మరణంలోనూ అమ్మకు తోడుగా.. | Mother And Son Died Suddenly In East Godavari District | Sakshi
Sakshi News home page

మరణంలోనూ అమ్మకు తోడుగా..

Dec 29 2019 4:32 AM | Updated on Dec 29 2019 4:32 AM

Mother And Son Died Suddenly In East Godavari District - Sakshi

కడియం: నవమాసాలూ మోసి, కని, పెంచి.. ఇంతటివాడిని చేసిన తల్లి కళ్లముందే విలవిల్లాడిపోతుంటే చూస్తూ తట్టుకోలేకపోయాడు.. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో తల్లితోపాటు ప్రాణాలు విడిచాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. నర్సరీ రైతు పాటంశెట్టి వెంకట్రాయుడి భార్య సత్యవతి (55)కి శుక్రవారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే పెద్ద కుమారుడు శ్రీనివాసరావు (38), కుటుంబ సభ్యులు ఆమెను కారులో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముందు సీటులో కూర్చున్న శ్రీనివాసరావు ఫోనులో ఆస్పత్రి వర్గాలతో మాట్లాడుతున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి తల్లి ఆరోగ్యం మరింత విషమించింది.

గుండె నొప్పితో తల్లి  కళ్లెదుటే అల్లాడిపోతుంటే చూడలేక శ్రీనివాసరావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఫోనులో మాట్లాడుతూనే సీటులో పక్కకు ఒరిగిపోయాడు. కారులో ఉన్నవాళ్లకేమీ అర్థం కాలేదు. శ్రీనివాసరావును తట్టి లేపుతూనే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులు పరీక్షించేసరికే తల్లీకొడుకులు మృతిచెందారు. ఇద్దరి మృతదేహాలను స్వగ్రామానికి తరలించి శనివారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఒకేసారి భార్యను, కుమారుడిని కోల్పోవడంతో వెంకట్రాయుడు కుమిలిపోతున్నాడు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆయనను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. తండ్రిలాగే నర్సరీ రైతైన శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement