అగ్ని ప్రమాదం జరిగిన భవనం. సంఘటన స్థలానికి వస్తున్న అగ్నిమాపక వాహనాలు
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని రాణి ఝాన్సీరోడ్డులో అనాజ్ మండీ ప్రాంతం. ఆ పరిసరాలన్నీ జనావాసాలతో ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. అక్కడే నాలుగు అంతస్తుల భవనంలో చిన్నా చితక తయారీ పరిశ్రమలున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 5 గంటలు దాటింది. ఇంకా చిమ్మచీకట్లు వీడిపోలేదు. ఇంతలో రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని జ్వాలలు అన్ని అంతస్తుల్లోకి పాకాయి. రేయింబవళ్లు పని చేసి అలసిపోయిన వలస కార్మికులు అక్కడే గాఢ నిద్రలో ఉన్నారు.
వారు నిద్రిస్తున్న గది చాలా చిన్నది. వెంటిలేషన్ కూడా సరిగా లేదు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగకమ్మేసింది. ఫలితంగా 43 మంది కార్మికులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ భవనంలో లగేజీ బ్యాగులు, ప్లాస్టిక్ బ్యాగుల వర్క్‌షాప్‌లున్నాయి. భవన యజమాని రెహాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఇరుకు వీధులే సహాయ కార్యక్రమాలకి అడ్డంకి
అగ్ని ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే 30 అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తేవడానికి, కార్మికుల్ని రక్షించడానికి 150 మంది అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఆ ఫ్యాక్టరీ చట్టవిరుద్ధంగా జనావాసాల మధ్య ఉండటంతో ఇరుకు సందుల్లోంచి ఘటనా స్థలానికి చేరుకోవడానికే అగ్నిమాపక సిబ్బంది తంటాలు పడ్డారు.
కిటికీ గ్రిల్స్ కట్ చేసి భవనం లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనలో 63 మందిని కాపాడారు. మంటల్లో చిక్కుకున్న వారు తప్పించుకోవడానికి భవనానికి వెంటిలేషన్ సౌకర్యాలే సరిగా లేవు. దీంతో తప్పించుకునే మార్గాలు లేక కార్మికులు అల్లాడిపోయారు.
షార్ట్ సర్క్యూటే కారణం
షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అంతే కాదు ఈ భవనంలో తగిన భద్రతా ఏర్పాట్లు లేవు. అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకోలేదు. భవనంలో అంతర్గత విద్యుత్ వ్యవస్థలో లోపాల కారణంగా ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ వెల్లడించింది.
కార్బన్‌మోనాక్సైడ్ వల్లే..
కర్మాగారంలో మంటల్ని అదుపులోకి తీసుకువచ్చాక నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఘటనాస్థలాన్ని పరిశీలించింది. అగ్నిప్రమాదం కారణంగా గాల్లో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా కలవడంతో ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండర్ ఆదిత్య ప్రతాప్ సింగ్ వెల్లడించారు. ప్లాస్టిక్, తోలు బ్యాగులు వంటివన్నీ మంటల్లో కాలడం వల్లనే కార్బన్ మోనాక్సైడ్ అధికంగా వెలువడిందని ఆయన వివరించారు.
తలుపు దగ్గర ఉన్నవారే సేఫ్
నాలుగు అంతస్తుల ఆ భవనంలో గదులకి తలుపులు, ఒకటి రెండు చోట్ల కిటికీలు తప్ప తప్పించుకోవడానికి మరో మార్గం లేదు. దీంతో తలుపులకి సమీపంలో నిద్రిస్తున్న వారు మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాదం నుంచి బయటపడిన ఫిరోజ్‌ఖాన్ కథనం ప్రకారం ‘ఒక గదిలో తలుపు దగ్గరే పడుకున్నా. మంటల సెగకు మెలకువ వచ్చింది. ప్రమాదాన్ని ఊహించాను. వెంటనే పక్కనే పడుకున్న నలుగైదుగురిని లేపి పరుగు పరుగున బయటకి వచ్చాం. ఇంకా చాలా మంది లోపలే ఉండిపోయారు‘‘అని చెప్పారు.
10 లక్షల ఎక్స్‌గ్రేషియా
ఢిల్లీ ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని పేర్కొంది. ఘటనా స్థలిని పరిశీలించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడినవారికి రూ.లక్ష సాయం ప్రకటించారు. ప్రభుత్వ ఖర్చుతో ఖరీదైన చికిత్స అందిస్తామని చెప్పారు.
అత్యంత భయానకమైంది: ప్రధాని మోదీ
ఢిల్లీ అగ్నిప్రమాదం అత్యంత భయానకమైందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందిస్తామని ప్రధాని కార్యాలయం మరో ట్వీట్‌లో వెల్లడించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్ర ప్రాణనష్టం జరగడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విచారం వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని తన సందేశంలో తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
ఉపహార్ నుంచి అనాజ్ మండీ వరకు..
1997, జూలై: ఢిల్లీలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన గ్రీన్ పార్క్ ఏరియాలోని ఉపహార్ థియేటర్‌లో సన్ని డియోల్ నటించిన బోర్డర్ సినిమా మధ్యాహ్నం ఆట ప్రదర్శిస్తుండగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 59 మంది మంటల్లో బుగ్గయిపోతే, 100 మందికిపైగా గాయపడ్డారు.
2018 జనవరి: వాయవ్య ఢిల్లీలో బాణాసంచా కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది మరణించారు.
2019, ఫిబ్రవరి: సెంట్రల్ ఢిల్లీ కరోల్‌బాగ్ ప్రాంతంలో అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది అగ్నికి ఆహుతయ్యారు.
2019, డిసెంబర్: ఉత్తర ఢిల్లీలో అనాజ్ మండీ ప్రాంతంలో కర్మాగారం అగ్ని ప్రమాదంలో 43 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment