సర్కారుకు కలెక్టర్ల తాజా నివేదిక
ఖమ్మం జిల్లాలో అత్యధికంగా
351 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జిల్లా కలెక్టర్లు పంపిన తాజా ప్రాథమిక నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 869 మంది మృతిచెందారు. నివేదికలోని గణాంకాల ప్రకారం అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 351 మంది కన్నుమూయగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 144 మంది, కరీంనగర్ జిల్లాలో 115 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 69, మెదక్ జిల్లాలో 48, రంగారెడ్డి జిల్లాలో 28, వరంగల్ జిల్లాలో 15, హైదరాబాద్‌లో ఎనిమిది మంది చనిపోయారు.
నల్లగొండ జిల్లాలో 332 మంది మరణించినట్లు గతంలో నివేదిక ఇచ్చిన అక్కడి అధికారులు తాజాగా దాన్ని 91కి తగ్గించి నివేదికలో పేర్కొన్నారని విపత్తు నిర్వహణశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఇంతమంది వడదెబ్బకు చనిపోవడం ఇదే తొలిసారి. 2015 వేసవిలో వడదెబ్బకు 541 మంది మరణించారు. జూన్ మొదటి వారం వరకు వడగాడ్పులు కొనసాగే అవకాశం ఉండటంతో వడదెబ్బ మరణాలు పెరుగుతుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, కలెక్టర్ల ప్రాథమిక లెక్కలపై జిల్లాల్లోని త్రిసభ్య కమిటీలు మృతుల వివరాలపై విచారణ చేపట్టాయి. 317 మరణాలు మాత్రమే వడదెబ్బ వల్ల సంభవించాయని లెక్కగట్టాయి. అయితే మృతుల సంఖ్యను త్రిసభ్య కమిటీ తక్కువ చేసి చూపిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
చర్యలు శూన్యం...
రాష్ట్రం నిప్పుల కుంపటిపై కుతకుతలాడుతోంది. ప్రస్తుతం 50 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పరిస్థితి తీవ్రతపై సర్కారుకు ఎప్పటికప్పుడు నివేదికలు అందుతున్నా ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడటంలో విఫలమైందని ఆరోపణలున్నాయి. ఎండల తీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ కార్యాలయాలు, గుళ్లు తదితర చోట్ల నీడ కల్పించడం, ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ఉష్ణోగ్రతల వివరాలు ప్రదర్శించడం, ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్, 108 సర్వీసులను అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టాలి. వడగాడ్పులుంటే ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య నడపకూడదు. వడదెబ్బకు గురైన వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా వార్డులను ఏర్పాటు చేయాలి. కానీ ఇవేవీ అమలుకావడంలేదన్న విమర్శలున్నాయి.