separate road accidents
-
పండుగ ముందు పెను విషాదం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మరణించారు. పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం బయలుదేరిన కూలీలు గమ్యం చేరకముందే అనంతలోకాలకు చేరుకున్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకొని సోదరుడితో తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆ ఇద్దరు యువకులు మరణించగా.. స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొనటంతో భార్య కళ్లెదుటే భర్త దుర్మరణం చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు చనిపోయారు. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొన్నది.ఐదుగురు వలస కూలీలు దుర్మరణంరోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాకు చెందిన 32 మంది వలస కూలీలు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుప్త ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్‌కు గురువారం సాయంత్రం 4 గంటలకు బయలు దేరారు.ఐలాపురం గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరు నుంచి సంగారెడ్డికి వెళ్తున్న ఇసుక లారీ టైరు పంక్చర్ కావడంతో పక్కకు నిలిపారు. ఆ లారీని ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ గరడ సునీల్ (40), ఒడిశాకు చెందిన కూలీలు రూపు హరిజన్ (51), సుల హరిజన్ (46), సునమని హరిజన్ (61) అక్కడికక్కడే మృతిచెందగా, ప్రత్యూష్ ప్రభాత్ హరిజన్ (17) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. బస్సు ఢీకొట్టిన వేగానికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. జన్మదినం రోజే మృత్యు ఒడిలోకి..పెద్దపల్లి మండలం రంగాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన అనవేన అభిలాష్ (19), కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేటకు చెందిన చుంచు రాజ్‌కుమార్ (20) మరణించారు. వీరిద్దరూ అక్కాచెల్లెళ్ల కొడుకులు. చుంచు రాజ్‌కుమార్ జన్మదినం కావడంతో అప్పన్నపేటలోని అభిలాష్‌తో కలిసి బైక్‌పై గుండారంలోని స్నేహితుల వద్దకు వెళ్లారు. అక్కడ వేడుక చేసుకొని తిరిగి వస్తుండగా రంగాపూర్ శివారులో ట్రాన్స్‌కోకు చెందిన బొలేరో వాహనాన్ని బైక్‌తో బలంగా ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో అభిలాష్ అక్కడికక్కడే మరణించగా, రాజ్‌కుమార్‌ను కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. జగిత్యాల – ధర్మపురి జాతీయ రహదారిపై తక్కళ్లపల్లి శివారులో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన బూతగడ్డ అరవింద్ (21), బత్తుల సాయి (22), మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దయ్యాల వంశీ (22) దుర్మరణం చెందారు. వంశీ 15 రోజుల క్రితమే దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మనుమడి బారసాలకు వెళ్లి వస్తూ.. మనుమడి బారసాల వేడుకలు జరుపుకొని తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ – సూర్యాపేట రహదారిపై కొడకండ్ల మండలం మైదంచెరువు తండ వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. నాగారం మండలం ఈటూరుకు చెందిన పేరాల వెంకన్నలక్ష్మి దంపతుల కుమారుడైన యుగంధర్‌కు కుమారుడు జన్మించగా గురువారం దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో బారసాల వేడుక జరిగింది.ఈ వేడుకకు వెంకన్న కుటుంబసభ్యులు, బంధువులంతా తుఫాన్ వాహనంలో వెళ్లారు. వేడుకల అనంతరం అదే వాహనంలో రాత్రి ఈటూరుకు తిరిగి వస్తుండగా మైదంచెరువు తండా శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉన్న డీసీఎం వాహనాన్ని తుపాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పేరాల వెంకన్న (45) అతని తమ్ముడి భార్య పేరాల జ్యోతి (35) అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడ్డ పేరాల ఊషయ్య, పేరాల లక్ష్మి, వంగూరి నర్సమ్మ, పేరాల లావణ్య, ఉప్పలమ్మ, ముత్యాలును జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పేరాల లక్ష్మి, పేరాల ఊషయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. స్నేహితులను కబలించిన లారీ మెదక్ జిల్లా నర్సాపూర్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మరణించారు. శివ్వంపేట మండలం అల్లీపూర్‌కు చెందిన పిట్ల నాగరాజు (25), కమ్మరి దుర్గాప్రసాద్(25) స్నేహితులు. నాగరాజు తాను పనిచేసే కొంపల్లిలోని ఓ పౌల్ట్రీ కార్యాలయానికి దుర్గాప్రసాద్‌తో కలసి బైక్‌పై వెళ్లాడు. తిరిగి వస్తుండగా నర్సాపూర్ ఎస్బీఐ సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు తుదిశ్వాస విడిచాడు. ఈ రెండు కుటుంబాలకు వీరు ఒక్కొక్కరే సంతానం కావటం గమనార్హంభార్య కళ్లెదుటే భర్త మృతిస్కూటీని లారీ ఢీకొట్టడంతో భార్య కళ్లెదుటే భర్త మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన ఎర్రవెళ్లి బాలకిష్టయ్య (59)కు బెజ్జంకి మండలం గుగ్గిళ్లకు చెందిన ఓ వ్యక్తితో వ్యవసాయ బావి విషయంలో భూ వివాదం ఉంది. వివాదం పరిష్కారం కోసం 20 రోజులుగా కలెక్టరేట్ చుట్టూ దంపతులిద్దరూ తిరుగుతున్నారు. శుక్రవారం అదే పని మీద వీరు స్కూటీపై కలెక్టరేట్‌కు వెళ్తుండగా, కలెక్టరేట్ ఎదుట వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి.. స్కూటీని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. తీవ్ర గాయాలై బాలకిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న రేణుకకు స్వల్ప గాయాలయ్యాయి. రేణుక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిశీధిలో ఘోరం
నిశీధిలో నెత్తురోడిన రహదారులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం పీఏపల్లి, నార్కట్‌పల్లి మండలాల్లో దుర్ఘటనలు పుణ్యక్షేత్రాలకు వెళ్లొస్తున్న ఓ కుటుంబాన్ని మార్గమధ్యలో మృత్యువు వెంటాడింది. మితిమీరిన వేగం.. ఆపై నిద్రమత్తు.. రెప్పపాటులో ఇద్దరిని కానరాని లోకాలకు తీసుకెళ్లింది. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో బుధవారం తెల్లవారుజామున లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన సింగిరెడ్డి భారతి రెడ్డి(62), వినయక్ శివరాంజురే(47) మృత్యువాత పడగా, మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. - నార్కట్‌పల్లి నిబంధనలు అతిక్రమించి బైక్‌పై ప్రయాణిస్తున్న నలుగురిని మృత్యువు కబళించింది. మరో పది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనేలోగానే కారు వారి ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపేసింది. మితిమీరిన వేగం.. అజాగ్రత్త.. నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. పీఏపల్లి మండలం చిలకమర్రి స్టేజీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో పీఏపల్లి మండలం నేనావత్‌తండాకు చెందిన వడ్త్య భాస్కర్ (25), నెహ్రూ (19),డప్పు శివ (20)తోపాటుత్రిపురారం మండలం మాటూర్కు చెందిన రమావత్ లక్పతి (30) మృత్యువాత పడ్డారు. - దేవరకొండ అతివేగం..అజాగ్రత్త.. నిర్లక్ష్యం..నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణం...ఇవే ప్రమాదాలకు హేతువవుతాయి. పీఏపల్లి మండలం చిల్కమర్రి సమీపంలో నాగార్జునసాగర్- హైదరాబాద్ రాష్ట్ర రహదారి, నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై ఎల్లారెడ్డిగూడెం సమీపంలో మంగళ,బుధవారాల్లో చోటుచేసుకున్న ప్రమాదాలకు ఇవే కారణాలని తెలుస్తోంది. రాత్రి వేళ, అందులోనూ నిద్రమత్తు కళ్లు మూసి తెరుచుకునేలోపలే ఆరుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో కొరవడిన అవగాహన లోపంతోనే జిల్లాలోని రహదారులపై నెత్తుటి మరకలు ఆరడం లేదని స్పష్టమవుతోంది. దేవరకొండ / నార్కట్‌పల్లి పీఏపల్లి మండలం నేనావత్‌తండాకు చెందిన వడ్త్య భాస్కర్ (25), త్రిపురారం మండలం మాటూర్కు చెందిన రమావత్ లక్పతి (30) బంధువులు. భాస్కర్ సోదరుడు సురేష్ హైదరాబాద్‌లో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ తమ బంధువైన లక్పతి వద్ద గతంలో నగదును అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పులో కొంత రుణం చెల్లిస్తానని సురేష్ చెప్పడంతో మంగళవారం లక్పతి, భాస్కర్ హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ సురేష్ వద్ద నగదు తీసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లికి బస్సులో వచ్చారు. చీకటి పడటం, తండాకు వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో వారిని తీసుకెళ్లేందుకు వడ్త్య నెహ్రూ(19), డప్పు శివ(20)లు బైక్‌పై తండా నుంచి కొండమల్లేపల్లికి వచ్చారు. అనంతరం నలుగురు అదే బైక్‌పై 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేనావత్‌తండాకు బయల్దేరారు. అయితే కారణాలు స్పష్టంగా తెలియకున్నా పీఏపల్లి మండలం చిల్కమర్రి స్టేజీ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న గుడిపల్లి పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బుధవారం ఉదయం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు భాస్కర్, లక్పతిలకు వివాహం కాగా నెహ్రూ, శివలు అవివాహితులు. శివ నల్లగొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, భాస్కర్, నెహ్రూ, లక్పతిలు కూలీ పని చేస్తూ జీవనం కొనసాగించేవారు. భాస్కర్, లక్పతిలకు మూడేళ్ల లోపు కుమారులున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిన్నంటిన రోదనలు ఒకే నేనావత్ తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తండా శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న బం దువులు బుధవారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన బంధువులు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు ఆసుపత్రిలో మిన్నంటాయి. జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే పరామర్శ చిల్కమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వడ్త్య భాస్కర్, వడ్త్య నెహ్రూ, డప్పు శివ, లక్పతిల మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు బుధవారం సందర్శించా రు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను వారు పో లీసులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. ఆరని నెత్తుటి మరకలు చింతపల్లి : మితిమీరిన వేగానికి నిర్లక్ష్యం తోడవడంతో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై నెత్తుటి మరకల తడి ఆరడం లేదు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా పుష్కర పనులు కొనసాగిస్తుండడం కూడా ప్రమాదాలకు ఓ కారణంగా చెప్పవచ్చు. రెండు నెలల వ్యవధిలో ఈ రోడ్డుపై పదకొండు మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట ఈ రహదారిపై చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళన కలిగిస్తున్నాయి. నిత్యం రద్దీగా.. ప్రతి రోజూ వందల సంఖ్యలో లారీలు, ఆటోలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలతో నాగార్జునసాగర్ - హైదరాబాద్ రాష్ట్ర రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు, నెల్లూరు, మాచర్ల, పొదిలి, ఒంగోలు, ప్రకాశం, దేవరకొండ, కొండమల్లేపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలతో రహదారి రద్దీగా దర్శనమిస్తోంది. ప్రైవేట్వాహన చోదకులు రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలను వేగంగా నడుపుతుండటమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదాలన్నింటికీ అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. రెండు నెలల కాలంగా ఈ రోడ్డుపై పుష్కర పనులు సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పనులు జరుగుతున్న కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చింతపల్లి మండల పరిధిలోనే రెండు నెలల కాలంలో 8 ప్రమాదాలు జరుగగా 9 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. సుమారు 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
గుర్ల: గుర్ల మండల కేంద్రంలోని జాతీయ రహదారి సోమవారం రక్తసిక్తమైంది. జాతీయ రహదారిపై వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో మోటార్ సైకిళ్లపై వెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందారు. శుభకార్యానికి వెళ్లి వస్తూ.. నెల్లిమర్లలో గల రామతీర్థం జంక్షన్‌కు దగ్గరలో నివాసముంటున్న పొట్నూరు రమణ ఆదివారం ఉదయం శుభకార్యం నిమిత్తం గుర్ల మండలంలోని పల్లిగండ్రేడు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సాయంత్రం నాలుగు గంటలకు నెల్లిమర్ల తిరుగు ప్రయాణంలో మోటారు సైకిల్‌పై వెళ్తుండగా కెల్ల బ్రిడ్జి వద్ద బైక్ అదుపుతప్పి గెడ్డ కింద తుప్పల్లో పడి మృతి చెందాడు. పొట్నూరు రమణ (35), ఇంటికి చేరకపోవడంతో అతని తండ్రి అప్పన్న పల్లి గండ్రేడు లో ఉన్న బంధువులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నారు. రాత్రి ఎనిమిది గంటలు దాటిన తరువాత కూడా రమణ సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బంధువులు, తండ్రి కలిసి వెదకడం ప్రారంభించారు. ఈ క్రమంలో కెల్ల గెడ్డ బ్రిడ్జి వద్ద విగతజీవిగా పడి ఉన్న రమణను సోమవారం ఉదయం గుర్తించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడు రమణ, అతను నడుపుతున్న బైకును పరిశీ లించారు. అనంతరం శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. కుటుంబానికి ఆధారం పోయి.. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపో యాడన్న వార్త తెలియడంతో మృతుని భార్య సత్యవ తి, పిల్లలు కిరణ్, మణి కుటుంబసభ్యులు శోకసంద్రం లో మునిగిపోయారు. ఇంటి పెద్ద దిక్కు, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మృత్యువాత పడడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నెల్లిమర్ల మండలంలోని కుదిపి గ్రామానికి చెందిన రమణ ఉద్యోగరీత్యా కొంత కాలంగా నెల్లిమర్లలో కాపురముంటున్నారు. మిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ యూనియ న్ బాధ్యతలు చేపట్టి అందరి మన్ననలు పొందాడు. రమణ మృతి చెందాడన్న వార్త తెలియడంతో మిమ్స్ ఆస్పత్రి ఉద్యోగులు, బంధువులు అంతా సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తన స్కూల్‌ను చూసుకోవడానికి వెళ్తూ.. బాడంగి మండలం, గూడెపువలస గ్రామానికి చెందిన భూపతిరాజు వేణుగోపాలరాజు(48) పూసపాటి రేగ మండలం కుమిలి గ్రామంలో నిర్వహిస్తున్న సత్యాస్ భారతి ప్రైవేట్ స్కూల్‌ను సందర్శించేందుకు మోటారు సైకిల్‌పై వెళ్తుండగా,మండలంలోని గూడెం జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటనలో మృతుడు నుజ్జునుజ్జయి పోవడంతో శరీరంలోని భాగాలన్నీ చెల్లా చెదురయ్యాయి. ఈ ప్రమాద ఘటన చూపరుల హృదయాలను కలిచివేసిం ది. స్థానిక పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. వేణుగోపాల రాజు స్వగ్రామం నుంచి బైక్‌పై బయలుదేరి పాలకొండ, విజయనగరం ప్రధాన రహదారిలోని గూడెం జంక్షన్ వద్ద ముందుగా వెళ్తున్న విశాఖ డైరీ పాలట్యాంకరును తప్పించుకుని ముందుకు వెళ్తుండగా ట్యాంకరు కింద పడి మృత్యువాత పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసునమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేంద్రాస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ వివరాలివి.. మృతుడు వేణుగోపాలరాజుకు భార్య సత్యవతి, సుమంత వర్మ, షరత్ వర్మ అనే ఇద్దరు కుమారులు న్నారు. ఆయన తండ్రి భూపతిరాజు వెంకటపతిరాజు గూడెపు వలస గ్రామ సర్పంచ్. మృతి చెందిన భూపతి రాజు ఆ గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు. వేణుగోపా లరాజు తాను స్కూల్ నిర్వహిస్తున్న కుమిలిలోని కోవెళ్లకు తన సోదరుడి (ప్రభుత్వశాఖలో ఉన్నత ఉద్యోగి)తో కలిసి మరమ్మతులు చేపట్టారని ఆ గ్రామస్తులు తెలిపారు.