బస్సు నుంచి బయటకు తీసిన మృతదేహాలు
విశాఖ జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు.. రెండు బస్సులు ఘాట్ రోడ్డులో రయ్‌రయ్ మంటూ వెళుతున్నాయి. ఒక్కొక్క బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వాతావరణం చల్లగా ఉండడంతో బస్సులో ఉన్నవారందరూ నిద్రలోకి జారుకున్నారు. దారంతా మలుపులు, కొత్తమార్గం కావడంతో డ్రైవర్లు కూడా కాస్త ఇబ్బందిగానే బస్సు నడుపుతున్నారు. వంట్లమామిడి జంక్షన్‌కు 200 మీటర్ల దూరంలో ముందు వెళుతున్న బస్సును వెనుక వెళుతున్న బస్సు ఓవర్ టేక్ చేసింది. ఆ సమయంలోనే మలుపు వద్ద అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో ఒక్కసారిగా బస్సు జంక్షన్‌లోని ఎడమ వైపు రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది. బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 37 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
సాక్షి, పాడేరు : పాడేరు– చోడవరం ఘాట్ రోడ్డులో వంట్లమామిడి వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీర్థయాత్ర బస్సు నిశీధి వేళ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా దారి పక్కన ఉన్న ఓ దుకాణాన్ని బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. వంట్లమామిడి గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కాకినాడ నగరంలోని జగన్నాథపురం రెల్లివీధికి చెందిన 40 మంది ఒక బస్సులో.. అదే ప్రాంతానికి చెందిన మరో 40 మంది ఇంకో బస్సులో ఈ నెల 6న తీర్థయాత్రకు బయల్దేరారు. ముందుగా వారు అనుకున్న ప్రకారం ఒడిశాలోని రాయగఢ్‌లోని గల మజ్జి గౌరమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని సోమవారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నానికి అరకులోయ చేరుకున్నారు. అక్కడ పర్యాటక ప్రాంతాలను తిలకించి బొర్రా గుహలకు వెళ్లారు. తిరిగి రాత్రి పది గంటలకు అరకులోయ చేరుకున్నారు. అక్కడ అంతా టిఫిన్లు చేసి పాడేరు బయల్దేరారు. పాడేరు వచ్చేసరికి రాత్రి 11.20 గంటలైంది. ఇక పాడేరులో ఆగకుండానే మంగళవారం ఉదయం మాడుగుల మోదకొండమ్మను దర్శించుకోవాలని ఘాట్ రోడ్డులో బయల్దేరారు.
మృతులు ముగ్గురూ విశ్రాంత ఉద్యోగులు
బస్సు ప్రమాదంలో మృతి చెందిన జలగడుగుల పోలమ్మ (65), రాజ నాగమణి (63), ఒబిరిశెట్టి దీనమ్మ (62) కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా పని చేసి రిటైరు అయ్యారు. తీరిక సమయంలో వీరు దైవదర్శనాలకు వెళ్లడం వీరికి అలవాటు. ఈ ముగ్గురి భర్తలూ గతంలోనే చనిపోయారు.
బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలు
ప్రమాదానికి గంట ముందు..
వంట్లమామిడిలో ట్రావెల్ బస్సు గిరిజనుడు జనపరెడ్డి నాగేశ్వరరావుకు చెందిన రేకుల దుకాణాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో దుకాణం పూర్తిగా నేలమట్టమైంది. ప్రమాదానికి గంట ముందు వరకు నాగేశ్వరరావు దుకాణం వద్దే ఉన్నాడు. రోజూ ఇక్కడే అతను ఫైనాఫిల్, పనసపండ్లు విక్రయాలు సాగిస్తాడు. సోమవారం రాత్రి 11 గంటల వరకు తన భార్యతో కలసి దుకాణం వద్ద సమీపంలో ఉన్న ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో వారికి ప్రమాదం తప్పింది.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
ప్రమాద విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మంగళవారం ఉదయాన్నే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే ఫోన్‌లో కలెక్టర్‌కు విషయం చెప్పారు. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు కల్పించాలని ఆదేశించారు.
ఏడు గంటల తర్వాత వచ్చిన పోలీసులు
బస్సు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు వంట్లమామిడి గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. కానీ పోలీసులు సుమారు 7 గంటల తర్వాత కానీ సంఘటన స్థలానికి చేరుకోలేదు. ఉదయం 8 గంటల సమయంలో డీఎస్పీ రాజ్‌కమల్, సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై నజీర్ సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చారు. మృతదేహాలను శవపంచనామా జరిపి పాడేరు జిల్లా ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
సకాలంలో స్పందించిన 108
బస్సు ప్రమాద బాధితులకు 108 సేవలు సకాలంలో అందించాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. దీంతో పాడేరు–2, పెదబయలు, హుకుంపేట, జి.మాడుగుల, చోడవరం, మాడుగుల ప్రాంతాలకు చెందిన ఆరు 108 వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వారికి 108 సిబ్బంది ప్రథమ చికిత్స చేసి వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సకాలంలో సేవలు అందించడంతో నలుగురికి ప్రాణపాయం తప్పింది. మిగిలిన వారికి మెరుగైన వైద్యసేవలు అందాయి.
క్షతగాత్రులకు వైద్య సేవలు
వంట్లమామిడి ట్రావెల్ బస్సు ప్రమాద క్షతగాత్రులకు ఎన్టీఆర్ వైద్యాలయంలో వైద్య సేవలు అందించారు. ఆస్పత్రిలో మొత్తం 38 మంది చేరారు. వీరిలో కె.వెంకన్న, వాసంశెట్టి వెంకటలక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేజీహెచ్‌కు తరలించారు. జె.అన్నపూర్ణ అనే మహిళ అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం పొందుతోంది. మిగిలిన వారందరూ ఎన్టీఆర్ వైద్యాలయంలో చికిత్స పొంది మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక ప్రైవేటు బస్సులో స్వస్థలం కాకినాడకు బయల్దేరి వెళ్లిపోయారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, నాయకులు పరామర్శించారు.
డ్రైవర్ నిర్లక్ష్యమేనా?
ట్రావెల్ బస్సు బోల్తా పడిన ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మరోరవైపు శనివారం నుంచి సోమవారం వరకు డ్రైవింగ్ చేసి డ్రైవర్ అలసటకు గురవడంతో నిద్ర మత్తులోకి జారుకోవడం ద్వారానే ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. ఆర్టీఏ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి ప్రమాదానికి గురైన బస్సును పరిశీలించారు.
ఓవర్‌టెక్ చేసిన 200 మీటర్ల దూరంలోనే ప్రమాదం
ట్రావెల్ బస్సులు రెండూ పాడేరు దాటిన దగ్గర నుంచి కాస్త వేగంగా వెళుతున్నాయి. జల్లులు పడుతుండడం.. వాతావరణం చల్లగా ఉండడంతో బస్సులో ఉన్నవారందరూ నిద్రలోకి జారుకున్నారు. దారంతా మలుపులు, కొత్తమార్గం కావడంతో డ్రైవర్లు కూడా కాస్త ఇబ్బందిగానే బస్సు నడుపుతున్నారు. వంట్లమామిడి జంక్షన్‌కు 200 మీటర్ల దూరంలోనే ముందు వెళుతున్న బస్సును ప్రమాదానికి గురైన బస్సు ఓవర్ టేక్ చేసింది. ఆ సమయంలోనే మలుపు వద్ద అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో ఒక్కసారిగా బస్సు బ్రేకులు ఫెయిలై జంక్షన్‌లోని ఎడమ వైపు రోడ్డు పక్కన ఉన్న దుకాణాన్ని బలంగా ఢీకొని బోల్తా పడింది. బస్సులో ఉన్నవారు ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. చుట్టూ చీకటి కమ్ముకుని ఉంది. దీనికి తోడు వాన పడుతోంది.
బస్సు ముందు భాగం అద్దాలు పూర్తిగా పగలిపోవడంతో లోపల ఉన్న వారు రోడ్డుపైకి దూసుకుపోయారు. మరికొంత మంది సీట్ల మధ్య నలిగిపోయి ఇరుక్కుపోయి హాహాకారాలు చేస్తున్నారు. శబ్దానికి వంట్లమామిడి గ్రామస్తులు నిద్రలేచి ఏం జరిగిందని పరుగులు తీశారు. వెనుక వస్తున్న బస్సులోని వారు సంఘటనను చూసి తీవ్ర భయాందోళన చెందారు. బస్సులో ఉన్న మహిళలు, పిల్లలు బోరున ఏడవడం మొదలెట్టారు. ఏం చేయాలో వారికి తెలియడం లేదు. వంట్లమామిడి గ్రామస్తులు వెంటనే బోల్తా పడిన బస్సులోని క్షతగాత్రులు ఒక్కొక్కరిని బయటకు తీశారు. చుట్టూ చీకటి ఉండడంతో ఇళ్లలోని టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్లు లైట్ల వెలుగులో క్షతగ్రాతులను బయటకు తీసి సపర్యలు చేశారు. యువకులు 108కు సమాచారమిచ్చి వాహనాలు వచ్చాక క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment