నిశీధిలో ఘోరం | Six killed in separate road accidents | Sakshi
Sakshi News home page

నిశీధిలో ఘోరం

Published Thu, Jul 14 2016 2:53 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

నిశీధిలో ఘోరం

నిశీధిలో ఘోరం

నిశీధిలో నెత్తురోడిన రహదారులు
 వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం
 పీఏపల్లి, నార్కట్‌పల్లి మండలాల్లో దుర్ఘటనలు


పుణ్యక్షేత్రాలకు వెళ్లొస్తున్న ఓ కుటుంబాన్ని మార్గమధ్యలో మృత్యువు వెంటాడింది. మితిమీరిన వేగం.. ఆపై నిద్రమత్తు.. రెప్పపాటులో ఇద్దరిని కానరాని లోకాలకు తీసుకెళ్లింది. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో బుధవారం తెల్లవారుజామున లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన సింగిరెడ్డి భారతి రెడ్డి(62), వినయక్ శివరాంజురే(47) మృత్యువాత పడగా, మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు.  - నార్కట్‌పల్లి
 
 నిబంధనలు అతిక్రమించి బైక్‌పై ప్రయాణిస్తున్న నలుగురిని మృత్యువు కబళించింది. మరో పది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనేలోగానే కారు వారి ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపేసింది. మితిమీరిన వేగం.. అజాగ్రత్త.. నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. పీఏపల్లి మండలం చిలకమర్రి స్టేజీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో పీఏపల్లి మండలం నేనావత్‌తండాకు చెందిన వడ్త్య భాస్కర్ (25), నెహ్రూ (19),డప్పు శివ (20)తోపాటుత్రిపురారం మండలం మాటూర్‌కు చెందిన రమావత్ లక్పతి (30) మృత్యువాత పడ్డారు.
 - దేవరకొండ
 
 అతివేగం..అజాగ్రత్త.. నిర్లక్ష్యం..నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణం...ఇవే ప్రమాదాలకు హేతువవుతాయి. పీఏపల్లి మండలం చిల్కమర్రి సమీపంలో నాగార్జునసాగర్- హైదరాబాద్ రాష్ట్ర రహదారి, నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై ఎల్లారెడ్డిగూడెం సమీపంలో మంగళ,బుధవారాల్లో చోటుచేసుకున్న ప్రమాదాలకు ఇవే కారణాలని తెలుస్తోంది. రాత్రి వేళ, అందులోనూ నిద్రమత్తు కళ్లు మూసి తెరుచుకునేలోపలే ఆరుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో కొరవడిన అవగాహన లోపంతోనే జిల్లాలోని రహదారులపై నెత్తుటి మరకలు ఆరడం లేదని స్పష్టమవుతోంది.     దేవరకొండ / నార్కట్‌పల్లి
 
  పీఏపల్లి మండలం నేనావత్‌తండాకు చెందిన వడ్త్య భాస్కర్ (25), త్రిపురారం మండలం మాటూర్‌కు చెందిన రమావత్ లక్పతి (30) బంధువులు. భాస్కర్ సోదరుడు సురేష్ హైదరాబాద్‌లో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ తమ బంధువైన లక్పతి వద్ద గతంలో నగదును అప్పుగా తీసుకున్నారు.
 
 తీసుకున్న అప్పులో కొంత రుణం చెల్లిస్తానని సురేష్ చెప్పడంతో మంగళవారం లక్పతి, భాస్కర్ హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ సురేష్ వద్ద నగదు తీసుకుని  మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లికి బస్సులో వచ్చారు.  చీకటి పడటం, తండాకు వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
 
  దీంతో వారిని తీసుకెళ్లేందుకు వడ్త్య నెహ్రూ(19), డప్పు శివ(20)లు బైక్‌పై తండా నుంచి కొండమల్లేపల్లికి వచ్చారు. అనంతరం నలుగురు అదే బైక్‌పై 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేనావత్‌తండాకు బయల్దేరారు. అయితే కారణాలు స్పష్టంగా తెలియకున్నా పీఏపల్లి మండలం చిల్కమర్రి స్టేజీ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
 
 సమాచారం అందుకున్న గుడిపల్లి పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు.  పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బుధవారం ఉదయం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు భాస్కర్, లక్పతిలకు వివాహం కాగా నెహ్రూ, శివలు అవివాహితులు. శివ నల్లగొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, భాస్కర్, నెహ్రూ, లక్పతిలు కూలీ పని చేస్తూ జీవనం కొనసాగించేవారు. భాస్కర్, లక్పతిలకు మూడేళ్ల లోపు కుమారులున్నారు.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
 
 మిన్నంటిన రోదనలు
 ఒకే నేనావత్ తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తండా శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న బం దువులు బుధవారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన బంధువులు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు ఆసుపత్రిలో మిన్నంటాయి.
 
 జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే పరామర్శ
 చిల్కమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వడ్త్య భాస్కర్, వడ్త్య నెహ్రూ, డప్పు శివ, లక్పతిల మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు బుధవారం సందర్శించా రు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను వారు పో లీసులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు.    
 
 ఆరని నెత్తుటి మరకలు
 చింతపల్లి  : మితిమీరిన వేగానికి నిర్లక్ష్యం తోడవడంతో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై నెత్తుటి మరకల తడి ఆరడం లేదు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా పుష్కర పనులు కొనసాగిస్తుండడం కూడా ప్రమాదాలకు ఓ కారణంగా చెప్పవచ్చు. రెండు నెలల వ్యవధిలో ఈ రోడ్డుపై పదకొండు మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట  ఈ రహదారిపై చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళన కలిగిస్తున్నాయి.
 
 నిత్యం రద్దీగా..
 ప్రతి రోజూ వందల సంఖ్యలో లారీలు, ఆటోలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలతో నాగార్జునసాగర్ - హైదరాబాద్ రాష్ట్ర రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు, నెల్లూరు, మాచర్ల, పొదిలి, ఒంగోలు, ప్రకాశం, దేవరకొండ, కొండమల్లేపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలతో రహదారి రద్దీగా దర్శనమిస్తోంది. ప్రైవేట్‌వాహన చోదకులు రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలను వేగంగా నడుపుతుండటమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదాలన్నింటికీ అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది.
 
 రెండు నెలల కాలంగా ఈ రోడ్డుపై పుష్కర పనులు సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పనులు జరుగుతున్న కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చింతపల్లి మండల పరిధిలోనే రెండు నెలల కాలంలో  8 ప్రమాదాలు జరుగగా 9 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. సుమారు 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement