ఉక్రెయిన్‌లో 51 మంది మృతి
కీవ్: రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై భీకర దాడికి పాల్పడింది. సెంట్రల్ ఉక్రెయిన్ ప్రాంతం పొల్టావా నగరంలోని సైనిక శిక్షణా కేంద్రం, ఆ సమీప ఆస్పత్రులే లక్ష్యంగా రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో 51 మంది చనిపోయారు. 219 మంది గాయపడ్డారు. శిథిలాల్లో చిక్కుకున్న 11 మంది సహా మొత్తం 25 మందిని కాపాడినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. 2022లో ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలు పెట్టిన తర్వాత రష్యా చేపట్టిన భీకర దాడుల్లో ఇదొకటని పరిశీలకులు అంటున్నారు. కీవ్, ఖర్కీవ్‌లను కలిపే ప్రధాన రహదారి, రైల్వే మార్గంపై పొల్టావా ఉంది.
మంగళవారం ఉదయం హెచ్చరిక సైరన్లు మోగడంతో బాంబు షెల్టర్లలోకి పరుగు తీస్తుండగానే క్షిపణులు వచ్చి పడ్డాయని స్థానికులు తెలిపారు. దాడిలో సైనిక శిక్షణ కేంద్రానికి చెందిన ఒక భవనం పాక్షికంగా దెబ్బతింది. అందులోని చాలామంది శిథిలాల్లో చిక్కుకుపోయారు. వీరిలో చాలా మందిని సహాయక సిబ్బంది రక్షించారని పేర్కొంటూ జెలెన్‌స్కీ టెలిగ్రామ్ ఛానల్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. సైనిక సాయం వెంటనే అందజేయాలంటూ మరోసారి ఆయన పశ్చిమదేశాలను కోరారు. రష్యాలోని సరిహద్దులకు దూరంగా ఉండే ప్రాంతాలపై దాడులు చేపట్టేందుకు తమకు అనుమతివ్వాలన్నారు.
‘ఉక్రెయిన్‌కు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, రష్యాపై ఎదురుదాడికి దిగేందుకు క్షిపణుల అవసరం ఇప్పుడు ఎంతో ఉంది. ఎప్పుడో తర్వాత కాదు. అవి గోదాముల్లో ఉంటే ఎవరిక్కావాలి?’అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సాయం అందించడంలో ఆలస్యం జరిగే ఒక్కో రోజూ దురదృష్టవశాత్తూ మరిన్ని మరణాలకు కారణమవుతోందన్నారు. అమెరికా, పశ్చిమదేశాల నుంచి తక్షణ సైనిక సాయం అందే జాడలు కనిపించకపోవడం విచారకరమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment