పేలిన సిలిండర్‌ | The blasting cylinder was held in Kushaiguda area in Hyderabad | Sakshi
Sakshi News home page

పేలిన సిలిండర్‌

Published Sat, Jan 19 2019 2:53 AM | Last Updated on Sat, Jan 19 2019 2:53 AM

The blasting cylinder was held in Kushaiguda area in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని కుషాయిగూడ ప్రాంతంలో ఓ ఇంట్లో శుక్రవారం ఉదయం జరిగిన పేలుడు కలకలం రేపింది. మొదట ఈ పేలుడికి కారణం తెలియక ఆందోళన చెందినా.. తర్వాత సిలిండర్‌ గ్యాస్‌ వల్లే పేలుడు జరిగిందని ప్రాథమిక ఆధారాల ద్వారా తెలిసింది. ఈ ఘటనలో ఆ ఇంటి యజమానితోపాటు మరొకరు చనిపోగా.. యజమాని భార్యకు తీవ్రగాయాలయ్యాయి. సిలిండర్‌ గ్యాస్‌ కారణంగా మంటలు ఎగిసిపడటంతో ఆమె తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నారు.

ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అప్పుడప్పుడే నగరం నిద్రలేస్తున్న సమయంలో కాప్రాలో జరిగిన ఈ పేలుడు స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. పేలుడు ధాటికి ఆ ఇంటి మొదటి అంతస్తు పూర్తిగా ధ్వంసమైంది. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. ఇంటి శకలాలు తాకి రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి చనిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న పలువురికి గాయాలయ్యాయి. ఎదురుగా, పక్కన ఇళ్లు కూడా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పక్కనున్న లైఫ్‌ స్ప్రింగ్‌ ఆసుపత్రితోపాటు సమీపంలోని ఇళ్లలో వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. 

అసలేం జరిగింది!
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాజస్తాన్‌ నుంచి వచ్చిన మోహన్‌ చందూలాల్‌ చౌదరి నగరంలో పాన్‌బ్రోకర్‌ వ్యాపారం చేస్తూ కాప్రాలో సొంతిల్లు కట్టుకున్నారు. ఆయనతోపాటు భార్య లీల, కుమారుడు గోవింద్‌ బాబు, కుమార్తె నిఖితలు మొదటి అంతస్తులో ఉంటుండగా.. పైన, కింద అంతస్తులను అద్దెకిచ్చారు. గురువారం రాత్రి తలుపులు మూసుకుని అంతా పడకగదిలో నిద్రకు ఉపక్రమించారు. సిలిండర్‌కు ఉండే రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయకపోవడంతో గ్యాస్‌ పైప్‌కు ఉన్న రంధ్రాల నుంచి గ్యాస్‌ లీకైంది.

నిద్రలో ఉన్న కుటుంబసభ్యులు ఈ విషయం గమనించలేదు. శుక్రవారం ఉదయం నిద్ర లేచిన చందూలాల్‌ 7.10 గంటల సమయంలో వంటింట్లోకి వెళ్లారు. గ్యాస్‌ వాసన రావడంతో.. ఏం జరిగిందో చూద్దామని లైట్‌ స్విచ్‌ వేయడమే ఆయన చేసిన పాపమైంది. అప్పటికే గ్యాస్‌ ఇల్లంతా వ్యాపించి ఉండటంతో స్విచ్‌ ఆన్‌ చెయ్యగానే వచ్చిన స్పార్క్‌తో భారీ పేలు డు సంభవించింది. ఈ ధాటికి ఆ ఇంటి గోడలు, కిటికీలు, తలుపులూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

ఇంట్లోంచి రోడ్డుపైకి ఎగిరిపడి..
మంటల ప్రభావంతో కాలినగాయాలైన చందూలాల్‌ పేలుడు ధాటికి మొదటి అంతస్తు నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ గ్యాస్‌ మంట తాకిడి భూమి నుంచి కొంత ఎత్తులోనే పని చేసింది. గదికి పక్కనే ఉన్న బెడ్‌రూంలోకీ గ్యాస్‌ వ్యాపించడంతో మంటలంటుకున్నాయి. దీంతో బెడ్‌పై పడుకున్న లీలకు కాలినగాయాలయ్యాయి. మంటల నుంచి తప్పించుకోలేక.. ఆమె అరుచుకుంటూ పక్కింటిలోకి వెళ్లి కుప్పకూలింది. ఇంటి హాల్‌లో పడుకున్న చందూలాల్‌ పిల్లలు గోవింద్‌బాబు, నిఖితలకు స్వల్ప గాయాలయ్యాయి. 50%వరకు కాలిన గాయాలైన లీలను, రోడ్డుపై పడ్డ చందూలాల్‌ను, వీరి పిల్లలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ చందూలాల్‌ చనిపోయారు.

ఏ పాపం తెలియని వారు కూడా..
మొదటి అంతస్తు నుంచి ఎగిరిపడిన సిమెంట్‌ పెళ్లలు రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. స్థానికంగా సెలూన్‌ నిర్వహించే ఎలగందుల రవి (32) దుకాణం తెరిచేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ సమయంలోనే గాల్లో ఎగురుతూ వచ్చిన సిమెంట్‌ పెళ్ల తగలడంతో తలకు తీవ్రగాయమై రవి అక్కడికక్కడే చనిపోయాడు. పాఠశాలకు తండ్రితో కలిసి రోడ్డుపై వెళ్తున్న యశస్వి అనే బాలుడికి శిథిలాలు తగిలి గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్, జాయింట్‌ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌లు హూటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సిలిండర్‌ గ్యాస్‌ పేలుడు కారణంగానే దుర్ఘటన జరిగిందని నిర్ణయించారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి, మేయర్‌ రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ ఫసియొద్దీన్‌ తదితరులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనలో లీక్‌ అయిన సిలిండర్‌తోపాటు దాని పక్కనే ఉన్న సగం వరకు నిండి ఉన్న సిలిండర్‌లు అలాగే ఉన్నాయి. ఇవి పేలుంటే తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని భావిస్తున్నారు. కేవలం గ్యాస్‌ లీకైనందున దీన్ని కెమికల్‌ ఎక్స్‌ప్లోజర్‌గానే భావిస్తున్నారు.

చెల్లాచెదురైన జీవితాలు
రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం మరోసారి పెద్దదిక్కును కోల్పోయింది. బొమ్మల రామారం మండలం నానినేనిపల్లికి చెందిన ఎలగందుల సత్తయ్య, పద్మ దంపతులకు రవి (33), ఇద్దరు కుమార్తెలు. బతుకు దెరువు కోసం 20ఏళ్ల క్రితం కాప్రాకు వలస వచ్చిందీ కుటుంబం. ఇటీవలే తండ్రి సత్తయ్య మరణించాడు. అప్పటి నుంచి ఏఎస్‌రావు నగర్‌లో మంగలి దుకాణం నిర్వహిస్తున్న రవి ఆ కుటుంబానికి పెద్దదిక్కయ్యాడు. తండ్రి సంపాదించిన ఇల్లు అమ్మి ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తల్లి, భార్యతో ఉంటున్నాడు.

దుకాణంలో రోజంతా పని చేసినా రూ.500 కూడా రావడం లేదని తన మిత్రులతో వాపోయేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బైక్‌పై షాప్‌కు బయలుదేరిన రవికి చందూలాల్‌ ఇంట్లో పేలుడు యమపాశంగా మారింది. ఈ పేలుడు ధాటికి ఇంటి గోడల శిథిలాలు ఎగిరొచ్చి అటుగా వెళ్తున్న రవి తలకు బలంగా తగిలాయి. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసి భార్య మాధవి, తల్లి పద్మ అక్కడికక్కడే కుప్ప కూలారు. తమకు అండగా ఉండాల్సినవాడు ఇక తిరిగిరాడని తెలిసి వారు విలపించిన తీరు అక్కడకు వచ్చిన వారిని కన్నీరు పెట్టించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement