మృతుడు పాటంశెట్టి సాయి నరసింహ (ఫైల్)
కడియం: యూఎస్‌లో పెద్ద చదువు చదివి ఉన్నత స్థితికి చేరుకుంటాడని పంపిన బిడ్డ ఇక లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని సమాచారం అందుకుని గుండెలవిసేలా రోదిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంకకు చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాసు (వాసు), సుశీల దంపతుల కుమారుడు సాయినరసింహ (25). చెన్నైలోని హిందుస్థాన్ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఏడాది బీటెక్ చదివాడు. యూఎస్‌లో ఎంఎస్ చదవాలనేది సాయినరసింహ ఆకాంక్ష. ఇదే విషయాన్ని తలిదండ్రుల వద్ద వ్యక్తం చేశాడు. దీనికి వారు అంగీకరించి ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 6న యాఎస్‌లోని కనెక్టికట్ స్టేట్ పరిధిలోని న్యూ హెవెన్స్ యూనివర్శిటీకి పంపించారు. అక్కడ పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ చదివే అవకాశం లభించడంతో కుటుంబ సభ్యులు సంతోషించారు.
బుర్రిలంకకు చెందిన సిద్దిరెడ్డి సత్తిబాబు కుమార్తె ఐశ్వర్య కూడా అక్కడే చదువుతోంది. సెలవులు కావడంతో మంగళవారం సాయినరసింహ, ఐశ్వర్య, మరో అయిదుగురు స్నేహితులు కలిసి సమీపంలోని విలేజ్‌ను సందర్శించేందుకు మినీ వ్యాన్‌లో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ గంటన్నరకే మరో మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి నరసింహతో పాటు, మరో ఇద్దరు మృతి చెందారు. ఐశ్వర్య గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు నరసింహ సోదరి నందిని చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది.
మృతదేహం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు
సాయి నరసింహ మృతి చెందినట్టు తెలియడంతో బుర్రిలంకలో విషాద వాతావరణం నెలకొంది. యూఎస్ వెళ్లిన మూడు నెలలకే మృత్యు ఒడికి చేరడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి తండ్రి శ్రీనివాసు (వాసు) నర్సరీ రైతుగా అందరికీ తలలోనాలుకగా ఉంటారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా తోడ్పాటు అందిస్తుంటారు. బుధవారం ఉదయం పెద్ద ఎత్తున గ్రామస్తులు వాసు ఇంటికి చేరుకున్నారు.
అమెరికా పంపడం తమ శక్తికి మించినదే అయినప్పటికీ బిడ్డ ఉన్నత స్థాయికి చేరుకుంటాడని పంపించామంటూ మృతుడి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బీటెక్ చేస్తుండగా ఉద్యోగావకాశం వచ్చినా ఎంఎస్ చదువుతానని వెళ్లి మృత్యు ఒడికి చేరాడని రోదిస్తున్నారు. యూఎస్ ప్రయాణానికి ముందు కుమారుడితో కలిసి తిరుమల వెళ్లామని చివరి క్షణాలను గుర్తు చేసుకుని కుమిలిపోతున్నారు. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చే విషయంలో ఎంపీ భరత్‌రామ్ దృష్టికి తీసుకువెళ్లారు. శనివారానికి మృతదేహం బుర్రిలంకకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. (క్లిక్: అమెరికాలో తెలుగు విద్యార్థుల దుర్మరణం: అక్కడి డ్రైవింగ్ రూల్స్ తెలుసుకోండి!)
Comments
Please login to add a commentAdd a comment