అతివేగానికి ఐదుగురు బలి | Lorry Hits Car Massive Road Accident In Sangareddy District | Sakshi
Sakshi News home page

అతివేగానికి ఐదుగురు బలి

Published Sat, Aug 7 2021 12:59 AM | Last Updated on Sat, Aug 7 2021 1:04 AM

Lorry Hits Car Massive Road Accident In Sangareddy District - Sakshi

చౌటకూరు వద్ద లారీని ఢీకొట్టిన కారు

జోగిపేట (అందోల్‌)/ కొల్చారం(నర్సాపూర్‌): అతివేగం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. సంగారెడ్డి నుంచి వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మెదక్‌ జిల్లా రంగంపేటకు చెందిన పాస్టర్‌ లూకా (46), ఆయన భార్య దీవెన (44), అదే జిల్లా సంగాయిపేటకు చెందిన అంబదాస్‌ (45), ఆయన భార్య పద్మ (30), వారి కుమారుడు వివేక్‌ (5) అక్కడిక్కడే మృతి చెందారు. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న వివేక్‌కు నాలుగు రోజుల కింద సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్‌ జరిగింది. శుక్రవారం డిశ్చార్జి కావడంతో పాస్టర్‌ లూకాకు చెందిన కారులో వారంతా తిరుగుపయనమయ్యారు. ఇంతలోనే వారిని మృత్యువు కబళించింది. కారు అతివేగంగా నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ బాలాజీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

చర్చిలో ఇరు కుటుంబాలకు స్నేహం 
అంబదాస్‌ కుటుంబం ప్రతి ఆదివారం రంగంపేటలోని చర్చిలో ప్రార్థనలకు వస్తుండేది. ఈ క్రమంలో ఆ చర్చిలోని పాస్టర్‌ లూకా, అంబదాస్‌ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. సంగారెడ్డి ఆసుపత్రి నుంచి తమ కుమారుడి డిశ్చార్జికి వెళ్లాలని చెప్పగా పాస్టర్‌ లూకా తన కారు తీసుకొచ్చాడు. 

రెండు కుటుంబాల్లో విషాదం 
అంబదాస్‌–పద్మ దంపతులకు వినయ్, వివేక్‌ ఇద్దరు కుమారులు. ప్రమాదంలో అంబదాస్, పద్మ, వివేక్‌ చనిపోవడంతో వినయ్‌ అనాథగా మిగిలాడు. పాస్టర్‌ లూకా–దీవెన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. తల్లిదండ్రుల మృతితో ఆ నలుగురికీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. 

సీటు బెల్ట్‌ ధరించి ఉంటే.. 
ముందు సీటులో కూర్చున్న పాస్టర్‌ దంపతులు సీటు బెల్టు ధరించలేదు. సీటు బెల్టు ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోకపోయేవారని అంటున్నారు. సీటు బెల్ట్‌ ధరించకపోవడం వల్లే ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోలేదని, ఒకవేళ అవి తెరుచుకుని ఉం టే ప్రమాద తీవ్రత ఇంతగా ఉండేది కాద ని స్థానికులు చెబుతున్నారు. కాగా, లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

మృత్యు రహదారి 
సంగారెడ్డి–నాందేడ్‌–అకోలా హైవేకు మృత్యు రహదారి అనే పేరుంది. చౌటకూరు నుంచి శివ్వంపేట వరకు ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు యాభైకి పైగా ప్రమాదాలు జరిగాయి. రహదారి విస్తరణ పనులు మొదలుకాక ముందు డబుల్‌ రోడ్డుగా ఉండేది. అప్పుడు తరచుగా ప్రమాదాలు జరిగేవి. 

ఇదీ లూకా నేపథ్యం  
పాస్టర్‌ లూకాది సంగారెడ్డి జిల్లా శివంపేట మండలం గూడూరు. 20 ఏళ్ల కింద రంగంపేటకు వచ్చి స్థిరపడ్డాడు. తొలుత చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని చర్చి ప్రారంభించాడు. ఆ తర్వాత సొంతంగా స్థలం తీసుకొని చర్చి నిర్మించాడు. చర్చికి వచ్చేవారికి దీవెనయ్యగా సుపరిచితుడు.

డివైడర్లు ఉంటే.. ప్రాణాలు దక్కేవి 
నాందేడ్‌–అకోలా జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా డివైడర్ల ఏర్పాటు చేయలేదు. పనులు కూడా పూర్తికాలేదు. దీంతో అన్ని వాహనాలు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. ప్రమాదస్థలి వద్ద రోడ్డు వెడల్పుగానే ఉంది. లారీ ఎడమవైపు వస్తుండగా, కుడివైపున కారు ఢీకొంది. ఎడమవైపు వెళ్లాల్సిన కారు కుడి వైపు ఎందుకు వెళ్లిందో..? అతి వేగంగా వెళ్లడమా..? లేదా ఏదైనా వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేయబోతే ఈ ఘటన జరిగిందా..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. 

‘భయంగా ఉందిరా..’
అంబదాస్‌ ఆటోడ్రైవర్‌ కాగా, భార్య పద్మ కూలి పనులకు వెళ్తుంటుంది. చుట్టుపక్కల వారిని తల్లో నాలుకగా ఉంటారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో కొడుకు వినయ్‌కు ఫోన్‌చేసి తనకు భయం అవుతోందని, సంగారెడ్డికి రమ్మని చెప్పగా.. జోగిపేట వరకు వస్తానని, అక్కడ కారు దిగితే బస్సులో వెళ్దాం అని తన తండ్రితో వినయ్‌ చెప్పాడు. అయితే జోగిపేట రాకముందే దారుణమైన ప్రమాదం జరిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement