
మృతుల దేహాల వద్ద రోదిస్తున్న బంధువులు
సాక్షి, నల్గొండ : జిల్లాలోని పీఏపల్లి మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే వ్యవసాయ పనులకు కూలీలతో బయల్దేరిన ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ఘటనలో 12 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
మద్దిపట్ల గ్రామం నుంచి పనులకు 30 మంది కూలీలు ట్రాక్టర్‌లో బయల్దేరారు. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. నిండు కుండలా ప్రవహిస్తున్న కాలువలో పడటంతో ఎక్కువ మంది ఊపిరాడక ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మృతులు రమావత్ సోనా, రమావత్ జీజా, జవుకుల ద్వాలి, రమావత్ కేలీ, రమావత్ కంసాలి, బాణవత్ బేరీ, రమావత్ భారతి, రమావత్ సురితలుగా గుర్తించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.