సాక్షి, విజయవాడ/కందుకూరు/పొన్నూరు(చేబ్రోలు): అగ్ని ప్రమాదం మృతుల్లో విజయవాడ వాసుల కంటే ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నారు. ఒక్కొక్కరి వద్ద రూ.లక్షకు పైగా బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యం కనీస భద్రత, సౌకర్యాలు కల్పించడంలో జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మృత్యువూ విడదీయలేని బంధం!
► జగ్గయ్యపేటకు చెందిన పాస్టర్ ఎస్.రత్న అబ్రహం ఆయన భార్య ఎస్.రాజకుమారిలకు ఒకేసారి కరోనా సోకడంతో పది రోజులక్రితం ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం అబ్రహాంకు, శనివారం రాజకుమారికి నెగెటివ్ వచ్చింది. ఆదివారం ఇద్దరినీ డిశ్చార్జ్ చేస్తామన్నారు. కలిసి ఇంటికి వెళ్లిపోవచ్చని అబ్రహం హాస్పిటల్‌లోనే ఉన్నాడు. చావులోనూ ఇద్దరూ కలిసే వెళ్లిపోయారు.
నెగిటివ్ వచ్చినా ప్రాణాలు దక్కలేదు!
► కృష్ణా జిల్లా కొడాలికి చెందిన పొట్లూరి పూర్ణచంద్రరావు(78)కు పదిరోజులక్రితం దగ్గు రావడంతో శ్రీకాకుళంలో స్వాబ్ పరీక్ష చేయించారు. రిపోర్టు వచ్చేలోగా అనారోగ్యం ఎక్కువ కావడంతో రమేష్ హాస్పిటల్‌కు తరలించి రూ.లక్షన్నర వరకు అడ్వాన్స్ చెల్లించారు. ఈలోగా స్వాబ్ టెస్ట్‌లో నెగిటివ్ అని వచ్చింది. రెండ్రోజుల్లో చికిత్స పూర్తవుతుందని చెప్పడంతో ఆగారు. అగ్ని ప్రమాదంలో పూర్ణచంద్రరావు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు తల్లడిల్లారు.
భార్య, కుమారుడిని కోల్పోయి...
► ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన దుడ్డు ప్రసాద్‌బాబుకు కరోనా సోకడంతో రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొంది రెండు రోజులక్రితం డిశ్చార్జి అయ్యారు. ఆయన భార్య వెంకట జయలక్ష్మి(48), పెద్ద కుమారుడు వెంకట నరసింహా పవన్‌కుమార్(30)లకు కరోనా పాజిటివ్ రావడంతో రూ.లక్షలు చెల్లించి అదే హాస్పిటల్‌లో చేర్పించారు. రెండు రోజుల్లో భార్య, కుమారుడు కులాసాగా ఇంటికొస్తారని భావిస్తున్న తరుణంలో చావు కబురు తెలిసి ప్రసాద్‌బాబు తల్లడిల్లుతున్నారు. పవన్‌కుమార్ పైనుంచి దూకడంతో ప్రాణాలు పోయాయంటున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న పవన్ లాక్‌డౌన్ వల్ల ఇంటికొచ్చి వర్క్‌ఫ్రం హోం చేస్తున్నాడు. ఆయన భార్య మౌనిక ఏడు నెలల గర్భిణి.
ఇంట్లో ఉన్నా ప్రాణాలు దక్కేవి....
► తన తండ్రికి కరోనా సోకడంతో హోమ్ క్వారంటైన్ కంటే ఆస్పత్రి బాగుంటుందని, వైద్య సిబ్బంది ఉంటారనే ధైర్యంతో చేర్పించామని ఓ మృతుడి కుమారుడు అశోక్ తెలిపారు. తనకు కరోనా సోకితే హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నానని, తన తండ్రి పెద్దవాడు కావడంతో ముందుజాగ్రత్తగా హాస్పిటల్‌లో చేర్పించామని వాపోయారు.
ప్రాణాలు కోల్పోయిన బాబూరావుకు నెగిటివ్..
► విజయవాడకు చెందిన సుంకర బాబూరావుకు దగ్గు రావడంతో నాలుగు రోజులక్రితం ఆస్పత్రిలో చేరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాబూరావును పరీక్షించిన ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆయనకు కరోనా లేదని నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చనిపోయిన 10 మందిలో 8 మందికి నెగిటివ్ అని తేలినట్లు సమాచారం.
పొగ కమ్మేసింది..
► గుంటూరు జిల్లా నిడుబ్రోలుకి చెందిన కొసరాజు స్వర్ణలత నాలుగు రోజులక్రితం అనారోగ్యంగా ఉండటంతో రమేష్ హాస్పటల్‌లోని బంధువులైన వైద్యులకు చూపించుకున్నారు. పరీక్షించిన వైద్యులు ఆమెను కోవిడ్ కేర్ సెంటర్‌కు రిఫర్ చేయడంతో అక్కడ చికిత్స పొందుతోంది. శనివారం రాత్రి భర్త, కుటుంబసభ్యులతో మాట్లాడి తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పిన స్వర్ణలత ఆదివారం ఉదయానికి విగతజీవిగా మారింది. ‘బాబూ.. హాస్పిటల్‌లో దట్టంగా పొగ కమ్మేసింది.. ఊపిరాడటం లేదు.. ప్రాణాలు పోయేటట్లున్నాయి’ అంటూ ఆదివారం ఉదయం కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది. అవే ఆమెకి చివరి మాటలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment