ఆటోలోకి మృతదేహాలను ఎక్కిస్తున్న స్థానికులు, ప్రమాదానికి కారణమైన కారు
ఎంతో అన్యోన్యంగా ఉండే వారి ప్రేమ బంధాన్ని మృత్యువూ విడదీయలేకపోయింది. కుమార్తెను సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల వద్ద దించి వస్తూ.. ఆమె భవిష్యత్ కోసం యోచిస్తున్న సమయంలో విధికి కన్నుకుట్టింది. కారు మృత్యు శకటంగా మారి వారిని విగతజీవులను చేసింది. ప్రమాద స్థలంలో పక్కపక్కన పడి ఉన్న భార్యాభర్తల మృతదేహాలను చూసి స్థానికులు చలించిపోయారు.
సాక్షి, కశింకోట(విశాఖపట్టణం) : మండలంలోని పరవాడపాలెం వద్ద జాతీయరహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం పాలయ్యారు. యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న బైక్‌ను పక్క మార్గంలో అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ మీద నుంచి దాటుకొని దూసుకు వచ్చి ఢీకొంది. దీంతో తుని వద్ద మల్లవరానికి చెందిన కవులూరి రమణ(35), లక్ష్మి(30) దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.బట్లపూడికి చెందిన కొండలరావు కుమార్తె అయిన లక్ష్మితో రమణకు పదేళ్ల కిందట వివాహం అయింది.వీరు అన్యోన్యంగా కలిసి ఉండేవారు. వీరికి కుమార్తె యమున, కుమారుడు జశ్వంత్ ఉన్నారు. వీరు నాయనమ్మ సత్యవతి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. రమణ వివాహానికి ముందే దువ్వాడ వద్ద రాజీవ్‌నగర్‌కు వలస వెళ్లిపోయి నివాసం ఏర్పర్చుకుని జీవనం సాగిస్తున్నాడు.
కుమార్తె యమునకు తుని వద్ద జగన్నాథగిరిలో ఉన్న ఎపీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి సీటు వచ్చింది. పాఠశాలలో చేర్చి తన ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ బుధవారం పాఠశాలకు దిగబెట్టి భార్యా భర్తలు తిరుగు పయనమై తాము ఉంటున్న రాజీవ్ నగర్‌కు వెళుతుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే విగత జీవులుగా మారారు. మృతి లోను తమ బంధాన్ని వీడకుండా ఒకేసారి తనువు చాలించారు. ఇది చూపరులను తీవ్రంగా కలచి వేసింది. ఇక రమణ తల్లి సత్యవతి మల్లవరంలో ఒక ప్రైవేటు కాన్వెంట్‌లో ఆయాగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. చరమాంకంలో తమకు చేదోడుగా నిలుస్తాడనుకున్న ఏకైక కుమారుడు రమణ, కోడలు లక్ష్మి మృత్యువాత పడడం ఆమెను కలచి వేస్తోంది. తనకే కాకుండా తన మనవడు,మనవరాలికి ఇక దిక్కెవరంటూ కన్నీరు మున్నీరుగా రోధిస్తోంది.
మితిమీరిన వేగం వల్లే
మితిమీరిన వేగంతో కారును నడపడమే ప్రమాదానికి కారణమని తెలిసింది. కారు ఎత్తుగా ఉన్న డివైడర్ మీద నుంచి అవతలి రోడ్డుకు దూసుకు పోయి సుమారు వంద మీటర్ల దూరంలో ఉన్న బైక్‌ను ఢీకొంది. అక్కడి నుంచి రోడ్డు పక్క రాళ్లను ఢీకొని పైకి ఎగిరి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ధ్వంసమై గొయ్యిలో పడింది. కారు ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయిందని ప్రమాద స్థలంలో ఉన్న ఖమ్మం జిల్లా పాలేరుకు చెందిన లారీ డ్రైవర్ దావత్ సుధాకర్ విలేకరులకు తెలిపారు. కారు నడుపుతున్న సింహాచలం ప్రాంతానికి చెందిన స్వరూప్ కారులో చిక్కుకు పోవడంతో అతి కష్టం మీద బయటకు తీసి 108 వాహనంలో తరలించినట్టుచెప్పారు. స్పృహ కోల్పోయి ప్రమాదకర పరిస్థితిలో స్వరూప్ ఉన్నట్టు 108 వాహన సిబ్బంది తెలిపారు. అతనికి అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స జరిపించి విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. అతను వైద్యుడని చెప్పారు. ప్రమాద తీవ్రతను బట్టి కారు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో అర్థమవుతుంది. ప్రమాదంలో బైక్ కూడా విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ధ్వంసమైంది. ఈ సమయంలో కారు మరో బైక్ కూడా ఢీకొనవలసి ఉండగా త్రుటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ప్రమాద స్థలంలో బైక్, కారు శకలాలు, మృతుల వస్త్రాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
హెచ్చరిక బోర్డు వద్దే..
జాతీయ రహదారిపై పోలీసులు ఏర్పాటు చేసిన ప్రమాద హెచ్చరిక బోర్డు ఉన్న చోటే ఈ ప్రమాదం జరిగింది. కారు హెచ్చరిక బోర్డును ఢీకొని డివైడర్ మీద నుంచి దూసుకెళ్లింది. మొదట మృతుల వివరాలు తెలియరాలేదు. సెల్ ఫోన్ సిమ్ సాయంతో ప్రయత్నించడంతో వారి ఆచూకీ తెలిసింది. పోలీసులు ప్రమాదం గురించి తెలపడంతో బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి వారితో నిండిపోయింది. ఒకేసారి భార్యాభర్తలు మృతి చెందడంలో ఇక వారి పిల్లలకు దిక్కెవరంటూ రోదిస్తూ విషాదంలో మునిగిపోయారు. భార్యా భర్తల మృత దేహాలను ఆటోలో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనకాపల్లి సీఐ నరసింహారావు,స్థానిక అదనపు ఎస్‌ఐ దయానిధి సంఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment