన్లను నిర్ణయించాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సహా మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.
ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ధర్మేశ్ డీకే జైస్వాల్, శ్రీనివాస్ యాదవ్, కౌటూరు పవన్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్, కేంద్రం తరఫున డీఎస్‌జీ గాడి ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు. వికాస్ కిషన్‌రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్లోని పేరా 13 అమలుపై వివరాలు తెలుసుకుని చెబుతామని గత విచారణ సందర్భంగా ఏజీ వెల్లడించారు.
మంగళవారం విచారణ సందర్భంగా మూడు అంశాలు అమలు చేయడానికి ఎంత సమయం కావాలని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి అధ్యయనానికి 3 నెలల సమయం కావాలని కోరడంతో అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment