
ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన కారు
కావలిరూరల్: దైవదర్శనం చేసుకుని వస్తున్న ఆ కుటుంబంలో విషాదం నిండింది. కారు టైరు పేలిన ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం పాలయ్యారు. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం అల్లిగుంటపాళెం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. కావలి రూరల్ ఎస్‌ఐ వెంకటరావు తెలిపిన మేరకు.. విశాఖపట్నం జిల్లాలో పరవాడ మండలం బర్నికంలోని వైజయంతి గార్డెన్స్‌లో ఎస్‌టీబీఎల్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని ప్లాట్ నంబరు 30లో బొంగరాల ఉదయకిరణ్ కుటుంబం నివాసం ఉంటుంది.
ఆ కుటుంబానికి చెందిన పదిమంది కారులో తిరుమల వెళ్లారు. శనివారం స్వామిదర్శనం చేసుకుని ఆదివారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. నెల్లూరు వద్ద టిఫిన్ చేశారు. కావలి వద్దకు వచ్చేసరికి కారు టైర్ పగిలి అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని సుమారు 40 మీటర్ల దూరం వరకు వెళ్లి బోల్తాపడింది. కారు నడుపుతున్న ఉదయకిరణ్ (38), ముందు సీట్లో కూర్చున్న అతడి తల్లి బొంగరాల వేణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఉదయకిరణ్ భార్య ధనలక్ష్మి, సోదరుడు బొంగరాల మణికంఠ, అతడి భార్య సౌజన్య, మరో సోదరుడు సూర్యకిరణ్, అతడి భార్య అనూష గాయపడ్డారు. పిల్లలు తన్వి, వివిన్, సుశాంక్ సురక్షితంగా ఉన్నారు. వారిలో ఒకరు ఫోన్ చేయడంతో 108 వాహనం వచ్చింది.
స్థానికుల సహాయంతో గాయపడినవారిని కావలి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్‌కిరణ్ సోలార్ కంపెనీలో సర్వీస్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment