మృతి చెందిన తల్లీ కుమారుడు కురమమ్మ, అమర్ (ఫైల్)
ఒడిశా: తల్లీ కొడుకుల పేగు బంధం విడిపోనిది. తల్లిపై ఆ కుమారుడి మమకారం చెప్పలేనిది. అందుకే తల్లి మరణవార్త తెలుసుకున్న కుమారుడి గుండె కూడా ఆగిపోయింది. ఆదివారం వేర్వేరు చోట్ల జరిగిన ఈ విషాద ఘటనల వివరాల్లోకి వెళ్తే...రాజాం పట్టణానికి చెందిన యందవ కురమమ్మ(50) శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం కూడా విధులకు హాజరైన ఆమెకు ఒక్కసారిగా గుండెలో నొప్పి రావడంతో బీపీ, షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు తొలుత పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో టెక్కలి ఏరియా ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. అక్కడకు తరలించేందుకు సిద్ధపడుతున్న సమయంలో తీవ్రమైన గుండె పోటుకు గురై మృతి చెందినట్టు ఆర్టీసీ డిపో మేనేజరు ఆర్.సీతారామనాయుడు తెలిపారని స్థానికులు పేర్కొన్నారు. ఆమె మృతి చెందిన విషయం రాజాంలోని మెంటిపేట ఎస్సీ కాలనీలో ఉన్న బంధువులకు తెలియడంతో విషాదంలో మునిగిపోయారు.
తల్లి వెంటే తనయుడు
యందవ కురమమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు యందవ అమర్ (24) ఏలూరులో ఆర్‌సీఎం చర్చిలో ఫాదర్ శిక్షణ పొందుతున్నాడు.
తల్లి మరణవార్త తెలియగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ వార్త రాజాంలోని బంధువులకు తెలియడంతో ఆయన మృతదేహం తీసుకువచ్చేందుకు అక్కడకు పయనమయ్యారని స్థానికులు తెలిపారు. తల్లి మరణవార్త తెలియగానే కుమారుడు కుప్పకూలిపోయి మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దరి విడదీయరాని పేగు బంధం పలువురిని కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment