కారు టైర్ పగిలి.. | Governor Joint Secretary Car tire bursting Basant Kumar Injuries | Sakshi
Sakshi News home page

కారు టైర్ పగిలి..

Published Thu, Jun 5 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

కారు టైర్ పగిలి..

కారు టైర్ పగిలి..

నార్కట్‌పల్లి, న్యూస్‌లైన్ :నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం గ్రామ శివారులో ఓసీటీఎల్ కంపెనీ ఎదురుగా జాతీయ రహదారిపై గవర్నర్ జాయింట్ సెక్రటరీ కారు టైర్ పగిలిపోవడంతో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి అడ్డం తిరిగింది. ఈ ప్రమాదంలో గవర్నర్ జాయింట్ సెక్రటరీ బసంత్‌కుమార్‌కు తీవ్రగాయాలు కాగా, ఆయన కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. కారు అతివేగంతోపాటు రోడ్డుపై ఇనుప వస్తువు లాంటిది తగలడంతో టైరు పగిలిపోయినట్టు పోలీసులు గుర్తించారు. స్థానిక కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బసంత్‌కుమార్‌ను గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. గవర్నర్ రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

కార్యాలయంలో ముఖ్యమైన పని ఉన్నదని..
రాజ్‌భవన్‌లో గవర్నర్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న పట్నాల బసంత్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో, సోదరులు ముగ్గురు.. వారి వారి కుటుంబ సభ్యులతో వేర్వేరు కారుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తెల్లవారుజామున బయలుదేరారు. బసంత్‌కుమార్‌కు కార్యాలయంలో ముఖ్యమైన పనిఉందని చెప్పి, సోదరుల కంటే అర్ధగంట ముందుగానే తన వ్యాగనార్ కారు (ఏపీ11ఏకే9779)లో బయలుదేరారు. డ్రైవింగ్ ఆయనే చేస్తున్నారు. కారులో భార్య అనిత, కుమారుడు అభినవ్, కుమార్తె బెనితిలు ఉన్నారు. కారు ఓసీటీఎల్ కంపెనీ వద్దకు రాగానే వెనుకటైర్ ఒక్కసారిగా పెద్దశబ్ధంతో పేలి పోయింది. అప్పటికే వేగం మీద ఉన్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి తిరిగి విజయవాడ రోడ్డు వైపు తిరిగింది. కారు ముందు అద్దాలు పగిలిపోయాయి.

ఇంజిన్ ధ్వంసం కావడంతో ఆయిల్ మొత్తం రోడ్డుపై కారిపోయింది. డ్రైవింగ్ సీటు వైపు భాగం ధ్వంసమైంది. పగిలిపోయిన వెనుకచక్రం పూర్తిగా కారునుంచి విడిపోయింది. ఈ ప్రమాదంలో బసంత్‌కుమార్ తలకు బలమైన గాయాలు కాగా కుమారుడు అభినవ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. భార్య, కుమార్తెకు ఏమీ కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కామినేని ఆస్పత్రి వారు వెంటనే తమ అంబులెన్స్‌తో సంఘటన స్థలానికి చేరుకుని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు. అంతకుముందే స్థానిక ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని బసంత్‌కుమార్‌ను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం . కాగా, సీఐ రాఘవరావు ఆదేశాల మేరకు ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

తరలివచ్చిన జిల్లా అధికారులు
గవర్నర్ జాయింట్ సెక్రటరీ బసంత్‌కుమార్‌కు ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న జిల్లా అధికారులు హుటాహుటిన కామినేని అస్పత్రికి తరలివచ్చారు. కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ  ప్రభాకర్‌రావు, ఏఎస్పీ రమారాజేశ్వరి, నల్లగొండ ఆర్డీవో జహీర్, భువనగిరి డిప్యూటీ డీఈఓ మదన్‌మోహన్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. బసంత్‌కు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు. వీరి వెంట నార్కట్‌పల్లి డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్, సీఐ రాఘవరావు, ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్, చెర్వుగట్టు ఎంపీటీసీ సభ్యుడు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ రమణబాలకృష్ణ, ఆర్‌ఐ నాగేందర్, వీఆర్‌ఓ బజూరి యాదయ్య ఉన్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement