ఎఫ్‌ఎస్‌ఎల్‌కు చేరిన హార్డ్‌ డిస్క్‌ | Hard Disk To FSL | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు చేరిన హార్డ్‌ డిస్క్‌

Published Sat, Aug 4 2018 3:05 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Hard Disk To FSL - Sakshi

బాంబు పేలుళ్ల ఘటనలో మృతదేహాలను అంబులెన్స్‌లోకి తరలిస్తున్న స్థానికులు (ఫైల్‌) 

వరంగల్‌ క్రైం : వరంగల్‌ కాశిబుగ్గ కోటిలింగాల గుడి ప్రాంతంలో భద్రకాళి ఫైర్‌వర్క్స్‌లో జరిగిన బాంబు పేళుళ్లలతో వరంగల్‌ నగరం ఉలిక్కిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెంది నేటికి నెల రోజులైంది. జూలై 4న జరిగిన ఈ పేలుళ్లను పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణించి భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌ యజమాని గుళ్లపెల్లి రాజ్‌కుమార్‌ను సంఘటన జరిగిన రాత్రే అరెస్టు చేసి జైలుకు పంపించారు.

జనావాసాల్లో ప్రమాదకరమైన ఫైర్‌ వర్క్స్‌ను కొనసాగించటం, దానిని కొన్ని ప్రభుత్వ శాఖలు అనుమాతులు ఇవ్వడం, పోలీసు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి భయంకరమైన ప్రమాదాలు జరిగాయని ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో పోలీసులు ఘటనకు కారణమైన నిందితుడిని అరెస్టు చేయడంతో అతడికి సంబంధించిన గోడౌన్లను సీజ్‌ చేశారు. ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు సహితం వినిపించాయి. 

దర్యాప్తునకు సాంకేతిక అడ్డంకులు...

బాంబు పేలుళ్ల సంఘటన స్థలంలో పోలీసు అధికారులు కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భద్రకాళి ఫైర్‌వర్క్స్‌లోకి పనికి వచ్చే కార్మికులకు సంబంధించిన హాజరు రిజిష్టర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ను హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైం విభాగానికి పంపించారు. అక్కడ దానిని ఓపెన్‌ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని అధికారులు చెప్పడంతో తిరిగి హార్డ్‌డిస్క్‌ను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌)కు పంపించారు.

ప్రస్తుతం హార్డ్‌ డిస్క్‌ హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్‌లో ఉంది. దీనిని ఓపెన్‌ చేయటానికి ముంబై నుంచి నిపుణులు రావాల్సి ఉన్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రమైన వేడి, మంటలకు హార్డ్‌ డిస్క్‌ భాగం దెబ్బతిన్నట్లు తెలిసింది. దీంతో నిపుణుల సమక్షంలోనే దానిని ఓపెన్‌ చేయటానికి అధికారులు నిరీక్షిస్తున్నట్లు సమాచారం. హార్డ్‌ డిస్క్‌లో నిక్షిప్తమై ఉన్న సమాచారంపైనే కేసు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. 

కొనసాగుతున్న విచారణ...

ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తోంది. దీంతో బాధిత కుటుంబాల నుంచి ప్రజల నుంచి అధి కారులపై ఒత్తిడి పెరుగుతోంది. పోలీసులు దర్యాప్తులో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు సైతం  వినిపిస్తున్నాయి. భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌ యజమాని గుళ్లపెల్లి రాజ్‌కుమార్‌ బయటకు రావటానికి ఇప్పటికే నాలుగు సార్లు కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేయగా పోలీసులు కౌంటర్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు అతడికి బెయిల్‌ మంజూరు కాలేదు.

ప్రమాదం జరిగిన రోజున అనుమానాస్పదంగా ఉన్న  మల్లికార్జున్, రాకేష్‌ మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి నివేదికలను తెప్పించడంలో వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ తీవ్రంగా కృషి చేశారు. ఫోరెనిక్స్‌ సైన్స్‌ ల్యాబరేటరీ ఫలితాలు వస్తే పోలీసులు ఈ కేసులో చార్జీషీట్‌ దాఖలు చేస్తారని చెబుతున్నారు. 

మృతుల్లో 10 మంది..

జులై 4న వరంగల్‌ కాశిబుగ్గలోని కోటిలింగాల గుడి ప్రాంతంలో భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో జరిగిన పేళుళ్లలో మొత్తం 10 మంది మృతి చెందారు. సంఘటన జరిగిన రోజు 8 మందిని గుర్తించగా ఆ తరువాత ఇద్దరి మృత దేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మొత్తం 10 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.

మృతుల్లో ... కాశిబుగ్గ తిలక్‌రోడ్‌కు చెందిన  గాజుల హరిక్రిష్ణ (38), సుందరయ్య నగర్‌ ఓంసాయి కాలనీకి చెందిన  కోమటి శ్రావణి(33), బేతి శ్రీవాణి(25), ఏనుమాముల మార్కెట్‌ రోడ్డులోని బాలాజీ నగర్‌కు చెందిన రంగు వినోద్‌(24), కాశిబుగ్గకు చెందిన వలసదాసు అశోక్‌కుమార్‌(30),కాశిబుగ్గ సాయిబాబా గుడి ప్రాంతానికి చెందిన బాలినే రఘపతి (40), కీర్తి నగర్‌కు చెందిన కందకట్ల శ్రీదేవి(34), సుందరయ్యనగర్‌కు చెందిన బాస్కుల రేణుక(39), కొత్తవాడకు చెందిన మల్లికార్జున్‌(35), కరీమాబాద్‌కు చెందిన వంగరి రాకేష్‌(22)  బాంబు పేలుళ్లలో మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. వీరందరి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందజేసింది.

శోకసంద్రంలో బాధిత కుటుంబాలు

భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది. ప్రమాదంలో కుటుంబ పెద్ద, తల్లుల కోల్పోయిన పిల్లలు, భర్తలను కోల్పోయిన భార్యలు ఇలా... ఒక్కో కుటుంబంలో ఒక్కో రకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించిన ఆ కుటుంబాలకు ఆసరా నివ్వలేక పోతున్నాయి.

ప్రమాదంలో మరణించిన మృతులంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారే కావడంతో అన్ని కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వం , ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలకు ఏదైన ఉపాధి అవకాశాలు చూపెడితే తప్ప కోలుకోలేని స్థితుల్లో ఆ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.

దర్యాప్తు వేగవంతం చేస్తున్నాం..

భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌లో జరిగిన ప్రమాదాన్ని తీవ్రంగా పరిగిణించి దర్యాప్తును వేగవంతం చేస్తున్నాం. సాధారణంగా డీఎన్‌ఏ రిపోర్టు రావటానికి నాలుగైదు నెలలు పడుతుంది. కాని మూడు నాలుగు రోజుల్లో  డీఎన్‌ఏ రిపోర్ట్‌ తెప్పించి వారికి కూడా ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా  చేశాం. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీలో ఉంది.

దానిని ఓపెన్‌ చేసి నివేదిక తెప్పించటానికి సంబంధిత అధికారులతో మాట్లాడాం. దీంతోపాటు నిందితుడు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నాం. ఫైర్, విద్యుత్‌ శాఖల నివేదికలు కూడా రావాల్సి ఉంది. త్వరలో జన సంచార ప్రదేశాల్లో ఉన్న షాపులన్నింటికి నోటీసులు జారీ చేస్తాం. దీంతో వారి అనుమతులు రద్దవుతాయి. బాధితులకు పోలీసు శాఖపరంగా అన్ని విధాలా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ పోలీసు కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement