సాక్షి, వరంగల్: నకిలి విత్తనాలతో పాటు గడువు తీరిన పురుగుల మందులను విక్రస్తున్న ముఠా గుట్టును వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. నకిలీ విత్తనాలు, మందులతో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మూడు ముఠాలకు చెందిన 13మందిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అలాగే ఇద్దరు ఫర్టిలైజర్ షాప్ యాజమానులపై కూడా కేసు నమోదయ్యింది. ఈ దాడిలో నిందితుల నుంచి 75 లక్షల విలువైన నకిలీ, గుడువు తీరిన పురుగుల మందు, నిషేధిత గడ్డి మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మందుల తయారీకి అవసరమైన రసాయనాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీ బాటిల్స్, ఓ కారును పోలీసులు సీజ్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. పట్టుబడ్డ మందుల్లో 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, 30 లక్షల రూపాయల విలువ గల నకిలీ పురుగు మందులు, 3 లక్షల 53వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందు ఉన్నట్లు సిపి రంగనాథ్ తెలిపారు. గడువు తీరిన మందులు సైతం విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి రావడంతో నిఘా పెట్టగా ముఠాల గుట్టురట్టయిందని, కల్తీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సీరియస్ యాక్షన్ చేపట్టామన్నారు. కల్తీలతో మోసానికి పాల్పడే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. మందులు కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని సిపి రంగనాథ్ రైతులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment