మాటలకందని విషాదం, మ్యాన్‌హోల్‌ పడి.. | Delhi Rain Tragedy: Mother And Son Duo Fall Manhole See What Happens Next | Sakshi
Sakshi News home page

మాటలకందని విషాదం, మ్యాన్‌హోల్‌ పడి..

Published Thu, Aug 1 2024 1:10 PM | Last Updated on Thu, Aug 1 2024 1:11 PM

Delhi Rain Tragedy: Mother And Son Duo Fall Manhole See What Happens Next

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(MCD) పని తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న సివిల్స్‌ కోచింగ్‌ అభ్యర్థులు ముగ్గురు మరణించిన ఘటనలో ఎంసీడీపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత జరిగినా యంత్రాంగం మొద్దు నిద్రతో ఉండిపోయింది. ఫలితంగా.. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు  11 మంది చనిపోయారు. ఇందులో ఘాజిపూర్‌ ఘటన అయితే మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. 

అప్పటిదాకా ఇంట్లో నానమ్మతో ఆడుకున్న చిన్నారి.. తల్లి బయటకు వెళ్తుంటే తాను మారాం చేశాడు. ‘‘వర్షం పడుతుంది వద్దులే మున్నా..’’ అని చెప్పినా మారాం వీడలేదు. చేసేది లేక  ఆ కొడుకును వెంటపెట్టుకెళ్లిందామె. అయితే.. బోరు వర్షంలో బయటకు వెళ్లిన ఆ తల్లీకొడుకుల్ని మృత్యువు మ్యాన్‌హోల్‌ రూపంలో కబళించింది.

ఢిల్లీ ఘాజిపూర్‌లో బుధవారం సాయంత్రం విషాదకర ఘటన  చేసుకుంది. తనూజా బిష్ట్‌ అనే మహిళ మూడేళ్ల కొడుకుతో సహా తెరిచి ఉన్న మ్యాన్‌ హోల్‌లో పడిపోయింది. ఆ ఇద్దరి ఆచూకీ కోసం సహాయక బృందాలు గంటల తరబడి గాలించి.. చివరకు 500 మీటర్ల దూరంలో మృతదేహాల్ని గుర్తించాయి. అయితే.. మరణంలోనూ ఆ అమ్మ ఆ బిడ్డను తన ఒడి నుంచి వీడలేదు.  ఆ దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది.

ఇదిలా ఉంటే.. అధికారులు త్వరగతిన స్పందించి ఉంటే తన భార్యాబిడ్డలు బతికి ఉండేవాళ్లని.. ఆమె భర్త హరీష్‌ రావత్‌ రోదిస్తున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం అందిందని, రెండు గంటల తర్వాత సిబ్బంది వచ్చారని, పైగా సరైన పరికరాలు లేవని మరో గంట తర్వాతే సహాయక చర్యలను ప్రారంభించారని చెబుతున్నాడాయన. స్థానికులు సైతం మున్సిపల్‌ సిబ్బంది స్పందించిన తీరును తప్పుబడుతున్నారు. అయితే ఆ ఆరోపణల్ని ఖండించిన మున్సిపల్‌ సిబ్బంది.. ఆ మ్యాన్‌ హోల్‌ మూడు నెలలుగా తెరిచే ఉందని అధికారులు చెబుతుండడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement