నెత్తురోడిన రోడ్లు | 3 People Died In DIfferent Road Accidents in Visakhapatnam | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

Published Fri, Jun 28 2019 11:58 AM | Last Updated on Fri, Jun 28 2019 11:58 AM

3 People Died In DIfferent Road Accidents in  Visakhapatnam - Sakshi

సాక్షి, ఆనందపురం (విశాఖపట్టణం) : స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలలో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని లొడగలవానిపాలెం గ్రామానికి చెందిన నమ్మి రాముకు (29) భోగాపురం మండలం, రావాడ గ్రామానికి చెందిన ఆదిలక్ష్మితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఆరేళ్ల పాప ఉంది. రాము తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా రాము బుధవారం రాత్రి వెల్లంకిలో ఉన్న మేనకోడలు ఇంటికి సైకిల్‌పై వెళ్లాడు. రాత్రి ఇంటికి రాలేదు. ఇదిలా ఉండగా గురువారం తెల్లవారుజామున ఆనందపురం ఫ్లై ఓవర్‌ కింద ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నట్టు నైట్‌ రౌండ్‌ పోలీసులు గుర్తించారు.

అయితే ఆ వ్యక్తి తలపై నుంచి గుర్తు తెలియని వాహనం వెళ్లి పోవడంతో ముఖం ఆనవాలు దొరకలేదు. దీంతో మృతుని జేబులోని విద్యుత్‌ బిల్లు ఆధారంగా లొడగలవానిపాలెం గ్రామానికి చెందిన నమ్మి రాముగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న భార్య ఆదిలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందింది తన భర్తేనని గుర్తించి కూలబడిపోయింది. ఇక తన కుటుంబానికి దిక్కెవరంటూ ఆదిలక్ష్మి రోదిస్తున్న తీరు పలువురిని కంట తడిపెట్టించింది. తల్లి ముత్తమ్మ కూడా వృద్ధాప్యంలో ఉంటూ రాము కష్టంపైనే ఆధారపడి జీవిస్తోంది. దీంతో తమ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారంటూ రోదిస్తున్నారు. ఎస్‌ఐ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో రాము మృతి చెందినట్టు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

జాతీయ రహదారిపై ఒకరు...
మండలంలోని జాతీయ రహదారిపై భీమిలి క్రాస్‌ రోడ్డుకు సమీపంలో జరిగిన ప్రమాదంలో గొంప అప్పారావు (46) అనే వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని గొంతినవానిపాలేనికి చెందిన అప్పారావు 30 ఏళ్ల క్రితం వివాహం చేసుకొని భార్యతో కొమ్మాది ప్రాంతానికి వలస వెళ్లి పోయాడు. వారికి ఒక పాప పుట్టి చనిపోయిన తర్వాత ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రోడ్డుపై నడిచి వెళ్తుండగా ఆనందపురం నుంచి విశాఖ వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

లారీ ఢీకొని దివీస్‌ ఉద్యోగి మృతి
తగరపువలస (భీమిలి): భీమిలి మండలం చిప్పాడ దివీస్‌ లేబొరేటరీ 8వ నంబర్‌ గేటు వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నింటి రామకృష్ణ(26) మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం వద్ద పొగిరి గ్రామానికి చెందిన రామకృష్ణ దివీస్‌ లేబరేటరీలో హెల్పర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం విధులు ముగించుకుని వస్తుండగా లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్టు భీమిలి ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement