Narkatpalli
-
శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు
సాక్షి, నార్కట్‌పల్లి(నల్గొండ) : హర హర మహాదేవ.. శంభో శంకర.., ఓం నమః శివాయ.. అంటూ శివనామస్మరణ మిన్నంటింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమం వైభవంగా సాగింది. ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ, అర్చకులు సతీష్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ, సురేష్, పవన్, సిద్దులు వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి గరుడ వాహనంపై స్వామి వారిని, వీరమూర్తి ప్రభను అగ్నిగుండం వరకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్నిగుండాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు భక్తి శ్రద్ధతో ఓం నమః శివాయ.. హర హర మహాదేవ.. శంభో శంకర అంటూ.. అగ్నిగుండం నుంచి నడుచుకుంటూ వెళ్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా హాజరయ్యారు. శివసత్తుల ప్రత్యేక పూజలు.. స్వామి వారి అగ్ని గుండాలకు శివసత్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేసి అగ్నిగుండంలో నడిచారు. ఈ సందర్భంగా ఉత్సాహంగా నృత్యాలు చేశారు. భక్తులు వారితో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, దేవాలయ అబివృద్ధి కమిటీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, తహసీల్దార్ రాధ, ఎంపీడీఓ సాంబశివరావు, ఈఓ అన్నెపర్తి సులోచన, సర్పంచ్ మల్గ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోలీసు భారీ బందోబస్తు.. అగ్ని గుండాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి పర్యవేక్షణలో సీఐ శంకర్‌రెడ్డి, ఎస్ఐ విజయ్‌కుమార్‌తో పాటు పోలీసు బృందంతో ప్రత్యేక చర్యలు తీసుకుని అగ్ని గుండంలో నడిచే వారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ హయాంలోనే ఆలయాల అభివృద్ధి నార్కట్‌పల్లి : రాష్ట్రంలోని దేవాలయాలు టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన గట్టుకు విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ అర్చకులు మంత్రితో పాటు నూతన కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డికి పూర్వకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినదని.. ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి రూ.2.50 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ ఆలయ చైర్మన్ మల్లికార్జున్‌రెడ్డి, ఈఓ సులోచన మంత్రికి విన్నవించారు. స్పందించిన ఆయన త్వరలో నిధులు మంజూరీకి కృషి చేస్తానన్నారు. కార్యక్రమలలో జేసీ చంద్రశేఖర్, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు చిన్న వెంకట్‌రెడ్డి, సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అడ్డొచ్చిన వరాహాన్ని తప్పించబోయి అదుపుతప్పి..
సాక్షి, మిర్యాలగూడ: తమ ఆరాధ్య దైవాన్ని ప్రతి యేడు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆ.. గిరిజనులకు ఆనవాయితీ.. అందులో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు గిరిజనులు తమ బంధువులతో కలిసి శనివారం ఇష్ట దైవాన్ని దర్శించుకుని రాత్రి అక్కడే గడిపారు. మరుసటిరోజు మధ్యాహ్నం తిరిగి తమ స్వగ్రామాలకు టాటాఏస్ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యలో అడ్డొచ్చిన వరాహాన్ని తప్పించే క్రమంలో వాహనం అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ దుర్ఘటనలో వృద్ధ దంపతులు మృత్యుఒడికి చేరుకోగా.. టాటాఏస్ డ్రైవర్‌తో సహా పదిమందికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్‌పల్లి– అద్దంకి బైపాస్‌పై ఆదివారం చోటు చేసుకుంది. క్షతగాత్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం కంచెల్‌తండాకు చెందిన వృద్ధ దంపతులు ధీరావత్ లక్పతి(75), ధీరావత్ దోర్జన్ (64), ధీరావత్ గున్య, ధీరావత్ సక్రి, ధీరావత్ రాజు, ధీరావత్ రోహిత్, ధీరావత్ చింటు, తుర్కపల్లి మండలం సంగెం తండాకు చెందిన లకావత్ వస్రాం, లకావత్ సోను, లకావత్ వినోద్‌తో పాటు చికటిమామిడి గ్రామానికి చెందిన ధీరావత్ గణేష్ బంధువులు. వీరు ప్రతియేడు నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్లెపల్లి మైసమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అందులో భాగంగానే వీరందరూ తుర్కపల్లి మండలం సంగెంతండాకు చెందిన లకావత్ వెంకటేశ్ టాటాఏస్ వాహనాన్ని కిరాయికి మాట్లాడుకుని శనివారం కల్లెపల్లికి వచ్చారు. మైసమ్మ తల్లికి యాటను బలిచ్చి విందు చేసుకుని రాత్రి అక్కడే బసచేశారు. ధీరావత్ దోర్జన్, ధీరావత్ లక్పతి మృతదేహం వరాహాన్ని తప్పించే క్రమంలో.. ఇష్టదైవాన్ని దర్శించుకుని రాత్రి అక్కడే గడిపిన బంధువులందరూ ఆదివారం మధ్యాహ్నం టాటాఏస్ వాహనంలో స్వగ్రామాలకు బయలుదేరారు. మార్గమధ్యలో వీరి వాహనానికి మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్‌పల్లి– అద్దంకి బైపాస్ రోడ్డుపైకి ఒక్కసారిగా వరాహం అడ్డుగా వచ్చింది. దీంతో టాటాఏస్ డ్రైవర్ లకావత్ వెంకటేశ్ దానిని తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమయంలో అతివేగంతో ఉన్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంటపొలాల్లో బోల్తాకొట్టింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సదానాగరాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలిని పరింశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానికులతో పాటు డ్రైవర్ వెంకటేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. వరాహాన్ని తప్పించే క్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుందని టాటాఏస్ డ్రైవర్ పోలీసు అధికారులకు వివరించాడు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. చెల్లాచెదురుగా.. అప్పటి వరకు ఆనందంగా మాట్లాడుకుంటూ ప్రయాణిస్తున్న వారు అనుకోని హఠాత్పరిణామానికి హతాశులయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే టాటాఏస్ వాహనంలో ఉన్న వారందరూ చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బొమ్మల రామారం మండలం కంచెల్‌తండాకు చెందిన వృద్ధ దంపతులు ధీరావత్ లక్పతి(75), ధీరావత్ దోర్జన్ (64) అక్కడికక్కడే దుర్మరణం చెందగా డ్రైవర్‌తో సహా మిగిలిన వారందరూ గాయపడ్డారు. ప్రమాద ఘటనను గమనించిన స్థానికులు 108 వాహన సహాయంతో వారిని తొలుత స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం వారిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతున్నారు. కాగా, చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. -
మైసయ్య.. ఇదేందయ్యా!
సాక్షి, యాదాద్రి: సెల్‌ఫోన్ మాట్లాడుతూ.. వాహనం నడపడం ప్రమాదకరం అని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా జనాల్లో మార్పు రావడం లేదు. సొంత వాహనాలను నడిపేవారి గురించి మనం చెప్పలేం. కానీ ప్రజా రవాణ వ్యవస్థలో పని చేస్తున్న డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. సెల్ఫోన్లో మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తే ఎలాంటి దారుణాలు జరుగుతాయో అందరికి తెలిసిందే. కొండగట్టు లాంటి బస్సు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా ఓ కారణం. అయితే ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా డ్రైవర్లలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ.. బస్సు నడుపుతున్న సంఘటన ఒకటి వెలుగు చూసింది. వివరాలు.. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి నల్లగొండ వెళ్లే నార్కట్‌పల్లి డిపోకు చెందిన ఏపీ 21 జడ్ 208 ఆర్టీసీ బస్సు డ్రైవర్ మైసయ్య ఫోన్లో మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తూ కెమరాకు చిక్కాడు. బస్సులో పదుల సంఖ్యలో ఉన్న ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి.. తన పాటికి తాను మొబైల్లో రియల్ ఎస్టెట్ వ్యాపారం గురించి చర్చిస్తూ.. బస్సు నడుపుతున్నాడు మైసయ్య. మైసయ్య వైఖరికి బస్సులో ఉన్న ప్రయాణికులు హడలిపోయారు. ఓ ప్రయాణికుడు దీన్ని వీడియో తీయడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. అయితే మైసయ్య ప్రవర్తన పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవరన్నా.. ప్రమాదం జరిగితే నీ ఇంటితో పాటు ప్రయాణికుల ఇళ్లు కూడా మునుగుతాయ్ జర భద్రం అంటూ కామెంట్ చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బైక్ నడుపుతూ.. మొబైల్ ఫోన్ మాట్లాడితే.. రూ. 2 వేలు జరిమానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. మరి ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దాం అంటున్నారు. ఈ సంఘటనపై నార్కట్ పల్లి డిపో మేనేజర్ స్పందించాల్సి ఉంది. -
ఓట్ల పండుగకు.. పయనం..
సాక్షి, చౌటుప్పల్ (మునుగోడు): హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి బుధవారం జనజాతరను తలపించింది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజానీకం పెద్దఎత్తున తమ స్వగ్రామాలకు తరలివెళ్తోంది. దీంతో హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది. రాత్రికి అనూహ్యంగా రెండింతలకు పెరిగింది. టోల్‌ప్లాజా నుంచి కిలోమీటరున్నర దూరంలో ఉన్న జిల్లేడుచెలుక గ్రామం వరకు వాహనాలు స్తంభించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ మినహా.. మిగతా 9 జిల్లాల ప్రజానీకం ఈ రహదారి మీదుగానే వెళ్తుంటారు. వేలాది వాహనాలు ఒక్కసారిగా వస్తుండడంతో చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై విజయవాడ మార్గంలో ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారికి అనుసం«ధానంగా నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి సైతం ఉండడంతో రద్దీ భారీగా ఏర్పడింది. పంతంగి టోల్‌ప్లాజా పరిసరాలు వాహనాలతో కిక్కిరిసాయి. ఇరువైపులా 16ద్వారాలు ఉండగా విజయవాడ వైపు 11 గేట్లు తెరిచా రు. వాహనాలు ఎక్కువసేపు నిలిచి ఉండడంతో.. వాహనదారులు, టోల్ సిబ్బంది నడుమ ఘర్షణ తలెత్తింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్దుమనిగింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఏర్పడే రద్దీతో పోలిస్తే ప్రస్తుతం ఏర్పడిన రద్దీ ఎక్కువే అని చెప్పవచ్చు. హైవేపై వాహనాల రద్దీ కేతేపల్లి (నకిరేకల్) : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్వస్థలాలకు వెళ్లవారి వాహనాలతో 65 నంబరు జాతీయ రహదారిపై బుధవారం రద్దీ కొనసాగింది. జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ప్రారంభమైన వాహనాల రద్దీ రాత్రికి పెరిగింది. కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ఫీజు చెల్లించేందుకు వాహనాలు బారులుదీరాయి. వాహనాల రద్దీకి అనుగుణంగా టోల్‌ప్లాజా నిర్వహకులు విజయవాడ వైపు కౌంటర్లు పెంచారు. దీంతో టోల్‌ప్లాజా వద్ద ఎలాంటి ట్రాఫిక్‌జామ్‌కు ఆస్కారం లేకుండా వాహనాలు సాఫీగా వెళ్లాయి. మాడ్గులపల్లి వద్ద ట్రాఫిక్ జామ్ మాడుగులపల్లి (నల్లగొండ) : ఈనెల 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు హైదరబాద్‌లో నివాసవుంటున్న ఆంధ్ర ప్రజలు బుధవారం సొంతూళ్లకు ప్రయాణా కావడంతో.. అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై మాడ్గులపల్లి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సుమారు కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
రియల్.. ఫేక్ న్యూస్!
సాక్షిప్రతినిధి, నల్లగొండ/నార్కట్‌పల్లి: ఓ భక్తి చానల్లో ప్రసారమైన ఒక ఫేక్ వార్త నాలుగు రాష్ట్రాల్లోని భక్తులకు చిక్కులు తెచ్చిపెట్టింది. అమావాస్య రోజైన బుధవారం నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి గుట్ట మీద ఉన్న శ్రీవారిజాల వేణుగోపాలస్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చెప్పడంతో ఆ ఆలయానికి భక్తులు పోటెత్తారు. 89 ఏళ్లకొకసారి ఇలాంటి ముహూర్తం ఉంటుందని ఈ సమయంలో స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఆ చానల్లో జ్యోతిష్యుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ చెప్పడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచే ఆ ఆలయానికి లక్షల్లో భక్తులు చేరుకున్నారు. దేవస్థానానికి పోటెత్తిన భక్తులు తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలిరావడంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 4 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని సమాచారం. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆలయాన్ని మూసివేసినా ఆలయ గోడలు దూకి భక్తులు లోనికి ప్రవేశించారు. దేవాలయం చుట్టుపక్కల భూములను అధిక ధరలకు అమ్ముకునేందుకే ఇలాంటి ప్రచారం చేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై నల్లగొండ జన విజ్ఞాన వేదిక, మరికొందరు భక్తులు ఫిర్యాదు చేయడంతో నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. గుర్తించే పనిలో ఉన్నాం: నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ ఒక్కసారిగా దాదాపు 4 లక్షల మంది భక్తులు ఆలయానికి రావడం అనుమానంగా ఉంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో కేసులు నమోదు చేశాం. -
ఎమ్మెల్యే కారుకు నో పర్మిషన్
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యా యి. మొదటి రోజు పూజల్లో పాల్గొనేందుకు వెళ్తున్న చిరుమర్తి కారును అనుమతి లేదంటూ టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అరగంట తర్వాత పైఅధికారుల సమాచారంతో ఎమ్మెల్యే ఒక్కరి కారునే అనుమతించారు. గన్‌మన్ మరో కారులో ఉండటంతో దానిని అనుమతించలేదు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే అక్కడి నుంచి కాలినడకన చెర్వుగట్టు పైకి చేరుకు న్నారు. ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్‌ను కూడా దేవాలయ సిబ్బంది పాటించకపోవడం గమనార్హం. కొండపైకి చేరుకున్న తర్వాత గేటుకు తాళం వేసి ఉం చారు. దీంతో ఆయన పక్కదారి నుంచి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గట్టుపైనే కార్య కర్తలతో కలసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను దళిత ఎమ్మెల్యే అయినందుకే గట్టుపైకి అనుమతి ఇవ్వకుండా అవమానించారన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల విషయంలోనూ స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయలేదని, ప్రొటోకాల్ సమాచారం కూడా ఇవ్వడం లేదని కలెక్టర్‌కు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
సాక్షి,నకిరేకల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశాన్ని గెలిపించాలని కోరుతూ నకిరేకల్ మండలం నోముల గ్రామంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మహ్మద్ హాజీ హుస్సేన్, మార్కెట్ వైస్ చైర్మన్ వీర్లపాటి రమేశ్, నాయకులు సామ సురేందర్‌రెడ్డి, కుంచం సోమయ్య, బాదిని సత్తయ్య, కే. శ్రీనివాస్‌రెడ్డి, ఎర్ర వెంకన్న, మాచర్ల శ్రీను, భూపతి నర్సింహ, బాదిని సత్తయ్య, శ్రీధర్, మాదాసు నాగరాజు, కొమ్ము రాములు, అబ్జల్, ఖదీర్, మద్గుమ్, వెంకన్న తదిత రులు ఉన్నారు. నకిరేకల్‌లోని 19వ వార్డులో ప్రచారం.. నకిరేకల్‌లో ప్రచారం.. టీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతూ నకిరేకల్‌లోని 19, 20వ వార్డుల్లో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొండ వెంకన్నగౌడ్, నాయకులు సోమా యాదగిరి, పెండెం సదానందం, సామ శ్రీనివాస్‌రెడ్డి, మంగినపల్లి రాజు, రాచకొండ వెంకన్న, కందాళ భిక్షంరెడ్డి, శేఖర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, కొరిమి వెంకన్న, గునగంటి రాజు, వంటెపాక శ్రీను, చౌగోని సైదులు, నార్కట్‌పల్లి రమేశ్, పందిరి యాదమ్మ, కనుకు సహాని, కొండ సబిత, షబానా, చిట్యాల నిర్మల తదితరులు పాల్గొన్నారు నార్కట్‌ల్లిలో ప్రచారం చేస్తున్న ఎంపీపీ. నార్కట్‌పల్లి : శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం గెలుపునకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎంపీపీ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి తెలిపారు. సోమవారం నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలోని 2వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షడు సట్టు సత్తయ్య, వైస్ ఎంపీపీ పుల్లెంల పద్మముత్తయ్య, మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, మాజీ ఉప సర్పంచ్ దుబ్బాక కళమ్మ రాంమల్లేశం, బాజ యాదయ్య, వేముల నర్సింహ, పుల్లెంల శ్రీనివాస్, రహీం, ముంత వెంకన్న, రమణ, ప్రజ్ఞాపురం రామకృష్ణ, బోయపల్లి శ్రీను, ఆజీజ్, విజయలక్ష్మి, దేవేందర్, టీజీ లింగం, తదితరులు ఉన్నారు. -
నా కల నెరవేరబోతోంది: కోమటిరెడ్డి
సాక్షి, నార్కట్‌పల్లి: నార్కెట్‌పల్లి మండలంలోని తన స్వగ్రామమైన బ్రాహ్మణవల్లంలలో జరుగుతున్న ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నందున తన కల నెరవేరబోతోందని అన్నారు. సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు 2018 ఫిబ్రవరిలో ట్రయల్ రన్ చేపడతారన్నారు. మంత్రి హరీష్‌రావు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే సాగర్ ఆయకట్టు మాదిరి ఈ ప్రాంతం కూడా మార్పు చెందుతుందన్నారు. ఈయన వెంట మాజీ ఎమ్మెల్యే లింగయ్య, పశుల ఊసయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
నార్కట్‌పల్లి (నకిరేకల్) : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన మండల కేంద్రంలోని వివేరా హోటల్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గణేష్ ఆనంద్ ఐడీఎల్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులు బుధవారం సాయంత్రం విధులు ముగించుకుని ఆటోలో నార్కట్‌పల్లికి వస్తున్నారు. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న బోలోరో ట్రాలీ వీరి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆటో రోడ్డు పక్కన పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురురికి తీవ్రగాయలు కావడంతో చికిత్స నిమిత్తం 108లో స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఏపీ.లింగోటం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఓరుగంటి సత్తయ్య(55) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆటోలో ఉన్న నార్కట్‌పల్లి చెందిన ఎం.లక్ష్మి, అరుణశ్రీ, డి.లక్ష్మి, సంధ్య, మరో ఒకరు తీవ్రగాయలతో చికిత్స పొందుతున్నారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటోను ఢీకొట్టి వెళ్లిపోయిన బోలోరోను మాడ్గులపల్లి టోల్గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డవారిని ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు బైరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. వెలిమినేడు వద్ద డీసీఎం డ్రైవర్.. చిట్యాల(నకిరేకల్) : ఆగి ఉన్న లారీని డీసీఎం వెనుక నుంచి ఢీకొనడంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామశివారులో జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. చిట్యాల ఎస్ఐ ఏ.శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం కొలనుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని బైరాంపల్లికి చెందిన గవ్వల వెంకటేష్(34) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వెంకటేష్ లోడుతో ఉన్న డీసీఎంతో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తూ చిట్యాల మండలం వెలిమినేడు శివారులో హైవేపై ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మోత్కూర్ వద్ద వృద్ధుడు..మోత్కూరు (తుంగతుర్తి) : బైక్ ఢీ కొనడంతో ఓ వృద్ధుడు మృతిచెందిన సంఘటన మోత్కూరు మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొండగడప గ్రామపంచాయతీ పరిధిలోని జటంగిబావికి చెందిన జటంగి లింగమల్లు(60) మండల కేంద్రంలో తన యజమాని బైరు సత్యనారాయణ ఇంటికి వెళ్లి పాలు ఇచ్చి రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. లింగమల్లు ఓ చోట రోడ్డు క్రాస్ చేస్తుండగా బైక్‌పై అతివేగంగా వస్తున్న చిందం రాజు వెనుక నుంచి ఢీకొట్టాడు. బైక్ పక్కనే ఉన్న డ్రెయినేజీలో పడిపోయింది. లింగమల్లు తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో చికిత్స కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్-డీసీఎం ఢీ, ఇద్దరి మృతి
నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లాలోని మండల కేంద్ర శివారులో మంగళవారం మధ్యాహ్నం డీసీఎం- బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిశీధిలో ఘోరం
నిశీధిలో నెత్తురోడిన రహదారులు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం పీఏపల్లి, నార్కట్‌పల్లి మండలాల్లో దుర్ఘటనలు పుణ్యక్షేత్రాలకు వెళ్లొస్తున్న ఓ కుటుంబాన్ని మార్గమధ్యలో మృత్యువు వెంటాడింది. మితిమీరిన వేగం.. ఆపై నిద్రమత్తు.. రెప్పపాటులో ఇద్దరిని కానరాని లోకాలకు తీసుకెళ్లింది. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో బుధవారం తెల్లవారుజామున లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో హైదరాబాద్‌కు చెందిన సింగిరెడ్డి భారతి రెడ్డి(62), వినయక్ శివరాంజురే(47) మృత్యువాత పడగా, మరో ఐదుగురు క్షతగాత్రులయ్యారు. - నార్కట్‌పల్లి నిబంధనలు అతిక్రమించి బైక్‌పై ప్రయాణిస్తున్న నలుగురిని మృత్యువు కబళించింది. మరో పది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనేలోగానే కారు వారి ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపేసింది. మితిమీరిన వేగం.. అజాగ్రత్త.. నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. పీఏపల్లి మండలం చిలకమర్రి స్టేజీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో పీఏపల్లి మండలం నేనావత్‌తండాకు చెందిన వడ్త్య భాస్కర్ (25), నెహ్రూ (19),డప్పు శివ (20)తోపాటుత్రిపురారం మండలం మాటూర్కు చెందిన రమావత్ లక్పతి (30) మృత్యువాత పడ్డారు. - దేవరకొండ అతివేగం..అజాగ్రత్త.. నిర్లక్ష్యం..నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణం...ఇవే ప్రమాదాలకు హేతువవుతాయి. పీఏపల్లి మండలం చిల్కమర్రి సమీపంలో నాగార్జునసాగర్- హైదరాబాద్ రాష్ట్ర రహదారి, నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై ఎల్లారెడ్డిగూడెం సమీపంలో మంగళ,బుధవారాల్లో చోటుచేసుకున్న ప్రమాదాలకు ఇవే కారణాలని తెలుస్తోంది. రాత్రి వేళ, అందులోనూ నిద్రమత్తు కళ్లు మూసి తెరుచుకునేలోపలే ఆరుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాహనదారుల్లో కొరవడిన అవగాహన లోపంతోనే జిల్లాలోని రహదారులపై నెత్తుటి మరకలు ఆరడం లేదని స్పష్టమవుతోంది. దేవరకొండ / నార్కట్‌పల్లి పీఏపల్లి మండలం నేనావత్‌తండాకు చెందిన వడ్త్య భాస్కర్ (25), త్రిపురారం మండలం మాటూర్కు చెందిన రమావత్ లక్పతి (30) బంధువులు. భాస్కర్ సోదరుడు సురేష్ హైదరాబాద్‌లో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ తమ బంధువైన లక్పతి వద్ద గతంలో నగదును అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పులో కొంత రుణం చెల్లిస్తానని సురేష్ చెప్పడంతో మంగళవారం లక్పతి, భాస్కర్ హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడ సురేష్ వద్ద నగదు తీసుకుని మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి కొండమల్లేపల్లికి బస్సులో వచ్చారు. చీకటి పడటం, తండాకు వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో వారిని తీసుకెళ్లేందుకు వడ్త్య నెహ్రూ(19), డప్పు శివ(20)లు బైక్‌పై తండా నుంచి కొండమల్లేపల్లికి వచ్చారు. అనంతరం నలుగురు అదే బైక్‌పై 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేనావత్‌తండాకు బయల్దేరారు. అయితే కారణాలు స్పష్టంగా తెలియకున్నా పీఏపల్లి మండలం చిల్కమర్రి స్టేజీ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న గుడిపల్లి పోలీసులు సంఘటనస్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బుధవారం ఉదయం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు భాస్కర్, లక్పతిలకు వివాహం కాగా నెహ్రూ, శివలు అవివాహితులు. శివ నల్లగొండలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, భాస్కర్, నెహ్రూ, లక్పతిలు కూలీ పని చేస్తూ జీవనం కొనసాగించేవారు. భాస్కర్, లక్పతిలకు మూడేళ్ల లోపు కుమారులున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిన్నంటిన రోదనలు ఒకే నేనావత్ తండాకు చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తండా శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న బం దువులు బుధవారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన బంధువులు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు ఆసుపత్రిలో మిన్నంటాయి. జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే పరామర్శ చిల్కమర్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వడ్త్య భాస్కర్, వడ్త్య నెహ్రూ, డప్పు శివ, లక్పతిల మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్, దేవరకొండ ఎమ్మె ల్యే రమావత్ రవీంద్రకుమార్‌లు బుధవారం సందర్శించా రు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలను ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను వారు పో లీసులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ గంగాధర్, డీఎస్పీ చంద్రమోహన్, రూరల్ సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులున్నారు. ఆరని నెత్తుటి మరకలు చింతపల్లి : మితిమీరిన వేగానికి నిర్లక్ష్యం తోడవడంతో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై నెత్తుటి మరకల తడి ఆరడం లేదు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా పుష్కర పనులు కొనసాగిస్తుండడం కూడా ప్రమాదాలకు ఓ కారణంగా చెప్పవచ్చు. రెండు నెలల వ్యవధిలో ఈ రోడ్డుపై పదకొండు మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం ఏదో ఒక చోట ఈ రహదారిపై చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళన కలిగిస్తున్నాయి. నిత్యం రద్దీగా.. ప్రతి రోజూ వందల సంఖ్యలో లారీలు, ఆటోలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలతో నాగార్జునసాగర్ - హైదరాబాద్ రాష్ట్ర రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. హైదరాబాద్ వైపు నుంచి గుంటూరు, నెల్లూరు, మాచర్ల, పొదిలి, ఒంగోలు, ప్రకాశం, దేవరకొండ, కొండమల్లేపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలతో రహదారి రద్దీగా దర్శనమిస్తోంది. ప్రైవేట్వాహన చోదకులు రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలను వేగంగా నడుపుతుండటమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ప్రమాదాలన్నింటికీ అతి వేగమే కారణమని స్పష్టమవుతోంది. రెండు నెలల కాలంగా ఈ రోడ్డుపై పుష్కర పనులు సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పనులు జరుగుతున్న కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క చింతపల్లి మండల పరిధిలోనే రెండు నెలల కాలంలో 8 ప్రమాదాలు జరుగగా 9 మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. సుమారు 50 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. -
ఏదీ..ఉదయసముద్రం
నకిరేకల్/నార్కట్‌పల్లి :ఉదయసముద్రం ప్రాజెక్టు పనులు నత్తకు నడక నేర్పి న చందంగా సాగుతున్నాయి. జిల్లాలోని నకిరేకల్, నల్లగొండ, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సు మారు లక్ష ఎకరాలకు సాగునీరు, 109 గ్రామాలకు తాగునీరు అందించాల్సిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయించేందుకు ఇటు అధికారులుగానీ,అటు ప్రజాప్రతినిధులు గానీ ప్రయత్నించకపోవడంతో ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొచ్చి వర్షాకాలంలో కూడా సాగునీరు లభించని గ్రామాలకు సైతం నీరందించడం ద్వారా కరువుఛాయలు లేకుండా చేయాలనే తలంపుతో గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఉదయసముద్రం-బ్రాహ్మణవెల్లం ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2007 సెప్టెంబర్ 4వ తేదిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి రూ. 699 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులకు నార్కట్‌పల్లి మం డలం బ్రాహ్మణవెల్లెంల గ్రామశివారులో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రెండు సంత్సరాల వరకు కూడా ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదు. తర్వాత 2009లో పనులు ప్రారంభమైనప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. 2012 నాటికి ప్రాజెక్టు నిర్మాణంపనులు పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా నేటికీ పూర్తి కాలేదు. ఒప్పందం గడువు కూడాపూర్తయి రెండేళ్లు దాటినా 50 శాతం పనులు కూడ పూర్తి కాలేదు. ప్రాజెక్టు మెత్తం విలువరూ. 699 కోట్లు కాగా ఇప్పుటి వరకూ ప్రభుత్వం కేవలం రూ. 199 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఇదీ.. ప్రాజెక్టు లక్ష్యం జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, నకిరేకల్, కట్టంగూరు, నల్లగొండ, శాలిగౌరారం మండలాలకు సాగు, తాగు నీటిని అందించాలనేది ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ప్రాజెక్టు నుంచి ఉదయ సముద్రంలోకి వచ్చిన నీటిని ఎత్తి పోతల ద్వారా తరలించి ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూర్చాల్సి ఉంది. ఇదే లక్ష్యంతో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని దివం గత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని ఒప్పించారు. రూ. 699 కోట్లతో ప్రాజెక్టు చేపట్టేందుకు 2007 జూన్ 13వ తేదిన జీఓ నెంబర్ 143 ను జారీ చేశారు. ప్రభుత్వ పరిపానల అమోదం కూడా తెలిపింది. నిధుల కొరత ప్రాజెక్టు మెత్తం విలువ రూ. 699 కోట్లు కాగా ఇప్పుటివరకు కేవలం రూ. 199 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. మిగతా నిధులు మంజూరు కాకపోవడంతో ఇతర నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. సొరంగమార్గం 10 కిలోమీటర్లు తవ్వాల్సి ఉండగా నేటివరకు 8 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. ప్రస్తుతం 292 ఎకరాల్లో ఎర్త్‌బండ్, మట్టికట్ట తదితర పనులు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. మరో రెండేళ్లపాటు పనులు కొనసాగిస్తే తప్ప ప్రాజెక్టు పూర్తికాదని వారు పేర్కొంటున్నారు. ముందుకు సాగని భూసేకరణ ఉదయసముద్రం ఎత్తిపోతల పథకంలో కుడి, ఎడమ కాల్వల నిర్మాణానికి భూసేకరణ పనులను నేటికీ పూర్తి చేయలేదు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 935 ఎకరాలు మాత్రమే సేకరించారు. ఇందులో 550 ఎకరాలు రిజర్వాయర్‌కు, 95 ఎకరాలు సొరంగానికి, 230 ఎకరాలు అప్రోచ్ కెనాల్‌కు, 60 ఎకరాలు సర్జ్పూల్కు సేకరించారు. కుడి కాల్వ కోసం 34.80 కిలోమీటర్లు, ఎడమ కాల్వ కోసం 18.70 కిలోమీటర్ల మేర భూమిని సేకరించాల్సి ఉంది. 4లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ప్రాజెక్టు ప్రాంభమైనప్పటి నుంచి ఇసుక కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రాజెక్టు, ఇతర నిర్మాణాలు పూర్తి కావాలంటే నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉంటుందని సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ ప్రభుత్వానికి నివేదించింది. కానీ దానిని అందించడంలో శ్రద్ధ లేదు. ఇసుక కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. రెండేళ్లలో పూర్తి చేయిస్తా లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన బ్రాహ్మణవెల్లంల- ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులను మరో రెండేళ్లలో పూర్తి చేయిస్తా. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి సమస్యలను వివరించాను. స్పందించిన సీఎం ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేకించి భూసేకరణ, ఇసుక కొరత తదితర సమస్యలు ఉన్నాయి. త్వరలో వీటిని కూడా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటాను. - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే, నల్లగొండ గత పాలకుల వైఫల్యంతోనే బ్రాహ్మణ వెల్లంల- ఉదయసముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పనులు గత పాలకుల వైఫల్యంతోనే అసంపూర్తిగా ఉన్నాయి. గత ప్రభుత్వాల్లో మంత్రులు ,ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారు నిర్మాణం పనులను పూర్తి చేయించలేకపోయారు. త్వరలోనే నిధుల విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతాం. నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయించేలా కృషి చేస్తా. - వేముల వీరేశం, ఎమ్మెల్యే, నకిరేకల్ సాగు నీటి కోసం ఎదూరు చూస్తున్నాం సాగునీటి కోసం ఎదురుచూస్తున్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో మా వ్యవసాయ భూమి కొంత కోల్పోయాను. ఈ ప్రాజెక్టు పూర్తయితే మాకు ఎంతో మేలు చేకూరుతుందని ఆశించాం. ఉన్న భూమిలో సాగు చేసుకుందామనుకుంటే నేటికీ పూర్తి కావడం లేదు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి పనులను పూర్తి చేసేలా చూడాలి. - డి.సోమిరెడ్డి, చౌడంపల్లి, నార్కట్‌పలి -
కారు టైర్ పగిలి..
నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ :నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం గ్రామ శివారులో ఓసీటీఎల్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిపై గవర్నర్ జాయింట్ సెక్రటరీ కారు టైర్ పగిలిపోవడంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి అడ్డం తిరిగింది. ఈ ప్రమాదంలో గవర్నర్ జాయింట్ సెక్రటరీ బసంత్‌కుమార్‌కు తీవ్రగాయాలు కాగా, ఆయన కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. కారు అతివేగంతోపాటు రోడ్డుపై ఇనుప వస్తువు లాంటిది తగలడంతో టైరు పగిలిపోయినట్టు పోలీసులు గుర్తించారు. స్థానిక కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బసంత్‌కుమార్‌ను గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. గవర్నర్ రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కార్యాలయంలో ముఖ్యమైన పని ఉన్నదని.. రాజ్‌భవన్‌లో గవర్నర్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న పట్నాల బసంత్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో, సోదరులు ముగ్గురు.. వారి వారి కుటుంబ సభ్యులతో వేర్వేరు కారుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తెల్లవారుజామున బయలుదేరారు. బసంత్‌కుమార్‌కు కార్యాలయంలో ముఖ్యమైన పనిఉందని చెప్పి, సోదరుల కంటే అర్ధగంట ముందుగానే తన వ్యాగనార్ కారు (ఏపీ11ఏకే9779)లో బయలుదేరారు. డ్రైవింగ్ ఆయనే చేస్తున్నారు. కారులో భార్య అనిత, కుమారుడు అభినవ్, కుమార్తె బెనితిలు ఉన్నారు. కారు ఓసీటీఎల్ కంపెనీ వద్దకు రాగానే వెనుకటైర్ ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలి పోయింది. అప్పటికే వేగం మీద ఉన్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి తిరిగి విజయవాడ రోడ్డు వైపు తిరిగింది. కారు ముందు అద్దాలు పగిలిపోయాయి. ఇంజిన్ ధ్వంసం కావడంతో ఆయిల్ మొత్తం రోడ్డుపై కారిపోయింది. డ్రైవింగ్ సీటు వైపు భాగం ధ్వంసమైంది. పగిలిపోయిన వెనుకచక్రం పూర్తిగా కారునుంచి విడిపోయింది. ఈ ప్రమాదంలో బసంత్‌కుమార్ తలకు బలమైన గాయాలు కాగా కుమారుడు అభినవ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భార్య, కుమార్తెకు ఏమీ కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కామినేని ఆస్పత్రి వారు వెంటనే తమ అంబులెన్స్‌తో సంఘటన స్థలానికి చేరుకుని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు. అంతకుముందే స్థానిక ఎస్ఐ ప్రణీత్‌కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని బసంత్‌కుమార్‌ను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం . కాగా, సీఐ రాఘవరావు ఆదేశాల మేరకు ఎస్ఐ ప్రణీత్‌కుమార్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. తరలివచ్చిన జిల్లా అధికారులు గవర్నర్ జాయింట్ సెక్రటరీ బసంత్‌కుమార్‌కు ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న జిల్లా అధికారులు హుటాహుటిన కామినేని అస్పత్రికి తరలివచ్చారు. కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఏఎస్పీ రమారాజేశ్వరి, నల్లగొండ ఆర్డీవో జహీర్, భువనగిరి డిప్యూటీ డీఈఓ మదన్మోహన్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. బసంత్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వీరి వెంట నార్కట్‌పల్లి డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్, సీఐ రాఘవరావు, ఎస్ఐ ప్రణీత్‌కుమార్, చెర్వుగట్టు ఎంపీటీసీ సభ్యుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ రమణబాలకృష్ణ, ఆర్ఐ నాగేందర్, వీఆర్ఓ బజూరి యాదయ్య ఉన్నారు. -
ఫైరింజిన్..మొరాయించెన్!
నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ : మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ఫైరింజిన్లే మొరాయిస్తే..పరిస్థితి అగమ్యగోచరమే. అలాంటి సంఘటనే ఇది. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలోని మునుగోడు రోడ్డులో వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ మెయిన్ వైరు ఆదివా రం మధ్యాహ్నం తెగిపడింది. ఆ ప్రాంతంలోని పత్తి, కందిచేలు, గడ్డివాములకు మంటలు అంటుకున్నాయి. గాలి తోడవడంతో దాదాపు 15 ఎకరాల మేర మంటలు పాకాయి. గమనించిన స్థానికులు నల్లగొండ అగ్నిమాపక కేంద్రానికి ఫోన్‌చేయగా రెండు ఫైరింజిన్లు వ చ్చాయి. ఫైరింజిన్లు ఘటన స్థలానికి చేరుకున్న తర్వాత చాలా సేపు మొరాయించాయి. ఇంజన్ల వైపు మంటలు వస్తుండడంతో స్థానికులు వాటిని కాపాడేందుకు ఎక్కువగా శ్రమించా రు. చివరకు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.