
సంఘటన స్థలంలో క్షతగాత్రులు
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : త్వరలోనే వివాహం చేసుకోవాలని ముచ్చటపడిన ఆ యువజంటను విధి వెక్కిరించింది. దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, యువతి, ఆమె తల్లి తీవ్రంగా గాయపడ్డారు. జె.ఆర్.పురం పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా కొబ్బరితోట సమీపంలోని ఎస్.వి.పి.నగర్ మనోరమ థియేటర్ సమీపంలో బవిరిశెట్టి తరుణ్‌కుమార్(20) నివాసముంటున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న యువతితో త్వరలో వివాహం చేసేందుకు పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో యువతి, ఆమె తల్లి లక్ష్మితో కలిసి ఆదివారం అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి దర్శనానికి వచ్చారు. ముగ్గురూ స్కూటీపైనే వచ్చి స్వామివారి దర్శనమైన తర్వాత తిరిగి విశాఖ బయలుదేరారు. సాయంత్రం 5 గంటల సమయంలో రణస్థలం మండలంలోని బంటుపల్లి రాధాగోవింద ఆలయ సమీపంలో లారీని ఢీకొన్నారు. ఈ ఘటనలో తరుణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీ వెనక కూర్చున్న యువతి, లక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. క్షతగాత్రులను అంబులెన్సులో రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని జె.ఆర్.పురం ఎస్‌ఐ బి.అశోక్‌బాబు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment