అనుమానాస్పదస్థితిలో తల్లీకుమారుడు మృతి | Mother and son died in mysterious condition | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదస్థితిలో తల్లీకుమారుడు మృతి

Published Sat, Jul 11 2015 1:44 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

అనుమానాస్పదస్థితిలో తల్లీకుమారుడు మృతి - Sakshi

అనుమానాస్పదస్థితిలో తల్లీకుమారుడు మృతి

♦ నరసరావుపేట పట్టణంలో ఘటన
♦ ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు
 
 నరసరావుపేట టౌన్ : అనుమానాస్పద స్థితిలో తల్లీ ఆమె కుమారుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం నరసరావుపేట పట్టణంలోని రామిరెడ్డిపేటలో చోటుచేసుకుంది. ఒన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రామిరెడ్డిపేట పాతసమితి కార్యాలయం సెంటర్ సమీపంలో ఓ అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న సిరిగిరి విజయలక్ష్మి (67), ఆమె కుమారుడు సిరిగిరి గురుప్రసాదు (35) ఉదయం 9 గంటలవరకు ఇంటి తలుపులు తీయలేదు. దీంతో ఆ ఇంటిపైన నివాసం ఉంటున్న వారు కేకలు వేసి పిలవగా వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కిటికీల ద్వారా లోపల పరిస్థితిని చూశారు. మధ్య గదిలో తల్లి విజయలక్ష్మి, చివరి గదిలో కుమారుడు గురుప్రసాదు మృతిచెంది ఉన్నారు.

ఈ సమాచారాన్ని ఒన్‌టౌన్ పోలీసులకు తెలియజేయటంతో ఇన్‌చార్జి సీఐ శరత్‌బాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వారి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని నిర్థారించారు. మృతులు ఇద్దరు ఏదైనా విషం సేవించి మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు విజయలక్ష్మి నోటివెంట రక్తం వచ్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకున్నారు. వారిని అడిగి సీఐ వివరాలను సేకరించారు. విజయలక్ష్మికి మొత్తం నలుగురు సంతానం కాగా కుమారుడు గురుప్రసాదు మినహా మిగతా వారందరికీ వివాహాలై వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.

పెద్దకుమారుడు శ్రీనివాసరావు బెంగుళూరులో ఉంటుండగా, పెద్దకుమార్తె కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోనూ, చిన్న కుమార్తె ఖమ్మం జిల్లా మధిరలో నివాసం ఉంటున్నారు. కాగా మృతిచెందిన గురుప్రసాదుకు మతిస్థిమితం సరిగ్గా ఉండదని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మి భర్త సుమారు చాల్లా ఏళ్ల క్రితమే మృతిచెందారు. ఈ అద్దె ఇంట్లో తల్లీ కుమారుడు మాత్రమే నివాసం ఉంటున్నారు. జిల్లా కేంద్రం గుంటూరు నుంచి క్లూస్‌టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక ఆధారాలు సేకరించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement