రమేష్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్యాంసుందర్, అజగన్ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుమార్తెలు,
డోర్నకల్ (వరంగల్): విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి చెందడంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. అన్నదమ్ములు తేనె రమేష్(50), తేనె జగన్(47) మృత్యువాత పడడంతో రెండు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన తేనె సహదేవ్, వెంకటమ్మకు నలుగురు కుమారులు రమేష్, జగన్, సతీష్, వెంకన్న ఉన్నారు. సహదేవ్ కొంతకాలం క్రితం మృతి చెందాడు. గ్రామం నుంచి బొడ్రాయి తండా మార్గంలో ఉన్న భూమిని నలుగురు కుమారులకు పంపిణీ చేశారు. వ్యవసాయ భూమిలో కుమారులు వేర్వేరుగా పత్తిపంటను సాగు చేస్తున్నారు. దుక్కి దున్ని ఎరువు చల్లేందుకు రమేష్, జగన్ వేర్వేరుగా అరకలు తీసుకుని బుధవారం ఉదయం చేను వద్దకు వెళ్లారు. రమేష్ అరకు దున్నుతున్న క్రమంలో పత్తి చేను మీదుగా వ్యవసాయ బావి వద్దకు అమర్చిన విద్యుత్ లైను తీగ తెగి పడింది. అది తగిలి రమేష్ చనిపోయాడు. అన్న రమేష్‌ను కాపాడబోయి జగన్ కూడా విద్యుదాఘాతంతో క్షణాల్లో మృతి చెందాడు.
పత్తి చేను వద్దకు పరుగులు..
విద్యుదాఘాతంతో అన్నదమ్ములు రమేష్, జగన్ మృతి చెందిన వార్త తెలుసుకున్న గ్రామస్తులు పత్తి చేను వద్దకు పరుగులు పెట్టారు. ఇద్దరి మృతదేహాలను వెంటనే ఇంటికి చేర్చారు. రోడ్డుకు ఇరువైపులా రమేష్, జగన్ ఇళ్లు ఉండడంతో రాకపోకలు స్తంభించాయి. ఇరువురి కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన మహిళల రోదనలు మిన్నంటాయి. రమేష్, జగన్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ మండలానికి సుపరిచితులు కావడంతో చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇద్దరు కుమారులను కోల్పోయిన తల్లి.. తండ్రిని కోల్పోయిన ముగ్గురు కుమార్తెలు
ఇద్దరు కుమారుల మృతదేహాలను చూసిన తల్లి వెంకటమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. కొద్దిసేపు రమేష్ ఇంటికి, కొద్దిసేపు జగన్ ఇంటికి వెళ్లి మృతదేహాల వద్ద విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. జగన్‌కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, రెండో కుమార్తె ఇంటర్, మూడో కుమార్తె 9వ తరగతి చదువుతున్నారు. ఉదయమే పిల్లలు కళాశాలకు వెళ్లారు. తండ్రి మరణ వార్త తెలుసుకుని వెంటనే ఇంటికి చేరుకున్నారు. నవ్వుతూ కళాశాలకు పంపిన తండ్రి విగతజీవిగా మారి కనిపించడంతో ముగ్గురు పిల్లల రోదనలు మిన్నంటాయి.
ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ..
సంఘటన స్థలాన్ని డోర్నకల్ సీఐ జక్కుల శ్యాంసుందర్ పరిశీలించారు. ఘటన జరిగిన తీరు గురించి చుట్టు పక్కన వ్యవసాయ భూములకు చెందిన రైతులను విచారించారు. ఘటనకు కారణమైన విద్యుత్ తీగను సేకరించారు. అనంతరం శవ పంచనామా పూర్తి చేసి మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
సబ్‌మెరైన్ మోటార్లకు వినియోగించే వైరు..
తోడేళ్లగూడెం సమీపంలో రమేష్, జగన్‌కు చెందిన వ్యవసాయ బావికి మెయిన్ లైన్ నుంచి అమర్చిన విద్యుత్ వైరు వ్యవసాయ బావుల్లోని సబ్ మెరైన్ మోటర్లకు వినియోగించేదని విద్యుత్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. స్తంభాల మీదుగా సర్వీస్ వైరు (సబ్‌మెరైన్ మోటర్లకు వినియోగించేది)తో లైను ఏర్పాటు చేసుకున్నారు. సన్నగా ఉండే వైరు తెగి పత్తి చేనులో పడడం, అది గమనించక రమేష్, జగన్ మృత్యువాత పడ్డారు.
రమేష్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్యాంసుందర్
రమేష్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్యాంసుందర్
Comments
Please login to add a commentAdd a comment