people died
-
సైనిక స్కూల్‌పై రష్యా దాడి
కీవ్: రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై భీకర దాడికి పాల్పడింది. సెంట్రల్ ఉక్రెయిన్ ప్రాంతం పొల్టావా నగరంలోని సైనిక శిక్షణా కేంద్రం, ఆ సమీప ఆస్పత్రులే లక్ష్యంగా రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో 51 మంది చనిపోయారు. 219 మంది గాయపడ్డారు. శిథిలాల్లో చిక్కుకున్న 11 మంది సహా మొత్తం 25 మందిని కాపాడినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. 2022లో ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలు పెట్టిన తర్వాత రష్యా చేపట్టిన భీకర దాడుల్లో ఇదొకటని పరిశీలకులు అంటున్నారు. కీవ్, ఖర్కీవ్‌లను కలిపే ప్రధాన రహదారి, రైల్వే మార్గంపై పొల్టావా ఉంది.మంగళవారం ఉదయం హెచ్చరిక సైరన్లు మోగడంతో బాంబు షెల్టర్లలోకి పరుగు తీస్తుండగానే క్షిపణులు వచ్చి పడ్డాయని స్థానికులు తెలిపారు. దాడిలో సైనిక శిక్షణ కేంద్రానికి చెందిన ఒక భవనం పాక్షికంగా దెబ్బతింది. అందులోని చాలామంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. వీరిలో చాలా మందిని సహాయక సిబ్బంది రక్షించారని పేర్కొంటూ జెలెన్స్కీ టెలిగ్రామ్ ఛానల్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. సైనిక సాయం వెంటనే అందజేయాలంటూ మరోసారి ఆయన పశ్చిమదేశాలను కోరారు. రష్యాలోని సరిహద్దులకు దూరంగా ఉండే ప్రాంతాలపై దాడులు చేపట్టేందుకు తమకు అనుమతివ్వాలన్నారు.‘ఉక్రెయిన్‌కు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, రష్యాపై ఎదురుదాడికి దిగేందుకు క్షిపణుల అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. ఎప్పుడో తర్వాత కాదు. అవి గోదాముల్లో ఉంటే ఎవరిక్కావాలి?’అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సాయం అందించడంలో ఆలస్యం జరిగే ఒక్కో రోజూ దురదృష్టవశాత్తూ మరిన్ని మరణాలకు కారణమవుతోందన్నారు. అమెరికా, పశ్చిమదేశాల నుంచి తక్షణ సైనిక సాయం అందే జాడలు కనిపించకపోవడం విచారకరమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా వ్యాఖ్యానించారు. -
Morocco earthquake: వణికిన మొరాకో
మర్రకేశ్: మొరాకోను భారీ భూకంపం వణికించింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సంభవించిన భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, వీధుల్లోకి పరుగులు తీశారు. అట్లాస్ పర్వతాల్లోని గ్రామాలు మొదలుకొని చార్రితక మర్రకేశ్ నగరం వరకు వందలాదిగా భవనాలు ధ్వంసం కాగా 1,000 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. సుమారు 45 లక్షల మంది నివసించే మర్రకేశ్–సఫి ప్రాంతంలోనే భూకంప నష్టం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా. సుదూర ప్రాంతాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మర్రకేశ్లోని 12వ శతాబ్దం నాటి చారిత్రక కౌటౌబియా మసీదు భూకంప ధాటికి దెబ్బతింది. ఈ మసీదులోని 226 అడుగుల ఎత్తైన మినారెట్ ‘రూఫ్ ఆఫ్ మర్రకేశ్’గా ప్రసిద్ధి. అదేవిధంగా, నగరం చుట్టూతా ఉన్న ఎర్రటి గోడ అక్కడక్కడా దెబ్బతిన్న దృశ్యాలు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ గోడను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. భూకంప కేంద్రానికి చుట్టుపక్కలున్న మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో వెయ్యి మందికి పైగా చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మరో 672 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 205 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మొరాకో ప్రభుత్వం తెలిపింది. భూకంప కేంద్రం సమీపంలోని ఓ పట్టణంలో చాలా వరకు ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికుడొకరు వెల్లడించారు. అట్లాస్ పర్వతప్రాంతంలోని అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని తలత్ ఎన్ యాకూబ్ పట్టణంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్పారు. సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. పర్యాటకులను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. రహదారులు దెబ్బతినడంతో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అత్యవసర బృందాలు భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం గాలిస్తున్నాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా అరుదు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో భూకంపాలు చాలా అరుదు. మొరాకోలోని పర్వత ప్రాంతంలో ఇంతటి అత్యంత తీవ్ర భూకంపం గతంలో ఎన్నడూ సంభవించలేదని నిపుణులు చెబుతున్నారు. 1960లో 5.8 తీవ్రతతో మొరాకోలోని అగడిర్ నగరంలో సంభవించిన భూకంపంలో వేలాదిగా జనం చనిపోయారు. 2004లో తీరప్రాంత నగరం అల్ హొసైమాలో భూకంపంతో 600 మంది చనిపోయారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని నగరాలు, పట్టణాల్లో భూకంపాలను తట్టుకునే విధంగా భవనాల నిర్మాణం జరిగింది. అయితే, పల్లెల్లో మాత్రం ఇలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. తాజా భూకంపం ప్రభావం పోర్చుగల్, అల్జీరియా వరకు ఉంది. ప్రమాదకర భూకంపం భూకంప తీవ్రత అర్ధరాత్రి 11.11 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని, భూకంపం సంభవించిన 19 నిమిషాల తర్వాత తీవ్రత 4.9గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప కేంద్రం అల్ హౌజ్ ప్రావిన్స్‌లోని ఇఘిల్ పట్టణం సమీపంలో, మర్రకేశ్‌కు దక్షిణాన సుమారు 70 కిలోమీటర్ల దూరంలో భూమిలో 18 కిలోమీటర్ల లోతున ఉందని తెలిపింది. తక్కువ లోతులో సంభవించే ఇటువంటి భూకంపాలు అత్యంత ప్రమాదకరమని పేర్కొంది. ప్రపంచదేశాల ఆపన్న హస్తం సాయం కోసం మొరాకో ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి విజ్ఞాపన చేయనప్పటికీ..ఈ ఘోర ప్రకృతి విపత్తుపై ప్రపంచ దేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొరుగునున్న యూరప్ దేశాలు, మధ్యప్రాచ్యం తమ వంతుగా సాయం అందజేస్తామని ప్రకటించాయి. భారత్‌తోపాటు తుర్కియే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యాతోపాటు ఉక్రెయిన్ కూడా కష్టాల్లో ఉన్న మొరాకో ప్రజలను ఆదుకుంటామని ఇప్పటికే తెలిపాయి. సాధ్యమైనంత సాయం అందజేస్తాం: మోదీ మొరాకోలో భూకంపంతో పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు భారత్ సాధ్యమైనంత మేర ఆదుకుంటుందని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం మొదలైన జీ20 భేటీ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మొరాకో భూకంప మృతులకు సంతాపం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం మొరాకోకు మద్దతుగా నిలవాలనీ, సాధ్యమైనంత మేర సాయం అందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
బ్రెజిల్లో పేకమేడలా కూలిన భవనం, 8 మంది మృతి
బ్రెసిలియా: బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రమైన పెర్నాంబుకోలో ఓ నాలుగు అంతస్తుల భవనం పేకమేడను తలపిస్తూ క్షణాల వ్యవధిలో నేలకూలింది. భారీ శబ్దం చేస్తూ బిల్డింగ్ నేలకూలిన ఈ వీడియో చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ సంఘటన తెల్లవారుజామున జరగడంతో అందులోని వారంతా నిద్రావస్థలో ఉండి ఉంటారని.. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అక్కడి అధికారులు తెలిపారు. మృతుల్లో 5 ఏళ్ళు, 8 ఏళ్ళు వయసున్న ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని వారు తెలిపారు. శిధిలాల కింద మరింతమంది చిక్కుకుని ఉండవచ్చని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని.. విపత్తు నిర్వహణ బృందాలు శరవేగంగా శిధిలాలను తొలగించి మిగిలినవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు స్థానిక అధికారులు. ఇటీవల బ్రెజిల్లో జోరుగా కురిసిన వానలే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని వారంటున్నారు. ఇది కూడా చదవండి: అంతటి బ్రిట్నీ స్పియర్స్ కు ఇంతటి ఘోర అవమానమా? 🔴 BRAZIL 🇧🇷| At least 3 residents killed and 15 trapped under the rubble after the collapse of a building in the Janga district, outskirts of the city of #Recife, State of Pernambuco (northeast). The heavy rains of last few days in the coastal city may have caused the accident. pic.twitter.com/DhDBNh6nfU — Nanana365 (@nananamedia365) July 8, 2023 -
పాకిస్తాన్లో భారీ భూకంపం ఫోటోలు
-
పాకిస్తాన్లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఘోర భూకంపం చోటు చేసుకుంది. గురువారం సంభవించిన భూకంపంలో 20 మృతి చెందగా, సుమారు 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక అస్పత్రులకు తరలిస్తున్నారు. రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంపం తీవ్రతగా అధికంగా ఉండటంతో పలు ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనపై బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియా ఉల్లా లాంగా స్పందిస్తూ.. ఉదయం చోటు చేసుకున్న భూకంపంలో 20 మంది మృతి చెందారని తెలిపారు. మృతి చెందిన 20 మందిలో ఒక మహిళా, ఆరుగురు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. 200 మంది క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. -
అతివేగానికి ఐదుగురు బలి
జోగిపేట (అందోల్)/ కొల్చారం(నర్సాపూర్): అతివేగం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. సంగారెడ్డి నుంచి వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పాస్టర్ లూకా (46), ఆయన భార్య దీవెన (44), అదే జిల్లా సంగాయిపేటకు చెందిన అంబదాస్ (45), ఆయన భార్య పద్మ (30), వారి కుమారుడు వివేక్ (5) అక్కడిక్కడే మృతి చెందారు. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న వివేక్‌కు నాలుగు రోజుల కింద సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. శుక్రవారం డిశ్చార్జి కావడంతో పాస్టర్ లూకాకు చెందిన కారులో వారంతా తిరుగుపయనమయ్యారు. ఇంతలోనే వారిని మృత్యువు కబళించింది. కారు అతివేగంగా నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ బాలాజీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చర్చిలో ఇరు కుటుంబాలకు స్నేహం అంబదాస్ కుటుంబం ప్రతి ఆదివారం రంగంపేటలోని చర్చిలో ప్రార్థనలకు వస్తుండేది. ఈ క్రమంలో ఆ చర్చిలోని పాస్టర్ లూకా, అంబదాస్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. సంగారెడ్డి ఆసుపత్రి నుంచి తమ కుమారుడి డిశ్చార్జికి వెళ్లాలని చెప్పగా పాస్టర్ లూకా తన కారు తీసుకొచ్చాడు. రెండు కుటుంబాల్లో విషాదం అంబదాస్–పద్మ దంపతులకు వినయ్, వివేక్ ఇద్దరు కుమారులు. ప్రమాదంలో అంబదాస్, పద్మ, వివేక్ చనిపోవడంతో వినయ్ అనాథగా మిగిలాడు. పాస్టర్ లూకా–దీవెన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. తల్లిదండ్రుల మృతితో ఆ నలుగురికీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. సీటు బెల్ట్ ధరించి ఉంటే.. ముందు సీటులో కూర్చున్న పాస్టర్ దంపతులు సీటు బెల్టు ధరించలేదు. సీటు బెల్టు ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోకపోయేవారని అంటున్నారు. సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోలేదని, ఒకవేళ అవి తెరుచుకుని ఉం టే ప్రమాద తీవ్రత ఇంతగా ఉండేది కాద ని స్థానికులు చెబుతున్నారు. కాగా, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృత్యు రహదారి సంగారెడ్డి–నాందేడ్–అకోలా హైవేకు మృత్యు రహదారి అనే పేరుంది. చౌటకూరు నుంచి శివ్వంపేట వరకు ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు యాభైకి పైగా ప్రమాదాలు జరిగాయి. రహదారి విస్తరణ పనులు మొదలుకాక ముందు డబుల్ రోడ్డుగా ఉండేది. అప్పుడు తరచుగా ప్రమాదాలు జరిగేవి. ఇదీ లూకా నేపథ్యం పాస్టర్ లూకాది సంగారెడ్డి జిల్లా శివంపేట మండలం గూడూరు. 20 ఏళ్ల కింద రంగంపేటకు వచ్చి స్థిరపడ్డాడు. తొలుత చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని చర్చి ప్రారంభించాడు. ఆ తర్వాత సొంతంగా స్థలం తీసుకొని చర్చి నిర్మించాడు. చర్చికి వచ్చేవారికి దీవెనయ్యగా సుపరిచితుడు. డివైడర్లు ఉంటే.. ప్రాణాలు దక్కేవి నాందేడ్–అకోలా జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా డివైడర్ల ఏర్పాటు చేయలేదు. పనులు కూడా పూర్తికాలేదు. దీంతో అన్ని వాహనాలు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. ప్రమాదస్థలి వద్ద రోడ్డు వెడల్పుగానే ఉంది. లారీ ఎడమవైపు వస్తుండగా, కుడివైపున కారు ఢీకొంది. ఎడమవైపు వెళ్లాల్సిన కారు కుడి వైపు ఎందుకు వెళ్లిందో..? అతి వేగంగా వెళ్లడమా..? లేదా ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతే ఈ ఘటన జరిగిందా..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. ‘భయంగా ఉందిరా..’ అంబదాస్ ఆటోడ్రైవర్ కాగా, భార్య పద్మ కూలి పనులకు వెళ్తుంటుంది. చుట్టుపక్కల వారిని తల్లో నాలుకగా ఉంటారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో కొడుకు వినయ్‌కు ఫోన్‌చేసి తనకు భయం అవుతోందని, సంగారెడ్డికి రమ్మని చెప్పగా.. జోగిపేట వరకు వస్తానని, అక్కడ కారు దిగితే బస్సులో వెళ్దాం అని తన తండ్రితో వినయ్ చెప్పాడు. అయితే జోగిపేట రాకముందే దారుణమైన ప్రమాదం జరిగింది. -
భారీ అగ్ని ప్రమాదం: తొమ్మిది మంది అధికారులు దుర్మరణం
సాక్షి, కోల్‌కతా: కోల్‌కతాలో సంభవించిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కోల్‌కతాలో తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈప్రమాదంలో తొమ్మిదిమంది అధికారులు అగ్నికి ఆహూతైపోయారు. వీరిలో ఒక పోలీసు ఉన్నతాధికారితో పాటు నలుగురు ఫైర్‌మేన్లు ఇద్దరు రైల్వే ఆఫీసర్లు, ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు. తొమ్మిది మృతదేహాలలో ఐదు మృతదేహాలను 12 వ అంతస్తులోని లిఫ్ట్‌లో కనుగొన్నారు. వారంతా లిఫ్ట్‌లోపల ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలుస్తోంది. మరికొంతమంది కనిపించకుండా పోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన నెలకొంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరణించిన నలుగురు అగ్నిమాపక సిబ్బంది గిరీష్ డే, గౌరవ్ బెజ్, అనిరుద్ద జన, బీమన్ పుర్కాయత్‌గా గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతులకు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతులకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అటు ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారుత్వరగా కోలుకోవాలంటూ ప్రధానిమోదీ ట్విట్ చేశారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు కేంద్రమంత్రి ఆదేశించారు. Saddened by the loss of lives due to the fire tragedy in Kolkata. In this hour of sadness, my thoughts are with the bereaved families. May the injured recover at the earliest. — Narendra Modi (@narendramodi) March 9, 2021 -
జల్లికట్టులో విషాదం.. ఇద్దరు మృతి
చెన్నై: జల్లికట్టులో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా నేర్లగిరిలో ఆదివారం ఉదయం నుంచి జోరుగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను తిలకించడానికి భారీగా జనం చేరుకున్నారు. భవనాలపై ఎక్కి జల్లికట్టు పోటీలను తిలకిస్తున్నారు. ఈ క్రమంలో ఓ భవనం కులడంతో మెడమీద ఉన్న ఇద్దరు మృతి చెందారు. మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చదవండి:జల్లికట్టుకు గ్రీన్‌సిగ్నల్ -
పంజాబ్: బిల్డింగ్ కూలి ముగ్గురు మృతి
చండీగఢ్: పంజాబ్‌లో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలి ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మొహాలి జిల్లాలోని డేరా బస్సీలో గురువారం ఉదయం ఒక భవనం కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్లు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెలిపాయి. శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు వెల్లడించాయి. వారిని వెలికి తీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. -
‘మహా’ విషాదంలో 13 మంది మృతి
ముంబై: మహారాష్ట్రలో ఐదంతస్థుల భవనం కుప్పకూలిన సంఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. రాయ్‌గఢ్ జిల్లా మహద్ పట్టణంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మహమ్మద్ నదీమ్ బతికి బయటపడ్డాడు, శిథిలాల నుంచి ఇప్పటికి 12 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. భవనం కూలేటప్పుడు ఎగిరివచ్చిన రాయి ఒకటి తలకు తగిలి మరో వ్యక్తి మరణించినట్లు చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతానికి 9 మందిని కాపాడామని అధికారులు చెప్పారు. మరో ముగ్గురి జాడ ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 304, 338 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. కేసులో బిల్డర్ ఫరూక్ ఖాజీ, ఆర్కిటెక్ట్ గౌరవ్ షా సహా ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారు. కళ్లముందే పిల్లర్లు బద్దలు భవనం కూలే సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్తంభాలు బీటలిచ్చి ముక్కలవడం చూశానని ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్షసాక్షి ముస్తఫా ఛపేకర్ చెప్పారు. 40 ఫ్లాట్లున్న ఈ భవనం కూలడానికి ముందు తనకు ప్రకంపనలు తెలిశాయని, దీంతో బాల్కనీలోకి పరిగెత్తి ఏం జరుగుతుందో తెలుసుకునే యత్నం చేశానని చెప్పారు. బయటున్న వారు వెంటనే తనను భవనం వెలుపలకు రమ్మని చెప్పారని, దీంతో తాను, కుటుంబ సభ్యులు బయటకు పరిగెత్తామని తెలిపారు. బయటకు వచ్చేముందు తన పొరుగువారికి విషయం చెప్పి హెచ్చరించానన్నారు. దాదాపు బయటకు వచ్చాక వెనక్కు చూస్తే గ్రౌండ్‌ఫ్లోర్‌లో పిల్లర్లు పెద్ద శబ్దంతో ముక్కలవడం కనిపించిందన్నారు. భవన నిర్మాణంలో లోపాలను పలుమార్లు బిల్డర్‌ను కలిసి వివరించినా, తను రిపేరు పనులు చేయించడానికి సుముఖత చూపలేదని విమర్శించారు. భవనం కట్టాక తనకేమీ సంబంధంలేదన్నాడని తెలిపారు. అన్నిరకాలుగా సాయం బిల్డింగ్ కూలిన ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ టీములు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయని ప్రధాని కార్యాలయం తెలిపింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు 50 వేల రూపాయల సాయం అందించనుంది. మృత్యుంజయుడు... ఏం జరిగిందో తెలియదు. అమ్మ ఎక్కడుందో తెలియదు. చిమ్మచీకటి. చుట్టూ శిథిలాలు. ఏకంగా 19 గంటల పాటు దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుపోయిన ఓ నాలుగేళ్ల బాలుడు... చివరకు సురక్షితంగా బయటపడ్డాడు. రక్షణ చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిలో మహమ్మద్ నదీమ్ బాంగీని సజీవంగా చూడగానే ఒక్కసారిగా ఆనందం. గ్యాస్ కట్టర్లు, ఇతర యంత్ర సామగ్రిని ఉపయోగించి శిథిలాలను తొలగించారు. జాగ్రత్తగా బయటకు తెచ్చారు. ఊపిరిబిగపట్టి చూస్తున్న స్థానికుల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలు. ‘గణపతి బప్పా మోరియా’అంటూ నినదిస్తూ చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిన్నచిన్న గాయాలు తప్పితే... నదీమ్ బాగానే ఉన్నాడు. వెంటనే అంబులెన్స్‌లో అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే... మరో 20 నిమిషాల తర్వాత అతని మాతృమూర్తి శిథిలాల కింద విగతజీవిగా కనిపించింది. ఈ బాలుడి తల్లి నౌషీన్ నదీమ్ బాంగీ (30), అక్క అయేషా (7), చెల్లెలు రుకయ్యా (2) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్‌లో పనిచేస్తున్న తండ్రి నదీమ్ హుటాహుటిన బయలుదేరి మహద్‌కు చేరుకున్నారు. 26 గంటలపాటు శిథిలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల మహిళ మెహరున్నీసాను సహాయక సిబ్బంది రక్షించారు. కూలిన భవనంలో ఆమె ఐదో అంతస్తులో నివసించేవారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండగా... మంగళవారం రాత్రి 9.35 గంటలకు శిథిలాల్లో ఎవరో కదులుతున్నట్లు గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మెహరున్నీసాను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. -
ఊపిరాడటం లేదు
సాక్షి, విజయవాడ/కందుకూరు/పొన్నూరు(చేబ్రోలు): అగ్ని ప్రమాదం మృతుల్లో విజయవాడ వాసుల కంటే ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.లక్షకు పైగా బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యం కనీస భద్రత, సౌకర్యాలు కల్పించడంలో జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృత్యువూ విడదీయలేని బంధం! ► జగ్గయ్యపేటకు చెందిన పాస్టర్ ఎస్.రత్న అబ్రహం ఆయన భార్య ఎస్.రాజకుమారిలకు ఒకేసారి కరోనా సోకడంతో పది రోజులక్రితం ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అబ్రహాంకు, శనివారం రాజకుమారికి నెగెటివ్ వచ్చింది. ఆదివారం ఇద్దరినీ డిశ్చార్జ్ చేస్తామన్నారు. కలిసి ఇంటికి వెళ్లిపోవచ్చని అబ్రహం హాస్పిటల్లోనే ఉన్నాడు. చావులోనూ ఇద్దరూ కలిసే వెళ్లిపోయారు. నెగిటివ్ వచ్చినా ప్రాణాలు దక్కలేదు! ► కృష్ణా జిల్లా కొడాలికి చెందిన పొట్లూరి పూర్ణచంద్రరావు(78)కు పదిరోజులక్రితం దగ్గు రావడంతో శ్రీకాకుళంలో స్వాబ్ పరీక్ష చేయించారు. రిపోర్టు వచ్చేలోగా అనారోగ్యం ఎక్కువ కావడంతో రమేష్ హాస్పిటల్‌కు తరలించి రూ.లక్షన్నర వరకు అడ్వాన్స్ చెల్లించారు. ఈలోగా స్వాబ్ టెస్ట్‌లో నెగిటివ్ అని వచ్చింది. రెండ్రోజుల్లో చికిత్స పూర్తవుతుందని చెప్పడంతో ఆగారు. అగ్ని ప్రమాదంలో పూర్ణచంద్రరావు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు తల్లడిల్లారు. భార్య, కుమారుడిని కోల్పోయి... ► ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన దుడ్డు ప్రసాద్‌బాబుకు కరోనా సోకడంతో రమేష్ హాస్పిటల్లో చికిత్స పొంది రెండు రోజులక్రితం డిశ్చార్జి అయ్యారు. ఆయన భార్య వెంకట జయలక్ష్మి(48), పెద్ద కుమారుడు వెంకట నరసింహా పవన్‌కుమార్(30)లకు కరోనా పాజిటివ్ రావడంతో రూ.లక్షలు చెల్లించి అదే హాస్పిటల్లో చేర్పించారు. రెండు రోజుల్లో భార్య, కుమారుడు కులాసాగా ఇంటికొస్తారని భావిస్తున్న తరుణంలో చావు కబురు తెలిసి ప్రసాద్‌బాబు తల్లడిల్లుతున్నారు. పవన్‌కుమార్ పైనుంచి దూకడంతో ప్రాణాలు పోయాయంటున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పవన్ లాక్డౌన్ వల్ల ఇంటికొచ్చి వర్క్‌ఫ్రం హోం చేస్తున్నాడు. ఆయన భార్య మౌనిక ఏడు నెలల గర్భిణి. ఇంట్లో ఉన్నా ప్రాణాలు దక్కేవి.... ► తన తండ్రికి కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్ కంటే ఆస్పత్రి బాగుంటుందని, వైద్య సిబ్బంది ఉంటారనే ధైర్యంతో చేర్పించామని ఓ మృతుడి కుమారుడు అశోక్ తెలిపారు. తనకు కరోనా సోకితే హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నానని, తన తండ్రి పెద్దవాడు కావడంతో ముందుజాగ్రత్తగా హాస్పిటల్లో చేర్పించామని వాపోయారు. ప్రాణాలు కోల్పోయిన బాబూరావుకు నెగిటివ్.. ► విజయవాడకు చెందిన సుంకర బాబూరావుకు దగ్గు రావడంతో నాలుగు రోజులక్రితం ఆస్పత్రిలో చేరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాబూరావును పరీక్షించిన ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆయనకు కరోనా లేదని నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చనిపోయిన 10 మందిలో 8 మందికి నెగిటివ్ అని తేలినట్లు సమాచారం. పొగ కమ్మేసింది.. ► గుంటూరు జిల్లా నిడుబ్రోలుకి చెందిన కొసరాజు స్వర్ణలత నాలుగు రోజులక్రితం అనారోగ్యంగా ఉండటంతో రమేష్ హాస్పటల్లోని బంధువులైన వైద్యులకు చూపించుకున్నారు. పరీక్షించిన వైద్యులు ఆమెను కోవిడ్ కేర్ సెంటర్‌కు రిఫర్ చేయడంతో అక్కడ చికిత్స పొందుతోంది. శనివారం రాత్రి భర్త, కుటుంబసభ్యులతో మాట్లాడి తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన స్వర్ణలత ఆదివారం ఉదయానికి విగతజీవిగా మారింది. ‘బాబూ.. హాస్పిటల్లో దట్టంగా పొగ కమ్మేసింది.. ఊపిరాడటం లేదు.. ప్రాణాలు పోయేటట్లున్నాయి’ అంటూ ఆదివారం ఉదయం కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది. అవే ఆమెకి చివరి మాటలయ్యాయి. -
ముంబైని ముంచెత్తిన వర్షాలు
సాక్షి ముంబై: ముంబైని వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉదయం 6.30 గంటలకు కుండపోతగా వర్షం కురిసింది. దీంతో జనజీవనం అతలాకుతలమైంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబై, థానే, కల్యాణ్, డోంబివలి, మీరారోడ్డు, వసై, భయిందర్, విరార్, పాల్ఘర్, నవీముంబై తదితర ప్రాంతాలు జలాశయాలను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని అనేక మంది ఇళ్లల్లో వర్షం నీరుచొరబడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సేవలందించే వారి కోసం నడిపిస్తున్న లోకల్ రైళ్ల రాకపోకలతోపాటు రోడ్డు రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ మార్గంపై కాందీవలి, మలాడ్ మధ్యలో కొండచరియలు విరిగి హైవేపై పడ్డాయి. శాంతాక్రజ్‌లో 269 విల్లీమీటర్లు, కోలాబాలో 252 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ముంబై, థానేలలో ఒక్కరు చొప్పున ఇద్దరు మృతి చెందారు. -
మయన్మార్‌లో గని వద్ద ఘోర ప్రమాదం
యాంగూన్: మయన్మార్‌లోని ఓ గనివద్ద మట్టి కుప్పలు విరిగిపడిన ఘటనలో 162 మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని స్థానికులు అంటున్నారు. కచిన్ రాష్ట్రం హపకంట్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి (జేడ్) గని ఉంది. ఈ గని నుంచి భారీ యంత్రాలతో తవ్వి తీసిన మట్టిని ఆ పక్కనే పోస్తుంటారు. కార్మికులు అక్కడే తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ మట్టిగుట్ట కార్మికుల నివాసాలపై పడటంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 162 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలో 113 మంది మృత్యువాత పడ్డారు. అక్రమంగా జరిగే జేడ్ గనుల తవ్వకాలతో మాజీ సైనిక పాలకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. -
విషవాయువు పీల్చి 10 మంది మృతి
ఇది మాటలకందని మహా విషాదం ఊరంతా ఆదమరిచి నిద్రిస్తున్న వేళ విషవాయువు వ్యాపించింది. ఊపిరాడనీయకుండా ఉక్కిరిబిక్కిరిచేసింది. చూపు తగ్గిపోయింది.. మెదడు మొద్దుబారిపోయింది.. ఆర్తనాదాలు చేసుకుంటూ అందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలిసేలోగా అపస్మారకస్థితిలోకి చేరిపోయారు. చూస్తుండగానే కొందరి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. మూగజీవాలూ నేలకొరిగిపోయాయి. చెట్టూచేమా మాడిపోయాయి. చివరకు పక్షులూ, పాములూ అచేతనంగా మారిపోయాయి.. విశాఖ శివారులోని వెంకటాపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ నుంచి వెలువడిన స్టైరీన్ అనే విషవాయువు ఈ కల్లోలానికి కారణం. మరో నాలుగు కాలనీలూ దీని బారినపడ్డాయి. తక్షణ సాయం.. తప్పిన పెను ప్రమాదం ఉప్పందిన వెంటనే అధికారయంత్రాంగం అప్రమత్తమయ్యింది. అంబులెన్సు సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, యువత ఒక్కతాటిపై కదిలారు. బాధితులను ఆసుపత్రులకు తరలించారు. మిగిలినవారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. దాంతో పెనుప్రమాదం తప్పింది. కొద్ది వ్యవధిలోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. 10 మంది ప్రాణాలు కోల్పోగా 348 మంది చికిత్స పొందుతున్నారు. సత్వర చర్యలు అందడంతో వేలాది మంది బయటపడ్డారు సాక్షి, విశాఖపట్నం/కొత్తవలస (శృంగవరపుకోట)/మహారాణిపేట (విశాఖ దక్షిణ) : విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్జీ పాలిమర్స్‌లో గురువారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకైంది. స్థానికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. అందరికీ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. దద్దుర్లు, కళ్లల్లో మంటలు మొదలయ్యాయి. కడుపులో వికారం మొదలై.. వాంతులు చేసుకున్నారు. చిమ్మ చీకట్లో ఏం జరుగుతోందో తెలీక ప్రజలు ప్రాణభయంతో అరుపులు, కేకలతో కట్టుబట్టలతో పరుగులు తీశారు. ఓపిక ఉన్నంత వరకూ పరిగెత్తిన వారు చివరికి శ్వాస అందక ఎక్కడివారక్కడే కూలబడిపోయారు. రోడ్లు, వీధులు.. ప్రజల రోదనలతో మిన్నంటాయి. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. దీంతో ఆర్ఆర్.వెంకటాపురం, వెంకటాపురం, నందమూరు నగర్, పద్మనాభనగర్, ఎస్సీ, బీసీ కాలనీ, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 15 వేల మంది ప్రజలు చిన్నా పెద్దా తేడాలేకుండా.. భయాందోళనలతో మేఘాద్రిగెడ్డ, వేపగుంట, సింహాచలం, పెందుర్తి.. ఇలా నలుదిక్కులా పరుగులు తీశారు. మరికొందరు.. ఆదమరిచి నిద్రపోతూ.. ఆ నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ దుర్ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. 348 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇక అప్పటిదాకా ప్రాణవాయువు అందించిన పచ్చని చెట్లు శలభాల్లా మాడిపోయాయి. చదవండి: ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని ఫోన్ ఆవులు, గేదెలు, కుక్కలతోపాటు పాములు సైతం రక్తం కక్కుకుని మృతిచెందాయి. కాగా, రాత్రి వేళ పరుగులు తీస్తున్న వారిని గమనించిన పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు 100 నెంబర్‌కు ఫోన్ చేశారు. పోలీసులు, అధికారులు 10 నిమిషాల్లో వెంకటాపురం గ్రామానికి చేరుకున్నారు. కుప్పకూలిన వారిని స్థానిక యువత సహకారంతో హుటాహుటిన దూర ప్రాంతాలకు పంపించారు. బాధితులను వెంటవెంటనే 108, ఇతర అంబులెన్స్‌లలో కేజీహెచ్, పెందుర్తి, కొత్తవలస ప్రభుత్వాసుపత్రులు, అపోలో తదితర ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. బైకులు, కార్లు ఇలా వివిధ రకాల వాహనాల్లోనూ ఆస్పత్రులకు తీసుకువెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, వైద్య సిబ్బంది, జీవీఎంసీ సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నాయి. కేజీహెచ్ వద్ద రోదిస్తున్న మహిళలు 10 మంది మృత్యువాత.. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారని.. 348 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని జిల్లా అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. మృతులలో ఇద్దరు చిన్నారులున్నారు. విషవాయువు కారణంగా కొందరు అపస్మారక స్థితికి చేరుకోగా.. మరికొందరు మతిస్థిమితం కోల్పోయి.. సమీపంలో ఉన్న గెడ్డల్లోనూ, బావుల్లోనూ దూకి తీవ్రంగా గాయపడ్డారు. చీకట్లో దారి తెలియక, ఊపిరాడక చిన్ని గంగరాజు (45) నూతిలో పడిపోయి ప్రాణాలు కోల్పోగా.. వరలక్ష్మి (35) అనే మహిళ కాలువలో పడి మరణించింది. ఆంధ్రా మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థి అన్నెపు చంద్రమౌళి (19) ఆందోళనతో ఇంటి మేడపై నుంచి దూకి బలయ్యాడు. గోపాలపట్నానికి చెందిన రత్నాల గంగాధరరావు (64) మోటార్‌బైక్‌పై వస్తూ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం చెక్‌పోస్టు వద్ద బైక్‌పై నుండి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పోలీసులు స్థానిక పీహెచ్‌సీకి తరలించగా అక్కడ మరణించాడు. విషవాయువు ప్రభావంతో అస్వస్థతకు గురై రక్తం కక్కుతూ చనిపోయాడని వైద్యురాలు డాక్టర్ మణికుమారి తెలిపారు. విషవాయువు లీకేజీవల్ల మొత్తం పదిమంది మరణించారు. విశాఖ జిల్లాలో తొమ్మిది మంది మృతిచెందారని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ వెల్లడించారు. మరో రెండు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయని..అవి కేజీహెచ్ మార్చురీలో ఉన్నాయని, అయితే.. వీరు ఏ కారణాలవల్ల చనిపోయారన్నది ఇంకా నిర్థారించాల్సి ఉందన్నారు. వాటి గురించి ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదన్నారు. అలాగే, విజయనగరం జిల్లా కొత్తవలసలో మరొకరు మరణించినట్లు ఆ జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ తెలిపారు. మృతులు వీరే.. వై. అప్పలనరసమ్మ (45), కుందన శ్రేయ (6), మేకా కృష్ణమూర్తి (72), అన్నెపు చంద్రమౌళి (19), చిన్ని గంగరాజు (48), ఎన్.గ్రీష్మ (10), పి.వరలక్ష్మి (38), ఎన్. నాని (30), ఆర్. నారాయణమ్మ (35), రత్నాల గంగాధరరావు (64) చదవండి: రూ. కోటి ఆర్థిక సాయం మోగని ప్రధాన అలారం గ్యాస్ లీకేజీ అయిన వెంటనే గ్యాస్ అలారం మోగింది. అప్రమత్తమైన సిబ్బంది.. ఆ లీకేజీని ఆపే ప్రయత్నాలు ప్రారంభించారు. లీకైన ట్యాంకర్ నుంచి గ్యాస్‌ని మరో చోటికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. అత్యవసర సమయాల్లో వీపునకు తగిలించుకుని ఆక్సిజన్ పొందే స్కాబా సెట్లలో ఆక్సిజన్ లేనట్లు గుర్తించారు. ఇలా దాదాపు 8 వరకు ఆ సెట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో.. ఎన్డీఆర్ఎఫ్, హెచ్‌పీసీఎల్‌కు సమాచారం అందించి అక్కడి నుంచి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తుల్ని అలెర్ట్ చెయ్యాల్సిన అలారం మాత్రం మోగలేదు. దీనిపై కంపెనీ ప్రతినిధులు మౌనం వహిస్తున్నారు. గ్యాస్ సైరన్ మోగిన వెంటనే.. ప్రధాన అలారం మోగించి ఉంటే.. గ్రామస్తులు తప్పించుకునేందుకు కొంత సమయం దొరికేది. కానీ, సైరన్ మోగకపోవడంతో ఘోరం జరిగిపోయింది. మూడ్రోజుల క్రితమే గుర్తింపు అయితే, ఈ వాయువు లీక్ అయ్యే ప్రమాదం ఉందన్న విషయం మూడ్రోజుల క్రితమే గుర్తించినట్లు తెలిసింది. చిన్నపాటి లీకేజీలు అప్పుడప్పుడు సర్వసాధారణంగా జరుగుతుంటాయి.. వాటిని సరిచేయొచ్చనే ధీమాలో సిబ్బంది ఉండిపోవడం.. జరగబోయే ప్రమాద తీవ్రతను అంచనా వెయ్యలేక పోవడమే.. ఈ ఘోరానికి కారణమని విమర్శలు వస్తున్నాయి. ఎల్జీ పాలిమర్స్‌పై కేసు ఇదిలా ఉంటే.. విషవాయువు లీకేజీతో పాటు 10 మంది మృతికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటాపురం వీఆర్ఓ ఎంవీ సుబ్బారావు ఫిర్యాదు మేరకు ఐపీసీ 278, 284, 285, 304, 337, 338 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసలేం జరిగింది? 1997లో ఏర్పాటైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో లాక్డౌన్ కారణంగా 45 రోజుల నుంచి ఎలాంటి పనులు జరగడంలేదు. దీంతో.. స్టైరీన్ మోనోమర్ అనే విషవాయువు నిల్వ ఉన్న ట్యాంకర్లలో ఒత్తిడి పెరిగిపోయింది. మొత్తం 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ సంస్థలో లాక్డౌన్ సందర్భంగా తక్కువ మందితోనే ప్రస్తుతం నడుస్తోంది. ట్యాంకుల్లో ఉన్న సొల్యూషన్ని స్టోర్ చేసేందుకు అవసరమైన ఉష్ణోగ్రతల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు.. రిఫ్రిజరేషన్ వ్యవస్థను నియంత్రించేందుకు 60 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. నైట్‌షిఫ్ట్‌లో 15 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 24 గంటలూ పనిచేస్తుండటంతో.. 45 రోజుల స్టోరేజీని సంస్థ అంచనా వెయ్యకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ వాయువు చాలా బరువైందిగా ఉంటుంది. దీన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతలు అంటే.. 20 నుంచి 25 డిగ్రీల మధ్య ద్రవ రూపంలో నిల్వ ఉంచాలి. ఏమాత్రం ఉష్ణోగ్రత పెరిగినా.. గ్యాస్ రూపంలోకి మారి.. ట్యాంకర్ల నుంచి లీకైపోతుంటుంది. గురువారం వేకువజామున ఇదే జరిగింది. రిఫ్రిజిరేషన్ చేస్తున్నప్పటికీ.. అధిక మొత్తంలో నిల్వ ఉన్న స్టెరీన్‌ని ఎంత ఉష్ణోగ్రతలో నిల్వ చెయ్యాలన్నది అంచనా వెయ్యలేకపోయారు. ఫలితంగా.. ట్యాంకర్ కింది భాగం మాత్రమే చల్లబడింది.. పై భాగం చల్లబడలేదు. టాప్‌లేయర్‌లో ఉష్ణోగ్రత పెరగడం.. గ్యాస్ బయటికి లీకవ్వడం ప్రారంభమైంది. ఈ తరహా స్టెరీన్‌ని నిల్వచేసేందుకు 2,500 మెట్రిక్ టన్నుల ట్యాంకర్ ఉండగా.. ఏడాది క్రితమే 3,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న మరో ట్యాంకర్ తయారుచేశారు. కాగా, పాత ట్యాంకర్ నుంచే ఈ లీకేజీ ప్రారంభమైంది. ఈ ఘటన జరిగే సమయంలో ట్యాంకర్లో రెండువేల మెట్రిక్ టన్నుల స్టెరీన్ ఉన్నట్లు గుర్తించారు. కొత్త ట్యాంకులో 3 వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఒక్కసారిగా లీకేజీ కావడంతో ట్యాంకర్ల వద్ద వాయువు దట్టమైన మేఘాల్లా మారింది. లీకేజీ సమయంలో ఏ చిన్న నిప్పు రవ్వ వచ్చినా.. ఊహకందని ప్రమాదం జరిగేది. చదవండి: బాధితుల భద్రతే ముఖ్యం ఇదీ కంపెనీ చరిత్ర.. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమికల్ లిమిటెడ్ సంస్థ. ఎల్జీ కెమికల్ లిమిటెడ్ సంస్థ ప్రముఖ బ్యాటరీ తయారీదారుగా, పాలీ సై్టరీన్ ఉత్పత్తిదారుగా ప్రస్థానం ప్రారంభించింది. ► ఈ సంస్థను మొదట హిందూస్థాన్ పాలిమర్స్ పేరిట 1961లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించారు. ► 1978లో ఇది యూబీ గ్రూప్‌నకు చెందిన మెక్‌డోవెల్ అండ్ కో లిమిటెడ్‌లో విలీనమైంది. ► 1997లో ఈ సంస్థను దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్ సంస్థ టేకోవర్ చేసి ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎల్జీపీఐ) పేరుతో ఉత్పత్తులు ప్రారంభించింది. ► దక్షిణ కొరియాలో ఈ సంస్థ సై్టరీన్ ఉత్పత్తుల విషయంలో దిగ్గజంగా చెబుతారు. ► విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థలో పాలీసై్టరీన్ ఉత్పత్తులు తయారుచేస్తారు. ► భారత్‌లో పాలీసై్టరీన్ ఉత్పత్తుల రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న ఎల్జీ పాలిమర్స్ ఎగుమతుల పరంగానూ ముందంజలో ఉంది. ► ప్రస్తుతం ఎల్జీపీఐ.. దేశంలో పాలీసై్టరీన్ , ఎక్స్‌పాండబుల్ పాలీసై్టరీన్ తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ► దాదాపు 213 ఎకరాల్లో విస్తరించిన కంపెనీలో రోజుకు 417 టన్నులు పాలిసై్టరీన్ ఉత్పత్తి చేస్తుంటారు. ► సై్టరీన్ గ్యాస్ ముడిసరుకుగా పాలిసై్టరీన్ ని తయారుచేస్తుంటారు. ► లాక్డౌన్–3లో సడలింపులు ఇవ్వడంతో.. 45 రోజుల తర్వాత గురువారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని భావించారు. అయితే.. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత ట్రయల్ రన్ నిర్వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజల్నీ అప్రమత్తం చెయ్యాల్సి ఉంది. ఇవేమీ చెయ్యకుండానే.. గురువారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని భావించారు. ► ఇంతలోనే ఈ దుర్ఘటన సంభవించింది. ► గతంలో ఇదే కంపెనీలో రెండుసార్లు ప్రమాదాలు సంభవించాయని.. పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్య ధోరణివల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఫొటోలు: లీకైన రసాయన వాయువు విశాఖ ఉక్కిరి బిక్కిరి విశాఖలో లీకైన రసాయన వాయువు అపస్మారక స్ధితిలో స్థానికులు గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్ -
సిరియాలో దాడి: 40 మంది మృతి
అంకారా: సిరియాలో టర్కీ అనుకూల దళాల నియంత్రణలో ఉన్న ఆఫ్రిన్ పట్టణంలో తిరుగుబాటుదారులు చేసిన దాడిలో 40 మంది పౌరులు చనిపోయారు. రద్దీగా ఉన్న వీధిలో ఒక చమురు ట్యాంకర్‌ను పేల్చి ఈ దాడికి పాల్పడ్డారని టర్కీ విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. చనిపోయినవారిలో 11 మంది చిన్నారులున్నారని చెప్పారు. ఈ దాడిలో మరో 47 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. ఈ దాడి సిరియన్ కుర్దిష్ తిరుగుబాటు దళాల పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టర్కీ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. -
టోర్నడో విధ్వంసం
నాష్విల్లే: అమెరికాలోని నాష్‌విల్లేలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉదయం టెన్నెస్సీలో వచ్చిన టోర్నడోల కారణంగా 22 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరికొంత మంది గల్లంతయినట్లు చెప్పారు. దాదాపు 40 భవనాలు నేలమట్టమయినట్లు చెప్పారు. నష్టాన్ని అంచనా వేసేందుకు హెలికాప్టర్ల ద్వారా సర్వే చేస్తున్నారు. స్కూళ్లు, కోర్టులు, విమానాశ్రయాలు మూతబడ్డాయి. -
చిన్నారులను చిదిమేసిన స్కూల్ వ్యాన్
యాచారం: మరికాసేపట్లో బంధువులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాల్సిన ఇద్దరు చిన్నారులు అంతలోనే మృత్యుఒడికి చేరారు. శుభకార్యానికి వెళ్తూ వ్యాన్ కింద చితికిపోయారు. మరో ఇద్దరు ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం అనుబంధ గాండ్లగూడెంకు చెందిన బెల్లి రమేశ్, రజిత దంపతులకు వివేక్ (14), గౌతమ్ (9), విశాల్ సంతానం. వీరిలో వివేక్ 9, గౌతమ్ 2వ తరగతి చదువుతున్నారు. యాచారంలో జరిగే ఓ శుభాకార్యానికి గురువారం రమేశ్ తన కుమారులతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. మొండిగౌరెల్లి చౌరస్తాకు రాగానే ఓ వృద్ధుడు స్కూటీతో వీరిని ఢీకొట్టాడు. అప్పటికే వేగంగా వెళ్తున్న రమేశ్ అదుపుతప్పి పిల్లలతో పాటు కిందపడిపోయాడు. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన పాఠశాల వ్యాన్.. చిన్నారుల మీదుగా వెళ్లింది. వివేక్, గౌతమ్ వ్యాన్ చక్రాల కింద చితికి అక్కడికక్కడే మృతిచెందారు. గాయాలపాలైన తండ్రి రమేశ్.. ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాడు. మరో కుమారుడు విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వివేక్, గౌతమ్ మృతదేహాలను ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. రమేశ్, విశాల్ హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాఠశాల వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాగా, బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలానికి వచ్చారు. చిన్నారులు రక్తపుమడుగులో పడి ఉండడం చూసి బోరున విలపించారు. ఈ ప్రమాదంతో నాగార్జునసాగర్– హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుకుమార్ తెలిపారు. -
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
జైపూర్ : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భిల్వారా జిల్లాలోని బిగోడ్ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి. భిల్వారా నుంచి కోటా జిల్లాకు వెళ్తున్న పెళ్లి బృందం బస్సు మార్గ మాధ్యలో కారును ఢీ కొట్టడంతో ఈ ఘటన సంభవించింది. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బిల్వారాలోని మహాత్మాగాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ప్రమాద ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం గెహ్లాట్ ఆదేశిస్తూ ట్వీట్ చేశారు. Deeply saddened to know of a terrible road accident in Mandalgarh(Bhilwara) in which many lives have been lost. My thoughts & prayers are with bereaved families.May God give them strength to bear this loss. Have directed officials to ensure the best possible treatment to injured. — Ashok Gehlot (@ashokgehlot51) February 10, 2020 -
కరోనాతో కకావికలం..
బీజింగ్/టోక్యో/త్రిస్సూర్: చైనాలో ప్రమాదకర కరోనా వైరస్ వ్యాప్తి జనసమూహంలో రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 908కి చేరుకుంది. వైరస్ సోకినట్లు నిర్ధారణైన కేసుల సంఖ్య 40వేలు మించినట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం తెలిపారు. ఆదివారం ఒక్కరోజే చైనాలో 97 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. 3062 కొత్త కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య కమిషన్ తెలిపింది. అయితే, చైనాలో గతంతో పోల్చితే రోజువారీ కొత్త కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని ఓ నివేదిక వెల్లడించింది. చైనాలో వ్యాధి కట్టడి కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెవో) పంపిన అంతర్జాతీయ వైద్య నిపుణుల బృందం సోమవారం బీజింగ్‌కు చేరుకుంది. టోక్యో సముద్రతీరంలో లంగరేసి ఉన్న డైమండ్ ప్రిన్స్ క్రూయిజ్ నౌకలో మరో 65 మందికి కరోనా వైరస్ సోకినట్లు సోమవారం వెల్లడైంది. దీంతో ఈ వ్యాధి బారిన పడిన నౌక ప్రయాణికుల సంఖ్య 130కి పెరిగింది. ఏఏ దేశాల వారికి వ్యాధి సోకిందో స్పష్టంగా తెలపలేదు. నౌకలోని భారతీయ సిబ్బంది, ప్రయాణికులకు సంబంధించిన అదనపు సమాచారం కోసం @IndianEmbTokyo, fscons. tokyo@mea.gov.in, @CPVIndia, @MEAIndia,@PMOIndia ట్విట్టర్ హ్యాండిళ్ల ద్వారా అధికారులను సంప్రదించవచ్చునని జపాన్ లోని భారతీయ దౌత్యకార్యాలయం తెలిపింది. కరోనా వైరస్ బయటపడిన తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాస్కు ధరించి బీజింగ్ నగరాన్ని సందర్శించారు. కరోనాను జయించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్ నియంత్రణకు సాయం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఒక లేఖ రాయడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పందించారు. కష్టకాలంలో అండగా నిలిచి నందుకు, సాయం అందిస్తామని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమెకు కరోనా లేదట! భారత్‌లో మొదట కరోనా వైరస్ సోకిన వైద్య విద్యార్థిని దాని నుంచి కోలుకుంటున్నారు. తాజాగా ఆమెకు నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షల్లో ‘నెగిటివ్’ అని వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ‘త్రిస్సూర్ నుంచి మొదటి కరోనా కేసు అయిన ఆమె రక్త నమూనాను జాతీయ వైరాలజీ సంస్థ (ఎన్ఐవీ)కు పంపగా కరోనా వైరస్ లేదని వెల్లడైంది. అయినప్పటికీ ఎన్ఐవీ నుంచి రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నాం’అని సీనియర్ వైద్యాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,252 మందికి పైగా వ్యక్తుల్ని పరిశీలనలో ఉంచినట్లు వైద్య విభాగం వెల్లడించింది. -
ఐదుగురిని బలిగొన్న గ్రానైట్ లారీ
గంగాధర(చొప్పదండి): గ్రానైట్ లారీ అతివేగం ఐదుగురి ప్రాణాలను బలిగొంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కొడిమ్యాల మండలం లోని గౌరాపూర్ గ్రామానికి చెందిన మ్యాక నర్సయ్య(55) కుమారుడు మ్యాక బాబు ఇంటివద్ద బైక్ పైనుంచి పడ్డాడు. తలకు గాయాలు కావడంతో స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నర్సయ్య తన సమీప బంధువు, పూడూరు గ్రామానికి చెందిన వాహనం యజమాని గడ్డం అంజయ్య(47)ను సంప్రదించాడు. అంజ య్య కరీంనగర్ రావడానికి అంగీకరించడంతో బాబు(27), నర్సయ్య, బంధువైన మ్యాక బాణయ్య(60) కరీంనగర్ వెళ్లారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. చికిత్స అనంతరం కరీంనగర్లో పని చేసే మరో బంధువు మ్యాక శేఖర్(27)తో కలసి స్వగ్రామానికి బయల్దేరారు. ఎదురొచ్చిన మృత్యువు.. వీరు ప్రయాణిస్తున్న వాహనం గంగాధర మండలం కురిక్యాల సమీపంలోకి రాగానే జగిత్యాల నుంచి కరీంనగర్‌వైపు వెళుతున్న గ్రానైట్ లారీ వేగంగా వచ్చి టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టడంతో డ్రైవర్ అంజయ్య నర్సయ్య, శేఖర్, బాబు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బాణయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సమాచారం అందుకున్న గంగాధర ఎస్సై వివేక్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్డీవో ఆనంద్‌కుమార్ మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు. వివిధ ప్రమాదాల్లో 37 మందికి గాయాలు జనగామ శివారులో జాతీయ రహదారిపై నెల్లుట్ల బైపాస్ క్రాసింగ్ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 37 మంది స్వల్పంగా గాయపడ్డారు. ములుగు జిల్లాలో మేడారం మహాజాతరకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో స్వగ్రామాలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
సుడాన్లో కూలిన విమానం;18 మంది మృతి
ఖార్తూమ్ : ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే విమానం కుప్పకూలి 18 మంది మృతి చెందిన ఘటన సుడాన్లో చోటుచేసుకుంది. కాగా కుప్పకూలిన విమానం రష్యాకు చెందిన ఆంటోనోవ్ ఎన్-12 గా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఏడుగురు సిబ్బంది, 11 మంది పౌరుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు న్యాయమూర్తులున్నట్లు అధికారులు ధృవీకరించారు. సుడాన్ రాజధాని వెస్ట్ డార్ఫర్‌లోని ఈఐ జెనీనియా ఎయిర్పోర్ట్ నుంచి గురువారం రాత్రి ఆంటోనోవ్ ఎన్-12 మిలటరి విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాలకే ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
కెనడాలో ఘోర రైలు ప్రమాదం..13మంది మృతి
ఒట్టావా: కెనడా దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పడంతో ఐదుగురు రైల్వే సిబ్బందితో పాటు 8 మంది ప్రయాణీకులు మరణించారు. అక్కడి కాలమానం ప్రకారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో ఈ ఘోరప్రమాదం చోటుచేసుకుంది. కెనడా దేశంలోని మనీటోబా ప్రావిన్సులోని పోర్టిగాలా ప్రైరీ ప్రాంతంలో ఈ రైలు ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనలో ఇప్పటి దాకా 13మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. రైలు ప్రమాదం ఘటనపై కెనడా రవాణ భద్రతా బోర్డు దర్యాప్తునకు ఆదేశించింది. -
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని రాణి ఝాన్సీరోడ్డులో అనాజ్ మండీ ప్రాంతం. ఆ పరిసరాలన్నీ జనావాసాలతో ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అక్కడే నాలుగు అంతస్తుల భవనంలో చిన్నా చితక తయారీ పరిశ్రమలున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలు దాటింది. ఇంకా చిమ్మచీకట్లు వీడిపోలేదు. ఇంతలో రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని జ్వాలలు అన్ని అంతస్తుల్లోకి పాకాయి. రేయింబవళ్లు పని చేసి అలసిపోయిన వలస కార్మికులు అక్కడే గాఢ నిద్రలో ఉన్నారు. వారు నిద్రిస్తున్న గది చాలా చిన్నది. వెంటిలేషన్ కూడా సరిగా లేదు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగకమ్మేసింది. ఫలితంగా 43 మంది కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ భవనంలో లగేజీ బ్యాగులు, ప్లాస్టిక్ బ్యాగుల వర్క్‌షాప్‌లున్నాయి. భవన యజమాని రెహాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఇరుకు వీధులే సహాయ కార్యక్రమాలకి అడ్డంకి అగ్ని ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే 30 అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తేవడానికి, కార్మికుల్ని రక్షించడానికి 150 మంది అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఆ ఫ్యాక్టరీ చట్టవిరుద్ధంగా జనావాసాల మధ్య ఉండటంతో ఇరుకు సందుల్లోంచి ఘటనా స్థలానికి చేరుకోవడానికే అగ్నిమాపక సిబ్బంది తంటాలు పడ్డారు. కిటికీ గ్రిల్స్ కట్ చేసి భవనం లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనలో 63 మందిని కాపాడారు. మంటల్లో చిక్కుకున్న వారు తప్పించుకోవడానికి భవనానికి వెంటిలేషన్ సౌకర్యాలే సరిగా లేవు. దీంతో తప్పించుకునే మార్గాలు లేక కార్మికులు అల్లాడిపోయారు. షార్ట్ సర్క్యూటే కారణం షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అంతే కాదు ఈ భవనంలో తగిన భద్రతా ఏర్పాట్లు లేవు. అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకోలేదు. భవనంలో అంతర్గత విద్యుత్ వ్యవస్థలో లోపాల కారణంగా ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ వెల్లడించింది. కార్బన్‌మోనాక్సైడ్ వల్లే.. కర్మాగారంలో మంటల్ని అదుపులోకి తీసుకువచ్చాక నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ఘటనాస్థలాన్ని పరిశీలించింది. అగ్నిప్రమాదం కారణంగా గాల్లో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా కలవడంతో ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ ఆదిత్య ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ప్లాస్టిక్, తోలు బ్యాగులు వంటివన్నీ మంటల్లో కాలడం వల్లనే కార్బన్ మోనాక్సైడ్ అధికంగా వెలువడిందని ఆయన వివరించారు. తలుపు దగ్గర ఉన్నవారే సేఫ్ నాలుగు అంతస్తుల ఆ భవనంలో గదులకి తలుపులు, ఒకటి రెండు చోట్ల కిటికీలు తప్ప తప్పించుకోవడానికి మరో మార్గం లేదు. దీంతో తలుపులకి సమీపంలో నిద్రిస్తున్న వారు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాదం నుంచి బయటపడిన ఫిరోజ్‌ఖాన్ కథనం ప్రకారం ‘ఒక గదిలో తలుపు దగ్గరే పడుకున్నా. మంటల సెగకు మెలకువ వచ్చింది. ప్రమాదాన్ని ఊహించాను. వెంటనే పక్కనే పడుకున్న నలుగైదుగురిని లేపి పరుగు పరుగున బయటకి వచ్చాం. ఇంకా చాలా మంది లోపలే ఉండిపోయారు‘‘అని చెప్పారు. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఢిల్లీ ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని పేర్కొంది. ఘటనా స్థలిని పరిశీలించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష సాయం ప్రకటించారు. ప్రభుత్వ ఖర్చుతో ఖరీదైన చికిత్స అందిస్తామని చెప్పారు. అత్యంత భయానకమైంది: ప్రధాని మోదీ ఢిల్లీ అగ్నిప్రమాదం అత్యంత భయానకమైందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందిస్తామని ప్రధాని కార్యాలయం మరో ట్వీట్లో వెల్లడించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర ప్రాణనష్టం జరగడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విచారం వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తన సందేశంలో తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉపహార్ నుంచి అనాజ్ మండీ వరకు.. 1997, జూలై: ఢిల్లీలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన గ్రీన్ పార్క్ ఏరియాలోని ఉపహార్ థియేటర్లో సన్ని డియోల్ నటించిన బోర్డర్ సినిమా మధ్యాహ్నం ఆట ప్రదర్శిస్తుండగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 59 మంది మంటల్లో బుగ్గయిపోతే, 100 మందికిపైగా గాయపడ్డారు. 2018 జనవరి: వాయవ్య ఢిల్లీలో బాణాసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు. 2019, ఫిబ్రవరి: సెంట్రల్ ఢిల్లీ కరోల్‌బాగ్ ప్రాంతంలో అర్పిత్ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది అగ్నికి ఆహుతయ్యారు. 2019, డిసెంబర్: ఉత్తర ఢిల్లీలో అనాజ్ మండీ ప్రాంతంలో కర్మాగారం అగ్ని ప్రమాదంలో 43 మంది మృతి -
ఇళ్ల మధ్యలో కూలిన విమానం; 23 మంది మృతి
గోమా : ఎయిర్పోర్ట్ నుంచి అప్పుడే టేకాఫ్ తీసుకున్న విమానం ఇళ్ల మధ్య కూలడంతో 23 మంది చనిపోయారు. ఈ విషాదకర ఘటన మధ్య ఆఫ్రికా దేశంలోని డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆప్ కాంగోకి చెందిన గోమా సిటీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు .. గోమా ఎయిర్పోర్ట్ నుంచి జిబీ బి విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్-228 విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు బెనీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే గోమాలోని నివాస ప్రాంతాల వద్దకు రాగానే విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. కాగా, విమానంలో ఉన్నవారెవరూ ప్రాణాలతో బయటపడలేదని పోలీసులు పేర్కొన్నారు. విమానం హఠాత్తుగా కుప్పకూలడానికి సాంకేతిక లోపమే కారణం కావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 6 మృతదేహాలను బయటికి తీసినట్లు వెల్లడించారు. Smoke rises from the wreckage of a small plane which crashed on takeoff into a densely populated area of Goma in the Democratic Republic of Congo pic.twitter.com/31BXU7qrG0 — AFP news agency (@AFP) November 24, 2019 -
పుణేలో కుంభవృష్టి
పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో భారీ వర్షాల కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న 16 వేల మందిని అధికారులు రక్షించారు. ముంబై–బెంగళూరు జాతీయ రహదారిపై ఖేద్–శివపూర్ గ్రామంలోని ఓ దర్గాలో నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చిన వరదలకు కొట్టుకుపోయారు. అలాగే, అరణ్యేశ్వర్ ప్రాంతంలో గోడకూలిన ఘటనలో ఐదుగురు చనిపోయారు. మిగతా ప్రాంతాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో మరో ఏడుగురు చనిపోయారు. పుణేతోపాటు బారామణి తహ్‌శీల్‌లో ప్రజలను రక్షించేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)ను పంపించారు. గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.