సాక్షి, హైదరాబాద్ : పల్లెవాసులను పాముకాటు వణికిస్తోంది. సకాలంలో వైద్యం అందక, అందుబాటులో ఉన్న సర్కారు ఆస్పత్రుల్లో మందుల్లేక రాష్ట్రంలో ఏటా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఏటా 5 వేల మంది వరకు పాముకాటుకు గురవుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య 10 వేలపైనే ఉంటుంది. వీరిలో ఏటా దాదాపు 600 మంది చనిపోతున్నారు. పాము కరిచిన బాధితులను గంటలోపు (గోల్డెన్ అవర్) ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. మనదేశంలో పశ్చిమబెంగాల్, ఏపీ, తమిళనాడుల్లో అత్యధిక పాము కాటు కేసులు నమోదవుతున్నాయి.
అవగాహన ఇంకెప్పుడు?
పాము కరిస్తే తక్షణమే ఆసుపత్రులకు తీసుకెళ్లాలన్న అవగాహన లేకపోవడం వల్లే ఎక్కువ మరణాలు చోటుచేసుకుంటున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్రామాల్లో ఇప్పటికీ మంత్రతంత్రాలపైనే ఆధారపడుతున్నారు. లేదంటే నాటు వైద్యుడిని ఆశ్రయిస్తున్నారు. ఓ అంచనా ప్రకారం 70 శాతం పాముకాటు కేసుల్లో నాటు వైద్యులను, మంత్రతంత్రాలనే నమ్ముతున్నారు.
ఆసుపత్రుల్లో మందులేవీ?
చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీలు) పాము కాటుకు అవసరమైన యాంటీ వీనం సీరం ఇంజక్షన్ అందుబాటులో ఉండటం లేదు. సాధారణంగా రాత్రి వేళల్లో పాము కాటుకు గురవుతుంటారు. ఆ సమయంలో ఆసుపత్రులు తెరిచి ఉండటం లేదు. అటుఇటూ తిరిగి చివరి నిమిషంలో పెద్దాసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతోంది.
రాష్ట్రంలో 31 రకాల పాములు
మన దేశంలో 300 రకాల సర్పాలున్నాయి. అందులో 66 రకాల పాములే విషపూరితమైనవి. అందులోనూ 61 రకాల పాముల్లో మనిషిని చంపేంత విషం ఉండదు. మిగిలిన ఐదు రకాల పాములతోనే ప్రాణహాని ఉంటుంది. తెలంగాణలో 31 రకాల పాములున్నాయి. వాటిల్లో ఆరు పాములు మాత్రమే విషపూరితమైనవి. తాచుపాము, రక్తపింజర, కట్ల పాము, చిన్న పింజర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. లంబిడి గాజుల పాము (ఇదో రకం కట్లపాము, ఏటూరునాగారం ఏరియాలో ఉంటుంది), ఇంకోటి బ్యాంబూ బిట్ వైఫర్(ఇది అరుదైన రక్త పింజర). ఈ ఆరు రకాల పాములే తెలంగాణలో విషపూరితమైనవి. మిగిలిన పాములు సాధారణమైనవే! వీటిల్లో తాచు పాములే 48 శాతం ఉంటాయి.
పాము కరిస్తే ఏం చేయాలి?
ఏమాత్రం ఆందోళన చెందకూడదు. ఎక్కువ ఆందోళన చెందితే బాధితుడి గుండె కొట్టుకునే వేగం పెరిగి పాము విషమంతా రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది.
బాధితుడిని తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్లి యాంటీ వీనం సీరం ఇవ్వాలి. మంచినీరు, ఆహారం ఇవ్వొద్దు.
పాము కరిచిన భాగాన్ని యాంటీ సెప్టిక్‌తో పూర్తిగా శుభ్రం చేయాలి. మంచుగడ్డలు (ఐస్) పెట్టొద్దు.
అవగాహన ఉండటం లేదు
పాములన్నీ విషపూరితం కాదు. పాము కరవగానే చాలామంది ఇప్పటికీ మంత్రతంత్రాల వైపే ఆకర్షితులవుతున్నారు. కొందరు నాటు వైద్యం చేయించుకుంటున్నారు. ఇదే మరణాలకు కారణమవుతోంది.
– అవినాశ్, ప్రధాన కార్యదర్శి, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ, తెలంగాణ
ఆస్పత్రుల్లో మందులున్నాయి
పాము కాటుకు ప్రాథమిక ఆస్పత్రుల్లో వైద్యం అందుబాటులో ఉంది. యాంటీ వీనం సీరం మందు అన్నిచోట్లా అందుబాటులో ఉంచాం. – సుకృతారెడ్డి, జాయింట్ డైరెక్టర్, ఎపిడమిక్స్, తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment