విషవాయువు పీల్చి 10 మంది మృతి | Ten Members Lost Life In Visakhapatnam Due To Leakage Of Gas | Sakshi
Sakshi News home page

విశాఖ విషాదం

Published Fri, May 8 2020 2:46 AM | Last Updated on Fri, May 8 2020 7:52 AM

Ten Members Lost Life In Visakhapatnam Due To Leakage Of Gas - Sakshi

ఇది మాటలకందని మహా విషాదం ఊరంతా ఆదమరిచి నిద్రిస్తున్న వేళ విషవాయువు వ్యాపించింది. ఊపిరాడనీయకుండా ఉక్కిరిబిక్కిరిచేసింది. చూపు తగ్గిపోయింది.. మెదడు మొద్దుబారిపోయింది.. ఆర్తనాదాలు చేసుకుంటూ అందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలిసేలోగా అపస్మారకస్థితిలోకి చేరిపోయారు. చూస్తుండగానే కొందరి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. మూగజీవాలూ నేలకొరిగిపోయాయి. చెట్టూచేమా మాడిపోయాయి. చివరకు పక్షులూ, పాములూ అచేతనంగా మారిపోయాయి.. విశాఖ శివారులోని వెంకటాపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది.  ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి వెలువడిన స్టైరీన్‌ అనే విషవాయువు ఈ కల్లోలానికి కారణం. మరో నాలుగు కాలనీలూ దీని బారినపడ్డాయి.

తక్షణ సాయం.. తప్పిన పెను ప్రమాదం ఉప్పందిన వెంటనే అధికారయంత్రాంగం అప్రమత్తమయ్యింది. అంబులెన్సు సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, యువత ఒక్కతాటిపై కదిలారు.  బాధితులను ఆసుపత్రులకు తరలించారు. మిగిలినవారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. దాంతో పెనుప్రమాదం తప్పింది. కొద్ది వ్యవధిలోనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. 10 మంది ప్రాణాలు కోల్పోగా 348 మంది చికిత్స పొందుతున్నారు. సత్వర చర్యలు అందడంతో వేలాది మంది బయటపడ్డారు

సాక్షి, విశాఖపట్నం/కొత్తవలస (శృంగవరపుకోట)/మహారాణిపేట (విశాఖ దక్షిణ) : విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్‌జీ పాలిమర్స్‌లో గురువారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకైంది. స్థానికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. అందరికీ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. దద్దుర్లు, కళ్లల్లో మంటలు మొదలయ్యాయి. కడుపులో వికారం మొదలై.. వాంతులు చేసుకున్నారు. చిమ్మ చీకట్లో ఏం జరుగుతోందో తెలీక ప్రజలు ప్రాణభయంతో అరుపులు, కేకలతో కట్టుబట్టలతో పరుగులు తీశారు. ఓపిక ఉన్నంత వరకూ పరిగెత్తిన వారు చివరికి శ్వాస అందక ఎక్కడివారక్కడే కూలబడిపోయారు. రోడ్లు, వీధులు.. ప్రజల రోదనలతో మిన్నంటాయి. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. పరిశ్రమ నుంచి లీకైన రసాయన వాయువు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది.

దీంతో ఆర్‌ఆర్‌.వెంకటాపురం, వెంకటాపురం, నందమూరు నగర్, పద్మనాభనగర్, ఎస్‌సీ, బీసీ కాలనీ, కంపరపాలెం, కొత్తపాలెం, వెంకటాద్రి నగర్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 15 వేల మంది ప్రజలు చిన్నా పెద్దా తేడాలేకుండా.. భయాందోళనలతో మేఘాద్రిగెడ్డ, వేపగుంట, సింహాచలం, పెందుర్తి.. ఇలా నలుదిక్కులా పరుగులు తీశారు. మరికొందరు.. ఆదమరిచి నిద్రపోతూ.. ఆ నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఈ దుర్ఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. 348 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఇక అప్పటిదాకా ప్రాణవాయువు అందించిన పచ్చని చెట్లు శలభాల్లా మాడిపోయాయి. చదవండి: ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని ఫోన్

ఆవులు, గేదెలు, కుక్కలతోపాటు పాములు సైతం రక్తం కక్కుకుని మృతిచెందాయి. కాగా, రాత్రి వేళ పరుగులు తీస్తున్న వారిని గమనించిన పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు 100 నెంబర్‌కు ఫోన్‌ చేశారు. పోలీసులు, అధికారులు 10 నిమిషాల్లో వెంకటాపురం గ్రామానికి చేరుకున్నారు. కుప్పకూలిన వారిని స్థానిక యువత సహకారంతో హుటాహుటిన దూర ప్రాంతాలకు పంపించారు. బాధితులను వెంటవెంటనే 108, ఇతర అంబులెన్స్‌లలో కేజీహెచ్, పెందుర్తి, కొత్తవలస ప్రభుత్వాసుపత్రులు, అపోలో తదితర ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలించారు. బైకులు, కార్లు ఇలా వివిధ రకాల వాహనాల్లోనూ ఆస్పత్రులకు తీసుకువెళ్లారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్, వైద్య సిబ్బంది, జీవీఎంసీ సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొన్నాయి.


కేజీహెచ్‌ వద్ద రోదిస్తున్న మహిళలు

10 మంది మృత్యువాత..
ఈ ప్రమాదంలో 10 మంది మరణించారని.. 348 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని జిల్లా అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. మృతులలో ఇద్దరు చిన్నారులున్నారు. విషవాయువు కారణంగా కొందరు అపస్మారక స్థితికి చేరుకోగా.. మరికొందరు మతిస్థిమితం కోల్పోయి.. సమీపంలో ఉన్న గెడ్డల్లోనూ, బావుల్లోనూ దూకి తీవ్రంగా గాయపడ్డారు. చీకట్లో దారి తెలియక, ఊపిరాడక చిన్ని గంగరాజు (45) నూతిలో పడిపోయి ప్రాణాలు కోల్పోగా.. వరలక్ష్మి (35) అనే మహిళ కాలువలో పడి మరణించింది. 

ఆంధ్రా మెడికల్‌ కాలేజీ వైద్య విద్యార్థి అన్నెపు చంద్రమౌళి (19) ఆందోళనతో ఇంటి మేడపై నుంచి దూకి బలయ్యాడు. గోపాలపట్నానికి చెందిన రత్నాల గంగాధరరావు (64) మోటార్‌బైక్‌పై వస్తూ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెం చెక్‌పోస్టు వద్ద బైక్‌పై నుండి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పోలీసులు స్థానిక పీహెచ్‌సీకి తరలించగా అక్కడ మరణించాడు. విషవాయువు ప్రభావంతో అస్వస్థతకు గురై రక్తం కక్కుతూ చనిపోయాడని వైద్యురాలు డాక్టర్‌ మణికుమారి తెలిపారు.

విషవాయువు లీకేజీవల్ల మొత్తం పదిమంది మరణించారు. విశాఖ జిల్లాలో తొమ్మిది మంది మృతిచెందారని విశాఖ జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ వెల్లడించారు. మరో రెండు మృతదేహాలు కూడా లభ్యమయ్యాయని..అవి కేజీహెచ్‌ మార్చురీలో ఉన్నాయని,  అయితే.. వీరు ఏ కారణాలవల్ల చనిపోయారన్నది ఇంకా నిర్థారించాల్సి ఉందన్నారు. వాటి గురించి ఇంతవరకూ ఎవరూ సంప్రదించలేదన్నారు. అలాగే, విజయనగరం జిల్లా కొత్తవలసలో మరొకరు మరణించినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు.

మృతులు వీరే..
వై. అప్పలనరసమ్మ (45), కుందన శ్రేయ (6), మేకా కృష్ణమూర్తి (72), అన్నెపు చంద్రమౌళి (19), చిన్ని గంగరాజు (48), ఎన్‌.గ్రీష్మ (10), పి.వరలక్ష్మి (38), ఎన్‌. నాని (30), ఆర్‌. నారాయణమ్మ (35), రత్నాల గంగాధరరావు (64)  చదవండి: రూ. కోటి ఆర్థిక సాయం

మోగని ప్రధాన అలారం
గ్యాస్‌ లీకేజీ అయిన వెంటనే గ్యాస్‌ అలారం మోగింది. అప్రమత్తమైన సిబ్బంది.. ఆ లీకేజీని ఆపే ప్రయత్నాలు ప్రారంభించారు. లీకైన ట్యాంకర్‌ నుంచి గ్యాస్‌ని మరో చోటికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే.. అత్యవసర సమయాల్లో వీపునకు తగిలించుకుని ఆక్సిజన్‌ పొందే స్కాబా సెట్లలో ఆక్సిజన్‌ లేనట్లు గుర్తించారు. ఇలా దాదాపు 8 వరకు ఆ సెట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో.. ఎన్‌డీఆర్‌ఎఫ్, హెచ్‌పీసీఎల్‌కు సమాచారం అందించి అక్కడి నుంచి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే.. ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల గ్రామస్తుల్ని అలెర్ట్‌ చెయ్యాల్సిన అలారం మాత్రం మోగలేదు. దీనిపై కంపెనీ ప్రతినిధులు మౌనం వహిస్తున్నారు. గ్యాస్‌ సైరన్‌ మోగిన వెంటనే.. ప్రధాన అలారం మోగించి ఉంటే.. గ్రామస్తులు తప్పించుకునేందుకు కొంత సమయం దొరికేది. కానీ, సైరన్‌ మోగకపోవడంతో ఘోరం జరిగిపోయింది.

మూడ్రోజుల క్రితమే గుర్తింపు
అయితే, ఈ వాయువు లీక్‌ అయ్యే ప్రమాదం ఉందన్న విషయం మూడ్రోజుల క్రితమే గుర్తించినట్లు తెలిసింది. చిన్నపాటి లీకేజీలు అప్పుడప్పుడు సర్వసాధారణంగా జరుగుతుంటాయి.. వాటిని సరిచేయొచ్చనే ధీమాలో సిబ్బంది ఉండిపోవడం.. జరగబోయే ప్రమాద తీవ్రతను అంచనా వెయ్యలేక పోవడమే.. ఈ ఘోరానికి కారణమని విమర్శలు వస్తున్నాయి.

ఎల్‌జీ పాలిమర్స్‌పై కేసు
ఇదిలా ఉంటే.. విషవాయువు లీకేజీతో పాటు 10 మంది మృతికి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీపై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటాపురం వీఆర్‌ఓ ఎంవీ సుబ్బారావు ఫిర్యాదు మేరకు ఐపీసీ 278, 284, 285, 304, 337, 338 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగింది?
1997లో ఏర్పాటైన ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో లాక్‌డౌన్‌ కారణంగా 45 రోజుల నుంచి ఎలాంటి పనులు జరగడంలేదు. దీంతో.. స్టైరీన్‌ మోనోమర్‌ అనే విషవాయువు నిల్వ ఉన్న ట్యాంకర్లలో ఒత్తిడి పెరిగిపోయింది. మొత్తం 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్న ఈ సంస్థలో లాక్‌డౌన్‌ సందర్భంగా తక్కువ మందితోనే ప్రస్తుతం నడుస్తోంది. ట్యాంకుల్లో ఉన్న సొల్యూషన్‌ని స్టోర్‌ చేసేందుకు అవసరమైన ఉష్ణోగ్రతల్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు.. రిఫ్రిజరేషన్‌ వ్యవస్థను నియంత్రించేందుకు 60 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. నైట్‌షిఫ్ట్‌లో 15 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. 24 గంటలూ పనిచేస్తుండటంతో.. 45 రోజుల స్టోరేజీని సంస్థ అంచనా వెయ్యకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ వాయువు చాలా బరువైందిగా ఉంటుంది. దీన్ని నిర్దిష్ట ఉష్ణోగ్రతలు అంటే.. 20 నుంచి 25 డిగ్రీల మధ్య ద్రవ రూపంలో నిల్వ ఉంచాలి. ఏమాత్రం ఉష్ణోగ్రత పెరిగినా.. గ్యాస్‌ రూపంలోకి మారి.. ట్యాంకర్ల నుంచి లీకైపోతుంటుంది.

గురువారం వేకువజామున ఇదే జరిగింది. రిఫ్రిజిరేషన్‌ చేస్తున్నప్పటికీ.. అధిక మొత్తంలో నిల్వ ఉన్న స్టెరీన్‌ని ఎంత ఉష్ణోగ్రతలో నిల్వ చెయ్యాలన్నది అంచనా వెయ్యలేకపోయారు. ఫలితంగా.. ట్యాంకర్‌ కింది భాగం మాత్రమే చల్లబడింది.. పై భాగం చల్లబడలేదు. టాప్‌లేయర్‌లో ఉష్ణోగ్రత పెరగడం.. గ్యాస్‌ బయటికి లీకవ్వడం ప్రారంభమైంది. ఈ తరహా స్టెరీన్‌ని నిల్వచేసేందుకు 2,500 మెట్రిక్‌ టన్నుల ట్యాంకర్‌ ఉండగా.. ఏడాది క్రితమే 3,000 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న మరో ట్యాంకర్‌ తయారుచేశారు. కాగా, పాత ట్యాంకర్‌ నుంచే ఈ లీకేజీ ప్రారంభమైంది. ఈ ఘటన జరిగే సమయంలో ట్యాంకర్‌లో రెండువేల మెట్రిక్‌ టన్నుల స్టెరీన్‌ ఉన్నట్లు గుర్తించారు. కొత్త ట్యాంకులో 3 వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉంది. ఒక్కసారిగా లీకేజీ కావడంతో ట్యాంకర్ల వద్ద వాయువు దట్టమైన మేఘాల్లా మారింది. లీకేజీ సమయంలో ఏ చిన్న నిప్పు రవ్వ వచ్చినా.. ఊహకందని ప్రమాదం జరిగేది.  చదవండి: బాధితుల భద్రతే ముఖ్యం

ఇదీ కంపెనీ చరిత్ర..
ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ కెమికల్‌ లిమిటెడ్‌ సంస్థ. ఎల్‌జీ కెమికల్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రముఖ బ్యాటరీ తయారీదారుగా, పాలీ సై్టరీన్‌ ఉత్పత్తిదారుగా ప్రస్థానం ప్రారంభించింది. 
► ఈ సంస్థను మొదట హిందూస్థాన్‌ పాలిమర్స్‌ పేరిట 1961లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించారు. 
► 1978లో ఇది యూబీ గ్రూప్‌నకు చెందిన మెక్‌డోవెల్‌ అండ్‌ కో లిమిటెడ్‌లో విలీనమైంది. 
► 1997లో ఈ సంస్థను దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ కెమ్‌ సంస్థ టేకోవర్‌ చేసి ఎల్‌జీ పాలిమర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎల్‌జీపీఐ) పేరుతో ఉత్పత్తులు ప్రారంభించింది. 
► దక్షిణ కొరియాలో ఈ సంస్థ సై్టరీన్‌  ఉత్పత్తుల విషయంలో దిగ్గజంగా చెబుతారు. 
► విశాఖ ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థలో పాలీసై్టరీన్‌ ఉత్పత్తులు తయారుచేస్తారు. 
► భారత్‌లో పాలీసై్టరీన్‌  ఉత్పత్తుల రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న ఎల్‌జీ పాలిమర్స్‌ ఎగుమతుల పరంగానూ ముందంజలో ఉంది. 
► ప్రస్తుతం ఎల్‌జీపీఐ.. దేశంలో పాలీసై్టరీన్‌ , ఎక్స్‌పాండబుల్‌ పాలీసై్టరీన్‌  తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. 
► దాదాపు 213 ఎకరాల్లో విస్తరించిన కంపెనీలో రోజుకు 417 టన్నులు పాలిసై్టరీన్‌ ఉత్పత్తి చేస్తుంటారు. 
► సై్టరీన్‌ గ్యాస్‌ ముడిసరుకుగా పాలిసై్టరీన్‌ ని తయారుచేస్తుంటారు. 
► లాక్‌డౌన్‌–3లో సడలింపులు ఇవ్వడంతో.. 45 రోజుల తర్వాత గురువారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని భావించారు. అయితే.. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత ట్రయల్‌ రన్‌ నిర్వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో చుట్టు పక్కల గ్రామాల ప్రజల్నీ అప్రమత్తం చెయ్యాల్సి ఉంది. ఇవేమీ చెయ్యకుండానే.. గురువారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని భావించారు. 
► ఇంతలోనే ఈ దుర్ఘటన సంభవించింది. 
► గతంలో ఇదే కంపెనీలో రెండుసార్లు ప్రమాదాలు సంభవించాయని.. పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్య ధోరణివల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.

ఫొటోలు: 
లీకైన రసాయన వాయువు విశాఖ ఉక్కిరి బిక్కిరి

విశాఖలో లీకైన రసాయన వాయువు అపస్మారక స్ధితిలో స్థానికులు

గ్యాస్‌ లీక్‌ బాధితులను పరామర్శించిన సీఎం జగన్‌​​​​​​​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement