Mother and son died
-
మాటలకందని విషాదం, మ్యాన్‌హోల్ పడి..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) పని తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న సివిల్స్ కోచింగ్ అభ్యర్థులు ముగ్గురు మరణించిన ఘటనలో ఎంసీడీపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత జరిగినా యంత్రాంగం మొద్దు నిద్రతో ఉండిపోయింది. ఫలితంగా.. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. ఇందులో ఘాజిపూర్ ఘటన అయితే మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. అప్పటిదాకా ఇంట్లో నానమ్మతో ఆడుకున్న చిన్నారి.. తల్లి బయటకు వెళ్తుంటే తాను మారాం చేశాడు. ‘‘వర్షం పడుతుంది వద్దులే మున్నా..’’ అని చెప్పినా మారాం వీడలేదు. చేసేది లేక ఆ కొడుకును వెంటపెట్టుకెళ్లిందామె. అయితే.. బోరు వర్షంలో బయటకు వెళ్లిన ఆ తల్లీకొడుకుల్ని మృత్యువు మ్యాన్‌హోల్ రూపంలో కబళించింది.ఢిల్లీ ఘాజిపూర్లో బుధవారం సాయంత్రం విషాదకర ఘటన చేసుకుంది. తనూజా బిష్ట్ అనే మహిళ మూడేళ్ల కొడుకుతో సహా తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడిపోయింది. ఆ ఇద్దరి ఆచూకీ కోసం సహాయక బృందాలు గంటల తరబడి గాలించి.. చివరకు 500 మీటర్ల దూరంలో మృతదేహాల్ని గుర్తించాయి. అయితే.. మరణంలోనూ ఆ అమ్మ ఆ బిడ్డను తన ఒడి నుంచి వీడలేదు. ఆ దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.ఇదిలా ఉంటే.. అధికారులు త్వరగతిన స్పందించి ఉంటే తన భార్యాబిడ్డలు బతికి ఉండేవాళ్లని.. ఆమె భర్త హరీష్ రావత్ రోదిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం అందిందని, రెండు గంటల తర్వాత సిబ్బంది వచ్చారని, పైగా సరైన పరికరాలు లేవని మరో గంట తర్వాతే సహాయక చర్యలను ప్రారంభించారని చెబుతున్నాడాయన. స్థానికులు సైతం మున్సిపల్ సిబ్బంది స్పందించిన తీరును తప్పుబడుతున్నారు. అయితే ఆ ఆరోపణల్ని ఖండించిన మున్సిపల్ సిబ్బంది.. ఆ మ్యాన్ హోల్ మూడు నెలలుగా తెరిచే ఉందని అధికారులు చెబుతుండడం గమనార్హం.#Ghazipur, #UttarPradesh: "Yesterday, a mother and her daughter died after falling into a drain. Due to waterlogging, they couldn't figure out where to go. There are no facilities here. pic.twitter.com/YcWEau5J6j— Siraj Noorani (@sirajnoorani) August 1, 2024#delhirain fury claims life of a young mother & child 22YO Tanuja was on her way home carrying her 3yr old son Priyansh. She tripped into an open drain in #Ghazipur. pic.twitter.com/1bj3ZR4CY2— The Munsif Daily (@munsifdigital) August 1, 2024 -
గుండె పోటుతో తల్లి మృతి... తట్టుకోలేక ఆగిన కుమారుడి ఊపిరి
ఒడిశా: తల్లీ కొడుకుల పేగు బంధం విడిపోనిది. తల్లిపై ఆ కుమారుడి మమకారం చెప్పలేనిది. అందుకే తల్లి మరణవార్త తెలుసుకున్న కుమారుడి గుండె కూడా ఆగిపోయింది. ఆదివారం వేర్వేరు చోట్ల జరిగిన ఈ విషాద ఘటనల వివరాల్లోకి వెళ్తే...రాజాం పట్టణానికి చెందిన యందవ కురమమ్మ(50) శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం కూడా విధులకు హాజరైన ఆమెకు ఒక్కసారిగా గుండెలో నొప్పి రావడంతో బీపీ, షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు తొలుత పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో టెక్కలి ఏరియా ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. అక్కడకు తరలించేందుకు సిద్ధపడుతున్న సమయంలో తీవ్రమైన గుండె పోటుకు గురై మృతి చెందినట్టు ఆర్టీసీ డిపో మేనేజరు ఆర్.సీతారామనాయుడు తెలిపారని స్థానికులు పేర్కొన్నారు. ఆమె మృతి చెందిన విషయం రాజాంలోని మెంటిపేట ఎస్సీ కాలనీలో ఉన్న బంధువులకు తెలియడంతో విషాదంలో మునిగిపోయారు. తల్లి వెంటే తనయుడు యందవ కురమమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు యందవ అమర్ (24) ఏలూరులో ఆర్సీఎం చర్చిలో ఫాదర్ శిక్షణ పొందుతున్నాడు. తల్లి మరణవార్త తెలియగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ వార్త రాజాంలోని బంధువులకు తెలియడంతో ఆయన మృతదేహం తీసుకువచ్చేందుకు అక్కడకు పయనమయ్యారని స్థానికులు తెలిపారు. తల్లి మరణవార్త తెలియగానే కుమారుడు కుప్పకూలిపోయి మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దరి విడదీయరాని పేగు బంధం పలువురిని కంటతడి పెట్టించింది. -
తల్లిని కొట్టి చంపి.. కాసేపటికే రక్తపు మడుగులో పడి..
మాచారెడ్డి: ఇంట్లో గొడవ.. ఓ కొడుకు తల్లిని కర్రతో బాదడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.. గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందింది.. మృతదేహాన్ని తీసుకుని ఇంటికి తిరిగొచ్చేసరికి.. ఆ కొడుకు కూడా ఇంట్లో రక్తపు మడుగు మధ్య చనిపోయి ఉన్నాడు. శుక్రవారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట గ్రామంలో కేవలం గంటన్నర వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతో..: చిటుకుల నర్సమ్మ (67), ఆమె కుమారుడు నర్సారెడ్డి (45), ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలిసి భవానీపేటలో ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా నర్సారెడ్డి భార్య పిల్లలను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. అదే గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. తల్లీకొడుకులు నర్సమ్మ, నర్సారెడ్డి సొంత ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల అయ్యప్పమాల వేసుకున్న నర్సారెడ్డి.. రెండు రోజుల క్రితమే శబరిమల యాత్రకు వెళ్లివచ్చాడు. శుక్రవారం సాయంత్రం తన భార్యను ఇంటికి రప్పించాలంటూ తల్లితో నర్సారెడ్డి గొడవకు దిగాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. నర్సారెడ్డి ఆవేశంతో కర్రతో నర్సమ్మ తలపై బాదాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను గ్రామస్తులు కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. దీంతో వారు నర్సమ్మ మృతదేహాన్ని భవానీపేటలోని ఇంటికి తీసుకువచ్చారు. కానీ అప్పటికే ఇంట్లో రక్తం మడుగులో నర్సారెడ్డి మృతిచెంది కనిపించాడు. ఇది చూసి గ్రామస్తులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చారు. కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే నర్సారెడ్డి తలకు పెద్ద గాయమైనట్టు కనిపిస్తుండటం, రక్తపు మడుగు మధ్య పడి ఉండటంతో ఆయనను ఎవరో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. -
కారు టైరు పేలి తల్లీకొడుకు దుర్మరణం
కావలిరూరల్: దైవదర్శనం చేసుకుని వస్తున్న ఆ కుటుంబంలో విషాదం నిండింది. కారు టైరు పేలిన ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం పాలయ్యారు. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం అల్లిగుంటపాళెం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం జరిగింది. కావలి రూరల్ ఎస్ఐ వెంకటరావు తెలిపిన మేరకు.. విశాఖపట్నం జిల్లాలో పరవాడ మండలం బర్నికంలోని వైజయంతి గార్డెన్స్‌లో ఎస్టీబీఎల్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని ప్లాట్ నంబరు 30లో బొంగరాల ఉదయకిరణ్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ కుటుంబానికి చెందిన పదిమంది కారులో తిరుమల వెళ్లారు. శనివారం స్వామిదర్శనం చేసుకుని ఆదివారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యారు. నెల్లూరు వద్ద టిఫిన్ చేశారు. కావలి వద్దకు వచ్చేసరికి కారు టైర్ పగిలి అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని సుమారు 40 మీటర్ల దూరం వరకు వెళ్లి బోల్తాపడింది. కారు నడుపుతున్న ఉదయకిరణ్ (38), ముందు సీట్లో కూర్చున్న అతడి తల్లి బొంగరాల వేణమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉదయకిరణ్ భార్య ధనలక్ష్మి, సోదరుడు బొంగరాల మణికంఠ, అతడి భార్య సౌజన్య, మరో సోదరుడు సూర్యకిరణ్, అతడి భార్య అనూష గాయపడ్డారు. పిల్లలు తన్వి, వివిన్, సుశాంక్ సురక్షితంగా ఉన్నారు. వారిలో ఒకరు ఫోన్ చేయడంతో 108 వాహనం వచ్చింది. స్థానికుల సహాయంతో గాయపడినవారిని కావలి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉదయ్‌కిరణ్ సోలార్ కంపెనీలో సర్వీస్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. -
విషాదం: అన్నయ్యల ఆశీర్వాదం తీసుకోకుండానే..
చోడవరం/సబ్బవరం(విశాఖపట్నం): సోదరులకు రాఖీ కట్టడానికి కన్నవారింటికి బయల్దేరిందామె.. మరికాసేపట్లో అన్నలిద్దరి ఆశీర్వాదం తీసుకోవాల్సివుండగా.. మృత్యువు ఇసుక లారీ రూపంలో ఎదురొచ్చింది. కొడుకుతో సహా ఆమెను కబళించింది. ఈ విషాదకర ఘటన చోడవరం మండలం దుడ్డుపాలెం జంక్షన్ సమీపంలో గురువారం ఉదయం జరిగింది. సబ్బవరం మండలం పెద యాతపాలెం గ్రామానికి చెందిన శరగడం సత్యవతి (34), తన కుమారుడు సుఖేష్‌రామ్ (18)తో కలిసి ఉదయం 8 గంటలకు తన కన్నవారి ఊరైన మునగపాక బయల్దేరారు. చదవండి: అన్నమయ్య జిల్లాలో దారుణం.. కోడలి తల నరికిన అత్త.. కారణం అదే? సుఖేష్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా తల్లి సత్యవతి వెనుక కూర్చున్నారు. సబ్బవరం– వెంకన్నపాలెం రోడ్డులో దుడ్డుపాలెం జంక్షన్ సమీపంలోకి రాగానే ఎదురుగా వెంకన్నపాలెం వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ ఆకస్మికంగా మోటారు సైకిల్‌ను ఢీకొట్టింది. అతివేగంగా వస్తున్న ఇసుక లారీ బలంగా ఢీకొట్టడంతో మోటారు సైకిల్‌తోపాటు లారీ కూడా రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయాయి. మోటార్ సైకిల్‌పై వస్తున్న తల్లీకొడుకులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆనందం.. అంతలోనే విషాదం శరగడం సత్యవతి స్వగ్రామం మునగపాక. అక్కడ ఆమె సోదరులు ఉంటారు. వారికి రాఖీ కట్టి.. ఆ ఊళ్లో ఉన్న తన పొలంలో వరినాట్లు వేయాలని భావించిందామె. కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఆమెకు భర్త రాంబాబు, కుమార్తె కుందన ఉన్నారు. కన్నీరుమున్నీరవుతున్న వారిద్దరినీ ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో సబ్బవరం మండలం పెద యాతపాలెం, మునగపాక గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణం లారీని అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా అతి వేగంగా నడిపాడు. అంతేకాకుండా తాను వెళ్లే వైపు కాకుండా పూర్తిగా కుడివైపునకు ఒక్కసారిగా వచ్చి మోటారు సైకిల్‌ను ఢీకొట్టాడు. ఆ సమయంలో మరే వాహనం వచ్చినా వాటిని కూడా ఈ లారీ ఢీకొట్టి ఉండేదని అక్కడి వారు చెప్పారు. -
అక్కడ మలుపు తిరిగినా, నెమ్మదిగా దారి చూసుకుంటూ వెళ్లినా ఇలా జరిగేది కాదేమో!
సాక్షి, శ్రీకాకుళం: చీకటిలో కాకుండా కాస్త వెలుగు వచ్చాక బయల్దేరి ఉంటే ఆ తల్లీకొడుకులు బతికి ఉండే వారేమో..? కాసింత నెమ్మదిగా దారి చూసుకుంటూ వెళ్లి ఉంటే ఆయువు నిలిచి ఉండేదేమో..? ఆ కల్వర్టు ముందు మలుపు తీసుకుని ఉన్నా.. ఈ పాటికి ఇంటిలో నవ్వుతూ తిరిగేవారేమో..? ఆ ప్రదేశంలోనే వారి మృత్యువు రాసి పెట్టి ఉన్నట్లు కల్వర్టులో పడి ఇద్దరూ కన్నుమూశారు. సారవకోట మండలంలోని బుడితి జంక్షన్‌కు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన తల్లి, కుమారుడు కలగ రమణమ్మ(38) మణికంఠ (19)లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వేకువజామున.. పెద్దపాడు గ్రామానికి చెందిన తల్లీకొడుకులు గురువారం జలుమూరు మండలంలోని అచ్చుతాపురం గ్రామంలో జరిగిన యాదవుల గావు పండుగకు వెళ్లారు. రాత్రి బంధుమిత్రులతో సరదాగా గడిపి వేకువజామునే బైక్‌పై స్వగ్రామానికి బయల్దేరారు. చల్లవానిపేట, శ్రీముఖలింగం రో డ్డు విస్తరణ పనుల్లో భాగంగా బుడితి జంక్షన్‌కు సమీపంలో కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కల్వర్టు నిర్మాణం కోసం డైవర్షన్ ఏర్పాటు చేశారు. కానీ వేకువజామున ప్రయాణం పెట్టుకున్న మణికంఠ ఈ డైవర్షన్‌ను గమనించలేదు. బండిని పక్కకు తిప్పకుండానే రుగా ముందుకు వెళ్లడంతో బైక్‌తో సహా కల్వర్టులో పడి అక్కడికక్కడే తల్లీకొడుకు మృతి చెందారు. స్థానికులు వీరిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతుల కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. మణికంఠకు ఇద్దరు అక్కలు ఉన్నారు. ఒక్కడే కొడుకు కావడంతో తండ్రి కలగ అప్పారావు గుండెలవిసేలా రోదించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిరమండలం ఎస్ఐ మధుసూదనరావు కేసు నమోదు చేసి మృతదేహాలను పాతపట్నం తరలించారు. చదవండి: విజయనగరం ఎంపీ చంద్రశేఖర్‌కు లోక్‌సభ స్పీకర్ ప్రశంసలు హెచ్చరిక బోర్డు లేకపోవడం వల్లనేనా..? కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్న చోట హె చ్చరిక బోర్డులు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. అదేమార్గంలో రోడ్డు నిర్మా ణ పనులకు సంబంధించిన వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు కలగజేసుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ రోడ్డు ప్ర మాదం జరిగిన ప్రదేశం సారవకోట పోలీసు స్టేషన్ పరిధికి వస్తుందా? జలుమూరు పోలీసు స్టేషన్ పరిధికి వస్తుందా అని రెండు మండలాల పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. అనంతరం రెవె న్యూ సిబ్బంది సూచన మేరకు సారవకోట పోలీసులు సంఘటనా స్థలం దగ్గర తదుపరి కార్యకలాపాలు నిర్వహించారు. చదవండి: సీఎంకు హృదయపూర్వక ధన్యవాదాలు: మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ -
‘అమ్మా నేనొస్తా’.. తల్లి మరణించిన కొన్ని గంటలకే
మండ్య: కరోనా సోకి తల్లి మరణిస్తే, ఆ వ్యథతో కుమారుడు గుండెపోటుతో చనిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన కర్నాటకలోని మండ్య నగరంలో జరిగింది. సుభాష్‌నగరకు చెందిన సుజాతకు ఈనెల 7వ తేదీన కరోనా లక్షణాలు రావడంతో కుమారుడు సీఎన్ రమేశ్ కీలార కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో చేర్పించాడు. ఆమె చికిత్స పొందుతూ ఈనెల 9వ తేదీన రాత్రి తుదిశ్వాస విడిచింది. కరోనాతో మృతి చెందడంతో కుమారుడికి తల్లి కడసారి చూపు దక్కలేదు. అతడు లేకుండా ఆరోగ్య సిబ్బంది అంత్యక్రియలు జరిపించారు. ఈ పరిణామాలతో కుమారుడు కృంగిపోయాడు. తల్లిని గుర్తు చేసుకుంటూ కొన్నిగంటలకే ఇంట్లో గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. జాగ్రత్తలు పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చు. చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా -
సొంత గ్రామానికి వెళ్లాలనే కోరికే..
రాయచోటి టౌన్: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం చెందారు. వైఎస్సార్ జిల్లాలో రాయచోటి–చిత్తూరు జాతీయ రహదారిలోని రాయచోటి రింగ్ రోడ్డు సమీపాన ఆదివారం తెల్లవారుజామున కారు, ఐషర్ వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ఆత్మకూరుకు చెందిన జయలక్ష్మి భర్త అకాల మరణంతో ఇద్దరు కుమారులను ప్రయోజకులను చేయాలనుకుంది. అనుకున్న విధంగానే ఇద్దరినీ తీర్చిదిద్దింది. ఇద్దరు కొడుకులు స్థిరపడ్డారనుకొంటున్న సమయంలో చిన్నకొడుకుతోపాటు తాను కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లింది. జయలక్ష్మికి పదేళ్ల క్రితమే భర్త చనిపోయాడు. ఇద్దరి కుమారుల పోషణ బాధ్యత ఆమెపై పడింది. ఇద్దరినీ ఇంజినీరింగ్ వరకు చదివించింది. పెద్దకుమారుడు దినేష్‌కుమార్‌రెడ్డి ఉద్యోగం రాకపోవడంతో బెంగళూరులోనే తల్లితో కలిసి క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు కార్తీక్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సొంతూరికి వెళుతుండగా.. లాక్డౌన్ కారణంగా కొన్ని నెలలుగా స్వగ్రామానికి వెళ్లలేదు. సడలింపుల తర్వాత సొంత గ్రామానికి వెళ్లాలనే కోరికే వారి ప్రాణం తీసింది. చిన్న కుమారుడు రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వచ్చాడు. తన మిత్రుడి కారు తీసుకొని తల్లితో కలిసి శనివారం రాత్రి బెంగళూరు నుంచి ఆత్మకూరుకు వెళ్లేందుకు బయలుదేరారు. రాయచోటిలోని డాబా సమీపానికి చేరుకోగానే కారు, ఐషర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్‌కుమార్‌రెడ్డి(26), పక్క సీట్లో ఉన్న అతని తల్లి జయలక్ష్మి(45) అక్కడికక్కడే మృతిచెందారు. వెనుక సీట్లో ఉన్న మిత్రుడు సందీప్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి తీసుకెళ్లారు. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరణంలోనూ అమ్మకు తోడుగా..
కడియం: నవమాసాలూ మోసి, కని, పెంచి.. ఇంతటివాడిని చేసిన తల్లి కళ్లముందే విలవిల్లాడిపోతుంటే చూస్తూ తట్టుకోలేకపోయాడు.. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో తల్లితోపాటు ప్రాణాలు విడిచాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. నర్సరీ రైతు పాటంశెట్టి వెంకట్రాయుడి భార్య సత్యవతి (55)కి శుక్రవారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే పెద్ద కుమారుడు శ్రీనివాసరావు (38), కుటుంబ సభ్యులు ఆమెను కారులో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముందు సీటులో కూర్చున్న శ్రీనివాసరావు ఫోనులో ఆస్పత్రి వర్గాలతో మాట్లాడుతున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి తల్లి ఆరోగ్యం మరింత విషమించింది. గుండె నొప్పితో తల్లి కళ్లెదుటే అల్లాడిపోతుంటే చూడలేక శ్రీనివాసరావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఫోనులో మాట్లాడుతూనే సీటులో పక్కకు ఒరిగిపోయాడు. కారులో ఉన్నవాళ్లకేమీ అర్థం కాలేదు. శ్రీనివాసరావును తట్టి లేపుతూనే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులు పరీక్షించేసరికే తల్లీకొడుకులు మృతిచెందారు. ఇద్దరి మృతదేహాలను స్వగ్రామానికి తరలించి శనివారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఒకేసారి భార్యను, కుమారుడిని కోల్పోవడంతో వెంకట్రాయుడు కుమిలిపోతున్నాడు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆయనను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. తండ్రిలాగే నర్సరీ రైతైన శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కొడుకు ఇక లేడని ఆగిన తల్లి గుండె
కథలాపూర్(వేములవాడ): ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్‌బాట పట్టిన కొడుకు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన తల్లి గుండె ఆగిపోయింది. తల్లీకొడుకుల మృతితో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన గుంటుక నర్మద–మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అప్పులు పెరిగిపోవడం, ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో ఇద్దరు కొడుకులు గల్ఫ్‌బాట పట్టారు. కాగా, చిన్నకొడుకు గుంటుక గణేశ్ ఈనెల 3న బహ్రెయిన్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి గణేశ్ తల్లి నర్మద విలపిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం నర్మద (58) ఆకస్మికంగా మృతిచెందింది. కాగా, మృతురాలి భర్త మల్లయ్య మూడేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకు శవాన్ని చివరిచూపు చూడకుండానే తల్లి మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కారు ఢీకొని తల్లీ కుమారుడు దుర్మరణం
అన్నానగర్: బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు దుర్మరణం చెందారు. ఈ ఘటన నెరుప్పూర్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. ధర్మపురి జిల్లా పెన్నాగరమ్ తాలూకా ఏరియూర్ సమీపంలో ఉన్న నెరుప్పూర్‌కి చెందిన గోవిందన్. ఇతని భార్య ఇంద్రాణి (47). గోవిందన్ కొన్నేళ్లు ముందు మృతిచెందాడు. కొండైయనూరులో పౌష్టికాహార నిర్వాహకురాలిగా ఇంద్రాణి పని చేస్తోంది. వీరికి కార్తికేయన్ (25) అనే కుమారుడు, ప్రియ (22), అనే కుమార్తె ఉన్నారు. కార్తికేయన్ బీఈ పట్టభద్రుడు. చెన్నైలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. ప్రియ చెన్నైలో డెంటల్ మెడికల్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతుంది. బుధవారం సాయంత్రం ఇంద్రాణి, కార్తికేయన్ ఇద్దరూ నెరుప్పూర్ నుంచి బైక్‌లో ఏరియూర్ వైపు వెళుతున్నారు. నెరుప్పూర్ సమీపంలో బైక్ వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇంద్రాణి, కార్తికేయన్ ఇద్దరూ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న ఏరియూర్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పెరుమాల్ (40) కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. -
మృత్యువులోనూ వీడని పేగుబంధం
కరీమాబాద్: మృత్యువులోనూ తల్లీకొడుకులు పేగుబంధం వీడలేదు. అనారోగ్యానికి గురై గుండెపోటుతో కుమారుడు మృతిచెందగా.. ఆ మృతదేహం వద్ద రాత్రంతా ఏడ్చిన తల్లి సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందిన సంఘటన నగరంలోని వరంగల్ అండర్ రైల్వేగేట్ రంగశాయిపేటలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. బంధువులు, స్థానికుల కథనం ప్రకారం... నగరంలోని రంగశాయిపేటకు చెందిన ఆటో డ్రైవర్ కందగట్ల సూరన్న(53)కు గతంలో బైపాస్ సర్జరీ జరిగింది. ఈ క్రమంలో ఆయన కొంత అనారోగ్యానికి గురయ్యాడు. మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందడంతో బుధవారం ఉదయం వరకు కొడుకు మృతదేహం వద్ద ఏడ్చిన తల్లి కందకట్ల వెంకటలక్ష్మి(65) సొమ్మసిల్లి పడిపోయి తీవ్ర అస్వస్తతకు గురైంది. ఈ క్రమంలో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి వెంకటలక్ష్మి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తిరిగి రంగశాయిపేటకు చెందిన అంబులెన్స్‌లో వెంకటలక్ష్మి మృతదేహాన్ని తీసుకొచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. రంగశాయిపేటలో విషాదం.. గుండెపోటుతో మృతి చెందిన కొడుకు సూరన్న, ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పడిపోయి తల్లి వెంకటలక్ష్మి కూడా మృతి చెందడంతో రంగశాయిపేటలో వి షాదఛాయలు అలుముకున్నాయి. ఓ పక్క కొడు కు మృతదేహాన్ని పాడెపై పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్లి దహన సంస్కారాలు చేయగానే తల్లి కూడా మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తిరిగి ఆమె మృతదేహాన్ని కూడా పాడెపై పెట్టి బంధువులు, కుటుంబ సభ్యులు మోసుకెళ్తున్న దృశ్యం అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ లేవ లేనిస్థితిలో ఉన్న వెంకటలక్ష్మి భర్త సాంబయ్య దుఖాన్ని ఆపే శక్తి ఎవరికీ లేని పరిస్థితి ఏర్పడింది. -
రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడి మృతి
పశ్చిమ గోదావరి జిల్లా : ఏలూరు నగరం తంగెళ్లమూడి సమీపంలోని పంటకాలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లీకుమారుడు మృతిచెందారు. మోటారు సైకిల్‌పై తల్లీకుమారుడు వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు స్థానికంగా నివాసం ఉంటున్న మంగ(45), సాయి(20)గా గుర్తించారు. తల్లి స్థానికంగా ఉన్న హీరోహోండా షోరూంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. రోజూ మాదిరి పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పదస్థితిలో తల్లీకుమారుడు మృతి
♦ నరసరావుపేట పట్టణంలో ఘటన ♦ ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు నరసరావుపేట టౌన్ : అనుమానాస్పద స్థితిలో తల్లీ ఆమె కుమారుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేటలో చోటుచేసుకుంది. ఒన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రామిరెడ్డిపేట పాతసమితి కార్యాలయం సెంటర్ సమీపంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న సిరిగిరి విజయలక్ష్మి (67), ఆమె కుమారుడు సిరిగిరి గురుప్రసాదు (35) ఉదయం 9 గంటలవరకు ఇంటి తలుపులు తీయలేదు. దీంతో ఆ ఇంటిపైన నివాసం ఉంటున్న వారు కేకలు వేసి పిలవగా వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కిటికీల ద్వారా లోపల పరిస్థితిని చూశారు. మధ్య గదిలో తల్లి విజయలక్ష్మి, చివరి గదిలో కుమారుడు గురుప్రసాదు మృతిచెంది ఉన్నారు. ఈ సమాచారాన్ని ఒన్‌టౌన్ పోలీసులకు తెలియజేయటంతో ఇన్చార్జి సీఐ శరత్‌బాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వారి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని నిర్థారించారు. మృతులు ఇద్దరు ఏదైనా విషం సేవించి మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు విజయలక్ష్మి నోటివెంట రక్తం వచ్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకున్నారు. వారిని అడిగి సీఐ వివరాలను సేకరించారు. విజయలక్ష్మికి మొత్తం నలుగురు సంతానం కాగా కుమారుడు గురుప్రసాదు మినహా మిగతా వారందరికీ వివాహాలై వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. పెద్దకుమారుడు శ్రీనివాసరావు బెంగుళూరులో ఉంటుండగా, పెద్దకుమార్తె కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోనూ, చిన్న కుమార్తె ఖమ్మం జిల్లా మధిరలో నివాసం ఉంటున్నారు. కాగా మృతిచెందిన గురుప్రసాదుకు మతిస్థిమితం సరిగ్గా ఉండదని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి భర్త సుమారు చాల్లా ఏళ్ల క్రితమే మృతిచెందారు. ఈ అద్దె ఇంట్లో తల్లీ కుమారుడు మాత్రమే నివాసం ఉంటున్నారు. జిల్లా కేంద్రం గుంటూరు నుంచి క్లూస్‌టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక ఆధారాలు సేకరించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.