burrilanka
-
పాపం సాయి.. ఉద్యోగావకాశం వదులుకుని అమెరికా వెళ్తే...
కడియం: యూఎస్‌లో పెద్ద చదువు చదివి ఉన్నత స్థితికి చేరుకుంటాడని పంపిన బిడ్డ ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంకకు చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాసు (వాసు), సుశీల దంపతుల కుమారుడు సాయినరసింహ (25). చెన్నైలోని హిందుస్థాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది బీటెక్ చదివాడు. యూఎస్‌లో ఎంఎస్ చదవాలనేది సాయినరసింహ ఆకాంక్ష. ఇదే విషయాన్ని తలిదండ్రుల వద్ద వ్యక్తం చేశాడు. దీనికి వారు అంగీకరించి ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 6న యాఎస్లోని కనెక్టికట్ స్టేట్ పరిధిలోని న్యూ హెవెన్స్ యూనివర్శిటీకి పంపించారు. అక్కడ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ చదివే అవకాశం లభించడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు. బుర్రిలంకకు చెందిన సిద్దిరెడ్డి సత్తిబాబు కుమార్తె ఐశ్వర్య కూడా అక్కడే చదువుతోంది. సెలవులు కావడంతో మంగళవారం సాయినరసింహ, ఐశ్వర్య, మరో అయిదుగురు స్నేహితులు కలిసి సమీపంలోని విలేజ్‌ను సందర్శించేందుకు మినీ వ్యాన్‌లో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ గంటన్నరకే మరో మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి నరసింహతో పాటు, మరో ఇద్దరు మృతి చెందారు. ఐశ్వర్య గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నరసింహ సోదరి నందిని చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. మృతదేహం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు సాయి నరసింహ మృతి చెందినట్టు తెలియడంతో బుర్రిలంకలో విషాద వాతావరణం నెలకొంది. యూఎస్ వెళ్లిన మూడు నెలలకే మృత్యు ఒడికి చేరడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి తండ్రి శ్రీనివాసు (వాసు) నర్సరీ రైతుగా అందరికీ తలలోనాలుకగా ఉంటారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తోడ్పాటు అందిస్తుంటారు. బుధవారం ఉదయం పెద్ద ఎత్తున గ్రామస్తులు వాసు ఇంటికి చేరుకున్నారు. అమెరికా పంపడం తమ శక్తికి మించినదే అయినప్పటికీ బిడ్డ ఉన్నత స్థాయికి చేరుకుంటాడని పంపించామంటూ మృతుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బీటెక్ చేస్తుండగా ఉద్యోగావకాశం వచ్చినా ఎంఎస్ చదువుతానని వెళ్లి మృత్యు ఒడికి చేరాడని రోదిస్తున్నారు. యూఎస్ ప్రయాణానికి ముందు కుమారుడితో కలిసి తిరుమల వెళ్లామని చివరి క్షణాలను గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చే విషయంలో ఎంపీ భరత్‌రామ్ దృష్టికి తీసుకువెళ్లారు. శనివారానికి మృతదేహం బుర్రిలంకకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. (క్లిక్: అమెరికాలో తెలుగు విద్యార్థుల దుర్మరణం: అక్కడి డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోండి!) -
మరణంలోనూ అమ్మకు తోడుగా..
కడియం: నవమాసాలూ మోసి, కని, పెంచి.. ఇంతటివాడిని చేసిన తల్లి కళ్లముందే విలవిల్లాడిపోతుంటే చూస్తూ తట్టుకోలేకపోయాడు.. ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో తల్లితోపాటు ప్రాణాలు విడిచాడు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక గ్రామంలో ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. నర్సరీ రైతు పాటంశెట్టి వెంకట్రాయుడి భార్య సత్యవతి (55)కి శుక్రవారం రాత్రి గుండెపోటు వచ్చింది. వెంటనే పెద్ద కుమారుడు శ్రీనివాసరావు (38), కుటుంబ సభ్యులు ఆమెను కారులో రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ముందు సీటులో కూర్చున్న శ్రీనివాసరావు ఫోనులో ఆస్పత్రి వర్గాలతో మాట్లాడుతున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి తల్లి ఆరోగ్యం మరింత విషమించింది. గుండె నొప్పితో తల్లి కళ్లెదుటే అల్లాడిపోతుంటే చూడలేక శ్రీనివాసరావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఫోనులో మాట్లాడుతూనే సీటులో పక్కకు ఒరిగిపోయాడు. కారులో ఉన్నవాళ్లకేమీ అర్థం కాలేదు. శ్రీనివాసరావును తట్టి లేపుతూనే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యులు పరీక్షించేసరికే తల్లీకొడుకులు మృతిచెందారు. ఇద్దరి మృతదేహాలను స్వగ్రామానికి తరలించి శనివారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఒకేసారి భార్యను, కుమారుడిని కోల్పోవడంతో వెంకట్రాయుడు కుమిలిపోతున్నాడు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆయనను పరామర్శించి ధైర్యం చెబుతున్నారు. తండ్రిలాగే నర్సరీ రైతైన శ్రీనివాసరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
జక్కంపూడి సేవలు చిరస్మరణీయం
బుర్రిలంక (కడియం) :రాష్ట్ర మంత్రిగా, జిల్లాలో కీలకమైన నాయకుడిగా దివంగత జక్కంపూడి రామ్మోహనరావు సేవలు చిరస్మరణీయమని ఆయన మూడో వర్ధంతి సందర్భంగా బుర్రిలంకలో ఘనంగా నివాళులర్పించారు. మండల యూత్ కన్వీనర్ కొత్తపల్లి మూర్తి ఆధ్వర్యంలో భారీ వైద్యశిబిరం, రక్తదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పాల్గొన్నారు. రాజశేఖరరెడ్డి శిష్యునిగా జక్కంపూడి రామ్మోహనరావు తనదైన ముద్రవేశారని జగ్గిరెడ్డి పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జక్కంపూడి చొరవే కారణమని కుడుపూడి గుర్తు చేసుకున్నారు. కడియపులంక సర్పంచ్ వార పాపరాము, కడియం సొసైటీ అధ్యక్షులు గిరజాల బాబు, మాజీ ఎంపీపీ తోరాటి సత్యనారాయణ, రాజమండ్రి నగర పాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలరెడ్డి, చెల్లుబోయిన శ్రీను తదితరులు జక్కంపూడి సేవలను కొనియాడారు. రామ్మోహనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, సేవాదళ్ కన్వీనర్ సుంకర చిన్ని, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్ల ఆంజనేయులు, ఐఎన్ఏ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మార్గాని సత్యనారాయణ, కడియపులంక సొసైటీ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డి. వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల మనిషి జక్కంపూడి రాజమండ్రి సిటీ : ప్రజల మనిషి జక్కంపూడి రామ్మోహనరావు అని, అయన మరణించి మూడేళ్లయినా ఆయన జ్ఞాపకాలు, పేదలకు ఆయన చేసిన సేవలు అనునిత్యం కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పేర్కొన్నారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తృతీయ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి కంబాలచెరువు సమీపంలోని జక్కంపూడి చౌక్ వద్ద ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్పొరేషన్ వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిళారెడ్డి, కార్పొరేటర్లు బొంతా శ్రీహరిరావు, మజ్జి నూకరత్నం, మాజీ కార్పొరేటర్లు దంగేటి వీరబాబు, వాకచర్ల కృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు సుంకర చిన్ని, మేడపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, మాసా రామజోగ్, లంక సత్యనారాయణ, ఆరిఫ్, ఉమామహేశ్వరి, గారా త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.ధీరోదాత్తుడు జక్కంపూడి : జక్కంపూడి రామ్మోహనరావు ధీరోదాత్తుడని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ అధ్యక్షుడు దొండపాటి శంకర్రావు పేర్కొన్నారు. ట్రస్ట్ కార్యాలయంలో జక్కంపూడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఛాంబర్ ఆప్కామర్స్ అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు.